సాగు నీరిస్తారా..ఇవ్వరా? | will provide drinking wate or not? | Sakshi
Sakshi News home page

సాగు నీరిస్తారా..ఇవ్వరా?

Published Sun, Dec 15 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

will provide drinking wate or not?

కావలి/జలదంకి, న్యూస్‌లైన్ :  సాగునీరు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ జలదంకి మండల రైతులు శనివారం కావలి వెంగళరావునగర్‌లో ఉన్న సోమశిల ప్రాజెక్టు కార్యాలయాన్ని ముట్టడించారు. జలదంకి మండల రైతు సంఘం నాయకుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండపాళెం, బ్రాహ్మణక్రాక, బీకే అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు భారీగా తరలివచ్చారు.
 
 కావలి కాలువ డీఈ రాజేంద్రప్రసాద్‌తో వాగ్వాదానికి దిగారు. పంటలు ఎండుతున్నా కనికరం కూడా లేదంటూ మండిపడ్డారు. ఐఏబీ సమావేశం నిర్ణయం మేరకు తాము సాగు చేపట్టామన్నారు. వరినాట్లు వేసి రోజులు తరబడి ఎదురుచూస్తున్న కావలి కాలువ నుంచి సాగు నీరు విడుదల కాలేదన్నారు.   రెండు రోజుల్లో నీరు విడుదల కాకుంటే తమ పైర్లు ఎండిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 రైతులు సాగునీటి కోసం పడుతున్న కష్టాలను చూసి కూడా అధికారులు స్పందించడం లేదన్నారు. ప్రతి సీజన్‌లో కావలి కాలువ ఆయకట్టుకు నీరు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ డీఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూడిక తీత పనులు నాసిరకంగా చేసి నీటి విడుదల కూడా జాప్యం చేయడం వెనుక కారణమేమిటని నిలదీశారు. నీరు విడుదల ఎప్పుడు చేసేది చెప్పేంత వరకు కార్యాలయం నుంచి కదలబోమని రైతులు భీష్మించారు. డీఈ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ నీరు విడుదలకు ఆలస్యం ఎందుకు అవుతుందనే విషయాలను తాను నేరుగా చెప్పలేనన్నారు. ఈనెల 18వ తేదీ ఉదయం చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కావలి కాలువ నుంచి నీటిని పంపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 19న ఉదయం హనుమకొండపాళెం పెద్ద చెరువుకు కావలి కాలువ నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పంటలు ఎండుతున్న విషయంపై తమకు బాధ కలుగుతుందన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement