అరకులోయలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో వీడుతున్న మంచుతెరలు
పాడేరు/అరకులోయ: విశాఖ మన్యంలో చలిగాలు లు ప్రారంభమయ్యాయి. దీపావళి తరువాత ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు మారుతున్నాయి. గత రెండు రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఆర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగాకురుస్తోంది. ఉదయం 9 గంటల వరకు సూర్యోదయం అవ్వని పరిస్థితితో ప్రజలకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. వేకువజాము, సాయంత్రం వేళల్లో చలిగాలులు వీస్తున్నాయి. సోమవారం పాడేరుకు సమీపంలోని మినుమూలూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 16 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 16.5, అరకులోయ కాఫీబోర్డు వద్ద 17డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆర్ధరాత్రి నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. అనంతగిరి, పాడేరు, చింతపల్లి, దారకొండ ఘాట్‌రోడ్లలో వాహన చోదకులు పొగమంచుతో ఇబ్బందులు పడ్డారు. అలాగే వ్యవసాయ పనులకు వెళ్లేవారు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు మంచుతో అవస్థలు పడ్డారు. పాడేరు.అరకులోయ ప్రాంతాలలో ఉదయం 9 గంటలకు మంచుతెరలు వీడి సూర్యోదయం అయ్యింది. అరకు, లంబసింగి ప్రాంతాలలో పర్యటించే పర్యాటకులు మంచు అందాలను ఆస్వాదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment