రూ 15లక్షలతో రెండు భారీ నర్సరీలు
కలెక్టర్ సుజాతశర్మ ఆదేశం
ఒంగోలు టౌన్ : 2015-2016 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ.9.64 కోట్లతో ఉద్యాన పంటలు అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. రూ.15 లక్షలతో రెండు భారీ నర్సరీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం రాత్రి స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో 2015-2016 సంవత్సరానికి సంబంధించి సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు తీసుకోవలసిన చర్యలపై ఉద్యానశాఖ, వ్యవసాయశాఖ, అటవీశాఖ, బ్యాంకు అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ పెంచే విధంగా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. 60 హెక్టార్లలో మామిడి, 184 హెక్టార్లలో బత్తాయి, 90 హెక్టార్లలో నిమ్మ, 35 హెక్టార్లలో జామ, 100 హెక్టార్లలో దానిమ్మ, 90 హెక్టార్లలో అరటి, 177 హెక్టార్లలో బొప్పాయి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు ఇవ్వాలని సూచించారు.
ఉలవపాడు ప్రాంతంలో మామిడి పండ్లు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. చీరాల ప్రాంతంలో జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ అధికారుల సహకారం తీసుకోవాలని ఆదేశించారు. రైతులు కోల్డ్ స్టోరేజీ నిర్మాణాలకు ముందుకు వస్తే సబ్సిడీతో బ్యాంకు రుణాలు అందిస్తామన్నారు. డీఆర్‌డీఏ సభ్యులు నడుపుతున్న వర్మీ కంపోస్టును తక్కువ ధరకు రైతులు పొందవచ్చని, ఈ విషయమై విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉద్యానశాఖ ఏడీలు రాజేంద్రకృష్ణ, జెన్నమ్మ, వ్యవసాయశాఖ జేడీ మురళీకృష్ణ, ఏపీఎంఐపీ ఏపీడీ మురళి, నాబార్డు ఏజీఎం జ్యోతిశ్రీనివాస్, డీఎఫ్‌ఓ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.
రూ.9.64కోట్లతో ‘ఉద్యాన’ ప్రణాళిక
Published Wed, Jul 29 2015 2:32 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement