నెల్లూరు(రెవెన్యూ): కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో అమలవుతున్న పింఛన్లు, ఉపాధి హామీ తదితర పథకాలు దుర్వినియోగం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక గోల్డెన్ జూబ్లీహాల్‌లో నిర్వహించిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ మాట్లాడారు. కేంద్ర నిధులతో అమలవుతున్న పథకాల అమలతీరు, నిధుల ఖర్చు తదితర అంశాలపై క్రమంతప్పకుండా సమీక్షించుకోవాలన్నారు.
గతంలో కమిటీ సమావేశాలు సక్రమంగా జరగలేదన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకు సమావేశం నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి ప్రజాప్రతినిధులందరూ హాజరైతే పథకాల అమలుతీరుపై చర్చించవచ్చునన్నారు. సామాజిక పింఛన్ల విషయంలో అర్హులైన లబ్ధిదారులను తొలగించారన్నారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ రూ.75గా ఉన్న పింఛన్‌ను రూ.200లకు పెంచారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రూ.200లను రూ.1,000లకు పెంచిందన్నారు.
అయితే పరిశీలన పేరుతో అర్హులవి తొలగిస్తున్నారన్నారు. రాజకీయ కారణాలతో అర్హులను ఇబ్బందులు పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలు తమకు ఓట్లు వేయలేదనే సాకుతో అర్హుల పింఛన్లు తొలగించారన్నారు. కమిటీలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో మూడేళ్ల నుంచి వర్షాలు పూర్తిస్థాయిలో కురవలేదన్నారు. మెట్టప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయన్నారు. ఫ్లొరైడ్‌తో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్నారు. రాబోయే ఎండాకాలంలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించలేకపోయిందన్నారు.
ఇప్పటివరకు జిల్లాకు రూ. 962 కోట్లు మాత్రమే కేటాయించరన్నారు. పదికాలలపాటు గుర్తుండే పని ఒక్కటి చేపట్టలేదన్నారు. సంబంధిత మంత్రితో మాట్లాడి జిల్లాకు నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఆగస్టు 15లోపు ప్రతి పాఠశాల్లో మరుగుదొడ్లు నిర్మించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జెడ్పీ చెర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ పింఛన్ల తొలగింపులో ఎంపీడీఓలపై ఒత్తిడి ఉందన్నారు. దాంతోనే ఎంపీడీఓలు పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారన్నారు. భూమి ఉందని అనేకమంది పింఛన్లు తొలగించారన్నారు. వాస్తవానికి వారికి భూమిలేదన్నారు. అటువంటి వారి పింఛన్లు పునరుద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి ఎద్దడి నివారించేందుకు కొత్త బోర్లు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ఎం. జానకి, డీఆర్‌డీఏ, డ్వామా పీడీలు చంద్రమౌళి, వెంకటసుబ్బయ్య, జెడ్పీ సీఈఓ ఎం. జితేంద్ర, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరెడ్డి, కమిటీ సభ్యులు జి. ప్రసాద్‌రెడ్డి, రాజసులోచనమ్మ, వి. జయరామయ్య పాల్గొన్నారు.
పింఛన్ల తొలగింపుపై గరంగరం
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ అర్హుల పింఛన్లు తొలగించారన్నారు. గ్రామ కమిటీల్లో సంఘసేవకులకు బదులు టీడీపీ కార్యకర్తలను నియమించారన్నారు. ఓట్లు వేయలేదనే కక్షతో పింఛన్లను తొలగించారన్నారు. దీనిపై ఎమ్మెల్యే కె. రామకృష్ణ కలుగజేసుకుని అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించారన్నారు. పింఛన్ల విషయంలో సీఎం కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. సీఎం కచ్చితంగా ఉన్నా.. స్థానిక నాయకులు పడనీయడం లేదని రామిరెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఎంపీ కలుగజేసుకుని సమస్య పెద్దది కాకుండా చర్యలు తీసుకున్నారు.
గ్రామ కమిటీలను రద్దుచేయాలి:
రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి,
కావలి ఎమ్మెల్యే
ఓటు వేయలేదనే సాకుతో పింఛన్లు తొలగించారు. ఈ విషయం అనేక పర్యాయాలు అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఫలితంలేదు. గ్రామ కమిటీలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కావలి నియోజకవర్గంలో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. గతేడాది ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసిన వారికి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదు. తీరప్రాంతాల్లోని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలి. కావలి ప్రాంతంలో పంటల సాగుకు సోమశిల జలాలను నెలరోజులు అలస్యంగా విడుదల చేశారు. నెల రోజుల నీటిని చెరువులకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
వితంతువులను ఇబ్బందులు
పెడుతున్నారు:
- కిలివేటి సంజీవయ్య,ఎమ్మెల్యే
నియోజకవర్గంలో వితంతువులకు పింఛన్లు తొలగించారు. గ్రామ కమిటీలు ఎదో ఒక సాకుచూపి సంతకం పెట్టడంలేదు. పింఛన్ల విషయంలో ఎంపీడీఓలకు ప్రత్యేక అధికారాలివ్వాలి. నియోజకవర్గంలో మంచినీటి సమస్యను పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రోడ్లకు మరమ్మతులు చేయాలి. నూతన రోడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధి హామీకి సంబంధించి పనులు అధికారుల పర్యవేక్షణలో పనులు జరగాలి. ఉపాధి నిధులు దుర్వినియోగమవుతున్నాయి. పేమెంట్లు సకాలంలో చెల్లించాలి.
ఫ్లొరైడ్ నుంచి ప్రజలను కాపాడండి:
-గౌతమ్‌రెడ్డి, ఎమ్మెల్యే, ఆత్మకూరు
ఆత్మకూరు నియోజకవర్గం వెనుకపడిన ప్రాంతం. మెట్టప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటడంతో ఫ్లొరైడ్ నీటిని ప్రజలు తాగాల్సి వస్తుంది. ఫ్లొరైడ్ నుంచి ప్రజలను కాపాడేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లో మంచినీటి పైపులైన్లు దెబ్బతిన్నాయి. వాటికి త్వరగా మరమ్మతులు చేపట్టాలి. చేజర్ల మండలం కొలపనాయుడుపల్లిలో మంచినీటికి ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. యుద్ధప్రాతిపదికన మంచీనీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. పింఛన్ల కమిటీలు లేవు. పింఛన్ల పరిశీలన కమిటీలు ఎక్కడ నుంచి వచ్చాయి. అర్హులైన వారి పింఛన్లు తొలగించారు. కార్యాలయాల ఎదుట వందల సంఖ్యలో బాధితులు క్యూలో ఉంటున్నారు. తొలగించిన పింఛన్లను పునరద్ధరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు
ఖర్చు చేస్తుంది:
-కురుగొండ రామకృష్ణ, వెంకటగిరి ఎమ్మెల్యే
జిల్లాలో పింఛన్ల పంపిణీకి సంబంధించి కేంద్రం ఇస్తున్నది కేవలం రూ.47 లక్షలు మాత్రమే. రాష్ట్రం రూ. 2కోట్లు ఖర్చు చేస్తుంది. జిల్లాలో చెరువుల అక్రమణలు అధికంగా ఉన్నాయి. అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోని పార్టీలకతీతంగా అక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవాలి.
కేంద్ర నిధుల పథకాలపై ప్రత్యేక దృష్టి
Published Thu, Feb 19 2015 2:38 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement