స్వచ్ఛంద సంస్థలతోనే గ్రామాల అభివృద్ధి
♦ స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్
♦ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సాక్షి, విజయవాడ: దేశంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేయాలంటే ఒక రాజకీయ పార్టీ వల్లో, ఒక ప్రభుత్వం వల్లో సాధ్యం కాదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. అవకాశం ఉన్నచోట స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం విజయవాడ సమీపంలోని ఆత్కూరు గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్టు విజయవాడ చాప్టర్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రేరణతో ఆయన కుమార్తె దీపావెంకట్ నెల్లూరు వద్ద చిన్న గ్రామంలో ప్రారంభించిన స్వర్ణభారత్ ట్రస్టు ఇప్పుడు విజయవాడకు తన సేవలు విస్తరించడం అభినందనీయమన్నారు.
2020 నాటికి దేశంలోని ప్రతి గ్రామానికి ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’ పథకం ద్వారా విద్యుత్, తాగునీరు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. దేశంలో 300 గ్రామాలను మోడల్ గ్రామాలుగా ఎంపిక చేసి స్మార్ట్ సిటీలకు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు. గ్రామాల్లోని స్వయం శక్తి కారణంగా మనదేశం ఆర్థిక మాంద్యాన్ని తట్టుకుని నిలబడిందన్నారు.
త్వరలో హైదరాబాద్‌లో ‘స్వర్ణభారత్’: వెంకయ్య
సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నెల్లూరులో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభించామని, ఇప్పుడు విజయవాడ చాప్టర్‌ను 7.5 ఎకరాల్లో ప్రారంభిస్తున్నామని, త్వరలో 6.5 ఎకరాల్లో హైదరాబాద్‌లో ప్రారంభిస్తామని తెలిపారు. విజయవాడ చాప్టర్‌లో ఆరోగ్య కేంద్రాన్ని, గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రాన్ని, అబ్దుల్ కలాం ‘ప్రతిభా’ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. అంతకు ముందుగా ఈ సమావేశాన్ని ప్రవచన చక్రవర్తి చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలతో ప్రారంభించారు. సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గేయాలను ఆలపించారు.