ప్రేమ పేరుతో నగలు కాజేసిన ప్రబుద్ధుడు
తుర్కయంజాల్: ప్రేమ పేరుతో బాలికను అపహరించి, ఆమె వద్ద ఉన్న నగలు, నగదు కాజేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట మండలం బోవిన్‌పల్లి గ్రామానికి చెందిన మేడ అరుణ్‌రెడ్డి (24) అలియాస్ మహబూబ్‌బాషా అలియాస్ అర్జున్‌రెడ్డి నగరంలో ఆటో నడుకుంటూ జీవిస్తున్నాడు. బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన ఓ బాలిక ఇంటర్ చదువుతోంది. 2014 జులైలో ఆమె కళాశాలకు వెళ్లి వచ్చే సమయంలో అరుణ్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. ఫేస్‌బుక్, ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ ప్రేమిస్తున్నా.. పెళ్లి చేసుకుంటానని ఆమెకు దగ్గరయ్యాడు.
కొన్ని రోజుల తర్వాత తనకు కడుపులో పుండు ఏర్పడిందని, లేజర్ చికిత్స చేయించుకొనేందుకు డబ్బు ఇవ్వమని అరుణ్‌రెడ్డి బాలికను కోరాడు. ఆమె స్పందించకపోవడంతో మన మధ్య వివాహేతర సంబంధం ఉందని స్నేహితులకు, తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పి పరువు తీస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తల్లికి చెందిన సుమారు 30 తులాల బంగారు నగలతో పాటు బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 3.50 లక్షలను ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేసి అతనికి ఇచ్చింది. అరుణ్‌రెడ్డి ఆ నగల్లో కొన్నింటిని అమ్ముకొని, నగదు మొత్తం జల్సాలకు, ఆసుపత్రి ఖర్చులకు వాడుకున్నాడు. కాగా, అరుణ్‌రెడ్డికి నగలు, నగదు ఇచ్చిన విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఊరుకోరని భావించిన బాలిక 2 ఫ్రిబవరి 2015 రాత్రి దోపిడీ నాటకానికి తెరదీసింది.
బెడ్‌రూమ్‌లో చదువుకుంటున్న తన వద్దకు దొంగలు వచ్చి... నోట్లో బట్టలు కుక్కి..చేతులు కట్టేసి బంగారు నగలు ఎత్తుకెళ్లారని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఇది నిజమేనని నమ్మిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులకు పూర్తి విషయాలు బయటపడ్డాయి. మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న అరుణ్‌రెడ్డిని మంగళవారం వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 16 తులాల బంగారు నగలు రాబట్టగలిగారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అమ్మాయిలపై దృష్టి సారించాలని ఏసీపీ తెలిపారు.