- టీడీపీలో కొనసాగుతున్న మధ్యస్తాలు
- స్వతంత్రులకు బీఫాం ఇస్తామంటున్న కాంగ్రెస్ నేతలు
- అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా చిత్తూరు కార్పొరేషన్, ఆరు మున్సిపాల్టీలకు మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. మొత్తం 169 వార్డులకు 1,322 నామినేషన్లు వచ్చాయి. వీటిల్లో తిరస్కరణకు గురైనవి 64 మాత్రమే. సోమవారం కూడా ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు పోటీగా రంగంలోకి దిగినవారిని బుజ్జగించి తప్పించేందుకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుగుబాటుదారులను ఒప్పించేం దుకు పరుగులు దీస్తున్నా కొన్నిచోట్ల మాత్రమే మధ్యస్తాలు సత్ఫలితాలిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పుత్తూ రు, పుంగనూరు, పలమనేరు, నగరి, శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాల్టీల్లో వైఎస్సార్‌సీపీ మాత్రం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసుకుని అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది.
టీడీపీ గ్రూప్‌ల గొడవలతో ఇంతవరకూ ఒక్కరిని కూడా అభ్యర్థులుగా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దొరక్క కుస్తీపడుతోంది. స్వతంత్రులకైనా తాము బీఫాం ఇస్తే తీసుకోకపోతారా అన్న ఆశతో వారి వెంటపడుతోంది. సోమవారం రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. ఇక మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ వద్ద దగ్గరుండి కొన్నివార్డులకైనా పోటీ లేకుండా టీడీపీ తిరుగుబాటు అభ్యర్థులను ఉపసంహరింపజేయాలని స్థానిక తెలుగుతమ్ముళ్లు తంటాలు పడుతున్నారు.
తడాఖా చూపుతున్న తిరుగుబాటు తమ్ముళ్లు....
తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగు తమ్ముళ్లు తమ తడాఖా చూపిస్తున్నారు. ఇప్పుడు కౌన్సిలర్ టికెట్టు ఇవ్వబోమని చెబితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పవర్ ఏంటో చూపిస్తామని, వార్డుల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో టీడీపీకి ఓట్ల్లు ఎలా పడ్తాయో చూస్తామని, తమ వద్దకు ఇక రావద్దని సంకేతాలు ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాము అంతా వర్కౌట్ చేసుకున్న తరువాత ఇప్పుడు సామాజికవర్గం, డబ్బులు చూసి తమ ప్రత్యర్థులకు, కాంగ్రెస్ నుంచి వచ్చినవారికి కౌన్సిల్ టికెట్టు ఇస్తామంటే ఎలా అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చేస్తున్న మున్సిపల్ మధ్యస్తాలు కాస్తా ఎక్కడ యూ టర్న్ తీసుకుని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమను దెబ్బతీస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.
వైఎస్సాఆర్‌సీపీలో అభ్యర్థుల ఎంపిక పూర్తి
చిత్తూరు కార్పొరేషన్‌లో సోమవారం సాయంత్రం 50 డివిజన్లకు పోటీచేయనున్న అభ్యర్థుల పేర్లను నియోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ అధికారికంగా విడుదల చేశారు. పుంగనూరు, పుత్తూరు, పలమనేరు, మదనపల్లి, శ్రీకాళహస్తి, నగరి మున్సిపాల్టీల్లో ఇప్పటికే 169 వార్డులకు అధికారికంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఆయా నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు పూర్తి చేశారు. మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ పూర్తయిన వెంటనే ఈ పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.
స్వతంత్రుల వెంటపడుతున్న కాంగ్రెస్
జిల్లాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్ నామినేషన్లు కూడా పడకపోవడంతో మున్సిపాల్టీల్లో పరువు నిలుపుకునేందుకు కనీసం స్వతంత్రులనైనా బతిమలాడి వారికి పార్టీ బీ ఫాం ఇచ్చి కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించుకునేందుకు కాంగ్రెస్ నేతలు తంటాలు పడుతున్నారు. ఇందుకోసం జిల్లాలో మున్సిపాల్టీల్లో ఉన్న కిందిస్థాయి కాంగ్రెస్ నాయకులకు డీసీసీ ద్వారా సంకేతాలు పంపుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తే, ఇతర పదవుల్లో మీకే ప్రాధాన్యం వస్తుందని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సాయం చేయండి అని పార్టీకి వ్యతిరేకంగా స్వతంత్రంగా నామినేషన్లు వేసినవారి వెంటపడుతున్నారు. అయినా వీరికి అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొంది.