ప్రశ్న : సీపీఎస్ విషయంపై ఉద్యోగులు అడిగితే మనం ఏం చెప్పాలి? – అహ్మద్ పాషా(లక్కిరెడ్డి పల్లె), రాయచోటి
జగన్ : చంద్రబాబు సీపీఎస్ విషయంలో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఏమీ చేయలేదు. సీపీఎస్ కింద అన్ని వర్గాల ఉద్యోగులున్నారు. మూడు నెలల తర్వాత అన్న అధికారంలోకొస్తాడు..
అప్పుడు ఒక్క నెలలోపే సీపీఎస్‌ను రద్దు చేస్తాడని గట్టిగా చెప్పండి..
ప్రశ్న : టీడీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పడకేసింది. మన ప్రభుత్వం రాగానే ఏ రకంగా పటిష్టం చేస్తాం? – శ్రీనివాసరావు, బి.మఠం
జగన్ : ఈ ఆరోగ్యశ్రీ పథకం మెరుగవ్వాలంటే.. అది దివంగత వైఎస్సార్ కుమారుడి వల్లనే అవుతుందని చెప్పండి. ఏ జబ్బయినా సరే.. ఏ ఆపరేషన్ అయినా సరే.. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు.. రూ.1,000 వైద్యం ఖర్చు దాటితే.. దానిని ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేయిస్తామని జగనన్న చెప్పాడని పల్లెల్లో బూత్ కమిటీ సభ్యులు ప్రచారం చేయండి. రోగి విశ్రాంతి సమయంలో జగనన్న డబ్బులిస్తానన్నాడని కూడా చెప్పండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా రూ.10,000 పింఛన్ ఇస్తాననన్నాడని, పేదవాడు అప్పులపాలు కాకుండా మెరుగైన చికిత్స పొందాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రజలకు గట్టిగా చెప్పండి.
ప్రశ్న : గ్రామాల్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. దీన్ని ఎలా పరిష్కరిస్తాం? – ఉదయ్, యర్రగుంట్ల (జమ్మలమడుగు)
జగన్ : ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చేసిన మోసాన్ని ప్రజలందరికీ చెప్పండి. రేపు జగనన్న అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2.4 లక్షల ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాడని చెప్పండి. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి చదువుకున్న పది మందికి వాటిలో ఉద్యోగాలిస్తాడని చెప్పండి. దీని వల్ల దాదాపుగా లక్షన్నర ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయని చెప్పండి. అలాగే ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను ఉద్యోగంలోకి తీసుకుంటారని చెప్పండి. ప్రతి ఫ్యాక్టరీ, ప్రాజెక్టులో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేస్తాం. రేపు జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా వచ్చాక ఉద్యోగాల విప్లవం వస్తుందని గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి.
ప్రశ్న: ఉక్కు ఫ్యాక్టరీ గురించి జనానికి ఏం చెప్పాలి? – హనుమంతరెడ్డి (జమ్మలమడుగు)
జగన్ : ఇప్పటి దాకా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయనగా ఉక్కు ఫ్యాక్టరీకి టెంకాయ కొట్టాడు. ఓ రూ.50 కోట్లు డబ్బు కేటాయిస్తాడు. గ్రామాల్లో ప్రజలకు అన్న చెప్పమన్నాడని చెప్పండి.. కచ్చితంగా ఉక్కు ఫ్యాక్టరీ ఇదే జిల్లాకు వస్తుంది. అధికారంలోకి రాగానే మూడు నెలల్లోనే అన్న ఆ ఫ్యాక్టరీకి టెంకాయ కొట్టి శంకుస్థాపన చేస్తాడని చెప్పండి. మూడేళ్లలో ఆ ఫ్యాక్టరీని ప్రారంభింపజేస్తాడని చెప్పండి. ఆ ఫ్యాక్టరీ వల్ల పది వేల మందికి ఇక్కడే ఉద్యోగాలొస్తాయని చెప్పండి.
ప్రశ్న : అన్నా.. చంద్రబాబు మన పథకాలు కాపీ కొడుతున్నారు.. మనం ప్రజలకు ఏం చెప్పాలి? – కిరణ్‌యాదవ్ (ప్రొద్దుటూరు)
జగన్ : నాలుగున్నరేళ్లుగా ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు.. జగన్ కొన్ని పథకాలు అమలు చేస్తానన్నాడు కాబట్టే.. ఇవాళ మళ్లీ ప్రజలను మోసం చేయడానికి మీ ముందుకొస్తున్నాడని చెప్పండి.
ప్రశ్న : హోదాపై చంద్రబాబు ధర్మపోరాట దీక్షలంటూ మోసం చేస్తున్నారు. వీటికి ఎలా సమాధానం చెప్పాలి? – రమణ (రైల్వే కోడూరు)
జగన్ : ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసే వైఎస్సార్‌సీపీని 25 లోక్‌సభ స్థానాల్లో గెలిపించండి.. అని ప్రజలను కోరండి. మనల్ని అన్ని పార్టీలూ మోసం చేశాయి. హోదా రాకపోవడానికి కాంగ్రెస్‌తో పాటు మోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ప్రధాన కారణం. అందుకే వారెవర్నీ నమ్మొద్దని ప్రజలకు చెప్పండి.. మనం 25 లోక్‌సభ స్థానాలను గెల్చుకుంటే.. కేంద్రంలో ఎవరు హోదా ఇస్తామని సంతకం చేస్తారో వారికే మద్దతిస్తాం.. అని చెప్పండి.
ఒక్క నెలలోనే సీపీఎస్ రద్దు చేస్తాం
Published Fri, Feb 8 2019 2:22 AM | Last Updated on Fri, Feb 8 2019 12:39 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment