పెద్దాపురం నుంచి కట్టమూరు వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న సత్తెమ్మ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పెద్దాపురం : పెద్దాపురం నుంచి కట్టమూరు వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న సత్తెమ్మ కాలనీలో ఆదివారం మధ్యాహ్నం మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు యండవిల్లి విజయలక్ష్మి (30) భర్త చనిపోవడంతో సత్తెమ్మ కాలనీలో తన పిల్లలతో నివాసం ఉంటోంది. కొన్నాళ్లుగా విజయలక్ష్మి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అనారోగ్యంతో బాధపడుతోంది. ఉదయం సమీపంలోని చర్చికు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంఘటనపై స్థానికులు నుంచి వివరాలను సేకరించారు. ఎస్సై వై.సతీష్ ఆదేశాల మేరకు అడిషినల్ ఎస్సై ఏసుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీవీ మెరకలో ఉరి వేసుకుని వ్యక్తి ..
సఖినేటిపల్లి : మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందులు తాళలేక వీవీ మెరకలో సైపు రామకృష్ణ (33) తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి జరిగినట్టుగా అనుమానిస్తున్న ఈ సంఘటన ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులు చూడడంతో వెలుగులోకి వచ్చింది. ఎస్సై కృష్ణభగవాన్ కథనం ప్రకారం రామకృష్ణ భార్య ఉపాధి రీత్యా విదేశాల్లో ఉంటోంది. మృతుడు వీవీమెరక గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రామకృష్ణ మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాడు. గొందిలో నివాసం ఉంటున్న వదిన కటికిరెడ్డి సీతామహలక్ష్మి ఆదివారం మరిది రామకృష్ణను చూడడానికి వీవీ మెరకలోని ఇంటికి వచ్చింది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.