
రైలు పట్టాల వద్ద గ్యాంగ్ రేప్
గుంటూరు : గుంటూరు జిల్లా నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఓ యువతి (22) గత రెండు రోజులుగా రైల్వే స్టేషన్లో ఆశ్రయం పొందుతుంది. అయితే గత అర్థరాత్రి స్టేషన్ ప్లాట్‌ఫారంపై పడుకుని ఉన్న ఆమెను అదే ప్రాంతానికి చెందిన ముగ్గురు రిక్షా కార్మికులు ఆమెపై దాడి చేశారు. అనంతరం ఆమెను రైలు పట్టాల పక్కకు లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. దాంతో ఆమె స్పృహకోల్పోయింది. శరీరంపై గాయాలతో మూలుగుతున్న ఆమెను గురువారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా రిక్షా కార్మికులు ఏసుబాబు, మాణిక్యాలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన మీడియా ప్రతినిధులు పోలీసులను ప్రశ్నించడంతో బాధితురాలుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.