గజ్వేల్, న్యూస్‌లైన్: గజ్వేల్ పట్టణంలో సోమవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గజ్వేల్-తూప్రాన్ రహదారిని ఆనుకుని ఉన్న ఇంట్లో, ఎప్పుడూ జనం రద్దీగా ఉండే ప్రదేశంలో.. ఉదయం వేళే ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. దుండగులు కత్తులతో పాశవికంగా దాడి చేసి రక్తపు మడుగులో పడేసి వెళ్లిపోయారు. ఉపాధి కోసం సుమారు పదిహేనేళ్ల కిందట భర్తతో కలిసి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆ మహిళ గుర్తుతెలియని దుండగుల చేతిలో హతమవడం, ఆ కుటుంబంలో తీరని శోకం అలుముకుంది. వివరాలిలా ఉన్నాయి.
రాజస్థాన్‌లోని మర్వాడీ ప్రాంతానికి చెందిన బుధేరామ్ తన భార్య పుష్పకుమారి(33)తో కలిసి సుమారు 15 ఏళ్ల క్రితం గజ్వేల్‌కు ఉపాధి కోసం వలస వచ్చాడు. పట్టణంలో గణేష్ పాన్ బోకర్స్ పేరిట మార్కెట్ రోడ్డులో బంగారం తాకట్టు దుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తూప్రాన్ రోడ్డు వైపున వీరు ఓ ఇల్లును అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. వీరికి స్వప్న(8), వసుంధర(6), హేమంత్(2) ముగ్గురు సంతానం. స్థానిక సెయింట్ మేరీస్ పాఠశాలలో స్వప్న నాలుగో తరగతి, వసుంధర 2వ తరగతి చదువుతున్నారు. రోజూలాగే సోమవారం పుష్పకుమారి తన కూతుళ్లను ఉదయం 9.30 గంటలకు పాఠశాల వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చింది.
భర్త బుధేరామ్ అప్పటికే దుకాణానికి వెళ్లిపోయాడు. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో కత్తిపోట్లకు గురై పుష్పకుమారి రక్తపు మడుగులో పడిఉంది. బుదేరామ్ దుకాణం నుంచి ఇంటికి బంగారు ఆభరణాలను తీసుకెళ్లడానికి రాగానే ఈ దృశ్యాన్ని చూశాడు. విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారమందించారు. వెంటనే స్థానిక సీఐ అమృతరెడ్డి, ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి సందర్శించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలను సేకరించారు. మహిళ శరీరంపై ఏడు వరకు కత్తిపోట్లు ఉన్నాయి. కాగా ఇంట్లో బంగారు ఆభరణాలను భద్రపరిచే బాక్స్‌ను పగులగొట్టి వెండి పట్టీలు, కొంత బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
దోపిడీ దొంగల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సదరు మహిళ కదలికలను క్షుణ్ణంగా తెలుసుకుని దుండగులు హతమార్చినట్లు తెలుస్తోంది. ముందుగా ఆ మహిళను చలి నుంచి రక్షణ కోసం కట్టుకునే గుడ్డతో ఉరివేయడానికి ప్రయత్నించిన హంతకులు ఆమె అలికిడి చేయడంతో కత్తితో హతమార్చినట్లు సంఘటనతీరును బట్టి తెలుస్తోంది. గత అక్టోబర్ 9న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలో జంట హత్యల ఘటన మరువకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
‘అమ్మ’ కోసం చిన్నారుల రోదన...
తమను రెడీ చేసి స్కూలుకు పంపిన ‘అమ్మ’ మరో గంటలోపే విగత జీవిగా మారడంతో చిన్నారులు స్వప్న, వసుంధర, హేమంత్ రోదించడం చూపరులను కంటతడిపెట్టించింది. ‘మా’కు క్యా హువా.. అంటూ గుక్కపెట్టి ఏడ్చారు. ‘ఖల్‌సే స్కూల్‌కు కోన్ బేజ్‌తే’...అంటూ బంధువులతో దుఃఖించారు.
గజ్వేల్‌లో మహిళ హత్య
Published Mon, Dec 9 2013 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 1:25 AM
Advertisement
Advertisement