ముప్పుతిప్పలు | Woman struggles to get money from Government hospitals | Sakshi
Sakshi News home page

ముప్పుతిప్పలు

Published Tue, Feb 25 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM

ముప్పుతిప్పలు

ముప్పుతిప్పలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయిన మహిళలకు ఉచితంగా చికిత్స చేస్తాం. వారు వచ్చేందుకు, వెళ్లేందుకు సైతం రవాణా సౌకర్యాన్ని కలిగిస్తాం. ఆసుపత్రిలో కాన్పు అయితే చాలు వెళ్లేటప్పుడు రూ.1000లు చేతిలో పెడతామంటూ ఊదర గొట్టే అధికారులు ఆచరణలో బాలింతలకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభు త్వం ఇచ్చే రూ.1000ల కోసం నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోంది. ఇచ్చేదానికన్నా ఖర్చు అధికంగా ఉంటోంది.
 
 మూడుసార్లు తిరిగాను
 గత నెల 25న పెద్దాసుపత్రిలో కాన్పు అయినాను. ఆసుపత్రి నుంచి వెళ్లేటప్పుడు డబ్బులు అడిగితే వారం తర్వాత రమ్మన్నారు. మరోసారి వస్తే సమ్మె ఉందన్నారు. నేను, మా అమ్మ ఇప్పటి వరకు మూడు సార్లు తిరిగినాం. రూ.900 ఖర్చయింది. ఇలా తిప్పుకుంటారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు.
 - వెంకటేశ్వరమ్మ, స్టాంటన్‌పురం
 
 తిరగలేక యాసిరక వస్తోంది
 నా కూతురు అపర్ణ జనవరి 15న పెద్దాసుపత్రిలో కాన్పయింది. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డబ్బులు అడిగితే మళ్లీ రమ్మన్నారు. ఇప్పటికి నాలుగుసార్లయింది. మా ఇద్దరికి తిరగడానికే రూ.1000 ఖర్చయింది. ఇంకా ఎప్పుడిస్తారో తెలదు. ఇచ్చే వెయ్యి రూపాయలకు అంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చయితాంది.
 -నాగేంద్రమ్మ, కొత్తూరు, కోడుమూరు
 
 నా కొడుక్కే ఆరు నెలలొచ్చ
 నేను ఆరు నెలల క్రితం పెద్దాసుపత్రిలో కాన్పయినాను. నా కొడుక్కు ఇప్పుడు ఆరు నెలలు. కాన్పు డబ్బులు అడిగితే అప్పుడు.. ఇప్పుడు అని తిప్పుతున్నారు. ఐదుసార్లయింది. ఊర్ల పనులు వదులుకుని వస్తే ఇక్కడేమో ఇలా చేస్తున్నారు. ఇచ్చేది వెయ్యి రూపాయలంట. మేం తిరగనీకే రూ.1500లు అయిపాయ.
 - భారతి, ఎల్ బండ, వెల్దుర్తి
 
 ‘జననీ సురక్ష యోజన’కు పురిటినొప్పులు
 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గర్భిణిలు ప్రభుత్వాసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జననీ సురక్ష యోజన(జేఎస్‌వై) పథకాన్ని ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళ(బీపీఎల్) ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అయితే పారితోషికం అందిస్తున్నారు. గ్రామీణ మహిళలకు రూ.1000, పట్టణ మహిళలకు రూ.600 చొప్పున మంజూరవుతోంది. జిల్లాలో యేటా దాదాపు 15వేల మందికి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు అవుతున్నారు. డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే సమయంలో వీరికి పారితోషికం అందివ్వాల్సి ఉంది. అయితే గత కొన్ని నెలలుగా అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ మొత్తం అందజేతలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తం రూ.1000 అయితే.. జిల్లా నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో కలసి పలుమార్లు తిరిగేందుకు అందుకు రెట్టింపు ఖర్చు అవుతోందని మహిళలు వాపోతున్నారు. ప్రతి మహిళ గర్భం దాల్చిన మూడు నెలలోనే ఆమె పేరిట జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాను సంబంధిత ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ సహాయంతో తెరవాల్సి ఉంది. మూడు నెలల క్రితం ప్రారంభమైన డీబీటీ(డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్) జిల్లాలో నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 30వేల మంది గర్భిణిలకు ఖాతాలు తెరిచినట్లు జాయింట్ కలెక్టర్ కన్నబాబు ప్రకటించగా.. ఆన్‌లైన్ నమోదు 70 మాత్రమే కావడం గమనార్హం.
 
  ఖాతా తెరిచిన వెంటనే ఆ వివరాలను ఎంసీహెచ్ కార్డులో నమోదు చేసి జిల్లాలోని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం కార్యాలయానికి తెలపాల్సి ఉంది. ఆ మేరకు ఆన్‌లైన్‌లో గర్భిణి పేరిట వివరాలు నమోదు చేస్తారు. సదరు మహిళ ప్రసవించిన వెంటనే పారితోషికాన్ని ఎంసీహెచ్ కార్డులో ఉన్న ఖాతా ప్రకారం నేరుగా అకౌంట్‌లో జమచేస్తారు. ఇప్పటిదాకా డీబీటీ కోసం జిల్లా కేంద్రానికి 120 ఖాతాల వివరాలు మాత్రమే చేరగా.. అందులోనూ 50 ఖాతాల వివరాలు తప్పుగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే సమయంలో నవంబర్ ఒకటి నుంచి డీబీటీ పద్ధతిలోనే పారితోషికం చెల్లించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.నరసింహులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఖాతాలు తెరవనిదే ఎలా చెల్లింపులు చేయాలని అధికారులు చెప్పడంతో కొన్నాళ్లకు గతంలో మాదిరిగానే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. నిధుల విషయమై ఎన్‌ఆర్‌హెచ్‌ఎం జిల్లా అధికారి డాక్టర్ జ్యోత్స్నను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా.. జేఎస్‌వై పథకానికి నిధుల కొరత లేదని, సంబంధిత ఆసుపత్రి అధికారులు ముందుగా ఇండెంట్ పెడితే డబ్బులిస్తామని తెలిపారు.
 
 పెద్దాసుపత్రిలో పడిగాపులు
 కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్పుల విభాగంలో ప్రతి రోజూ 30కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా సగటున వెయ్యి కాన్పులు ఉంటున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని అధిక శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేయకపోవడంతో కర్నూలు పెద్దాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కాన్పయిన వారికి డిశ్చార్జి సమయంలో పారితోషికం ఇవ్వాల్సి ఉన్నా.. పదేపదే తిప్పుకుంటున్నారు. ఈ కోవలో సోమవారం ఒక్కసారిగా వందలాది మంది పెద్దాసుపత్రికి చేరుకున్నారు. అయితే వీరిలో 45 మందికి మాత్రమే పారితోషికం ముట్టజెప్పి తక్కిన వారిని మరోసారి రావాలని తిప్పి పంపేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement