Janani Suraksha Yojana scheme
-
కలవరం
సాక్షి, ముంబై : సుఖ ప్రసవంతోపాటు బాలింతలు సురక్షితంగా ఉండాలని ప్రభుత్వంతోపాటు ఇతర రంగాలు ‘జననీ సురక్ష యోజన’ లాంటి వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయినప్పటికీ బాలింతల మృతుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇది ముంబైలాంటి మెట్రోపాలిటన్ నగరంలో అత్యధికంగా చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది. రెండు నెలల్లో మృతుల సంఖ్య పెంపు ఈ ఏడాది ఏప్రిల్, మే లో 61 మంది బాలింతలు మృతి చెందగా అదే 2013లో ఏప్రిల్, మేలో 31 మృతి చెందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం రెండు నెలల్లో మృతుల సంఖ్య రెట్టింపు అయ్యిందని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలను బట్టి స్పష్టమైంది. ఇందులో 26 మంది బాలింతలు ముంబైలో మృతి చెందగా మిగతా 35 మంది మహిళలు శివారు ప్రాంతాలకు చెందినవారున్నారు. గత ఐదేళ్ల కాలంలో ముంబైలోనే అత్యధికంగా బాలింతలు మృతి చెందారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 206 మంది బాలింతలు చనిపోయారు. ఇందులో ఒక్క ముంబైలోనే 125 మంది చనిపోగా, మిగతా 81 మంది శివారు ప్రాంతాలకు చెందినవారున్నారు. బీఎంసీ ఆస్పత్రుల్లోనే.. ముంబైలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన ప్రధాన ఆస్పత్రులు మూడు ఉన్నాయి. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ముందుగా బీఎంసీ ఆస్పత్రులకే పంపిస్తారు. అందుచేత ముంబైలోనే బాలింతల మృతుల సంఖ్య ఎక్కవగా నమోదైతుందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. గతంలో మృతుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వం చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలు, ప్రవేశ పెట్టిన పథకాలు సఫలీకృతమైనట్లు వైద్య శాఖ భావించింది. కానీ ఇటీవల కాలంలో మృతుల సంఖ్య మళ్లీ పెరిగిపోవడంతో ఆరోగ్య శాఖను కలవరానికి గురిచేస్తోంది. -
రూ.3,630 కోట్లు వార్షిక రుణ ప్రణాళిక
కలెక్టరేట్ : 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.3,630.44 కోట్లతో జేసీ లక్ష్మీకాంతం వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లు, అధికారులతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో 26వ వార్షిక రుణ ప్రణాళిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ బ్యాంకు అధికారులు రైతులకు పంటరుణాలు, ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందించాలన్నారు. రైతులను ఏమాత్రం ఇబ్బందులకు గురి చేయకూడదని, జిల్లాలోని బంగారు తల్లి, జననీ సురక్ష యోజన పథకం లబ్ధిదారులకు జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడాలని సూచించారు. గతేడాది నిర్ధేశించిన లక్ష్యాలను బ్యాంకు అధికారులు పూర్తిగా సాధించలేదని, ఈ ఏడాదిలో వంద శాతం సాధించి రైతులకు లబ్ధి చేకూర్చాలన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎస్బీహెచ్ లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో రూ.3,630.44 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ప్రియారిటీ కింద రూ.3,205.64 కోట్లు, నాన్ ప్రియారిటీ కింద రూ.424.80 కోట్లు చొప్పున ప్రణాళికలు తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో రైతులను ఇబ్బందులు పెట్టకుండా రుణ అర్హత కార్డు ఉన్న వారిని గుర్తించి ఆ రైతులకు రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయా బ్యాంకు అధికారులను, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, ఎస్సీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల, రాజీవ్ యువశక్తిపై గతేడాదిలో సాధించిన ఫలితాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో లీడ్‌బ్యాంక్ మేనేజర్ శర్మ, ఆర్బీఐ ఆర్వోజే పుల్లారెడ్డి, నాబార్డ్ మేనేజర్ రవి, బ్యాంకు అధికారులు మహ్మద్‌ఖాన్, దక్షిణేశ్వర్, వినయ్‌కుమార్, రాజేందర్, జేడీఏ రోజ్‌లీల, స్టేప్ సీఈవో వెంకటేశ్వర్లు, బీసీ కార్పోరేషన్ ఈడీ నారాయణరావు, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ శాస్త్రీ, అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. -
ముప్పుతిప్పలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు అయిన మహిళలకు ఉచితంగా చికిత్స చేస్తాం. వారు వచ్చేందుకు, వెళ్లేందుకు సైతం రవాణా సౌకర్యాన్ని కలిగిస్తాం. ఆసుపత్రిలో కాన్పు అయితే చాలు వెళ్లేటప్పుడు రూ.1000లు చేతిలో పెడతామంటూ ఊదర గొట్టే అధికారులు ఆచరణలో బాలింతలకు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభు త్వం ఇచ్చే రూ.1000ల కోసం నాలుగైదు సార్లు తిరగాల్సి వస్తోంది. ఇచ్చేదానికన్నా ఖర్చు అధికంగా ఉంటోంది. మూడుసార్లు తిరిగాను గత నెల 25న పెద్దాసుపత్రిలో కాన్పు అయినాను. ఆసుపత్రి నుంచి వెళ్లేటప్పుడు డబ్బులు అడిగితే వారం తర్వాత రమ్మన్నారు. మరోసారి వస్తే సమ్మె ఉందన్నారు. నేను, మా అమ్మ ఇప్పటి వరకు మూడు సార్లు తిరిగినాం. రూ.900 ఖర్చయింది. ఇలా తిప్పుకుంటారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు. - వెంకటేశ్వరమ్మ, స్టాంటన్‌పురం తిరగలేక యాసిరక వస్తోంది నా కూతురు అపర్ణ జనవరి 15న పెద్దాసుపత్రిలో కాన్పయింది. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డబ్బులు అడిగితే మళ్లీ రమ్మన్నారు. ఇప్పటికి నాలుగుసార్లయింది. మా ఇద్దరికి తిరగడానికే రూ.1000 ఖర్చయింది. ఇంకా ఎప్పుడిస్తారో తెలదు. ఇచ్చే వెయ్యి రూపాయలకు అంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చయితాంది. -నాగేంద్రమ్మ, కొత్తూరు, కోడుమూరు నా కొడుక్కే ఆరు నెలలొచ్చ నేను ఆరు నెలల క్రితం పెద్దాసుపత్రిలో కాన్పయినాను. నా కొడుక్కు ఇప్పుడు ఆరు నెలలు. కాన్పు డబ్బులు అడిగితే అప్పుడు.. ఇప్పుడు అని తిప్పుతున్నారు. ఐదుసార్లయింది. ఊర్ల పనులు వదులుకుని వస్తే ఇక్కడేమో ఇలా చేస్తున్నారు. ఇచ్చేది వెయ్యి రూపాయలంట. మేం తిరగనీకే రూ.1500లు అయిపాయ. - భారతి, ఎల్ బండ, వెల్దుర్తి ‘జననీ సురక్ష యోజన’కు పురిటినొప్పులు కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: గర్భిణిలు ప్రభుత్వాసుపత్రిలోనే కాన్పు చేయించుకోవాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జననీ సురక్ష యోజన(జేఎస్వై) పథకాన్ని ప్రవేశపెట్టింది. దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళ(బీపీఎల్) ప్రభుత్వాసుపత్రిలో కాన్పు అయితే పారితోషికం అందిస్తున్నారు. గ్రామీణ మహిళలకు రూ.1000, పట్టణ మహిళలకు రూ.600 చొప్పున మంజూరవుతోంది. జిల్లాలో యేటా దాదాపు 15వేల మందికి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు అవుతున్నారు. డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లే సమయంలో వీరికి పారితోషికం అందివ్వాల్సి ఉంది. అయితే గత కొన్ని నెలలుగా అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ మొత్తం అందజేతలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే మొత్తం రూ.1000 అయితే.. జిల్లా నలుమూలల నుంచి కుటుంబ సభ్యులతో కలసి పలుమార్లు తిరిగేందుకు అందుకు రెట్టింపు ఖర్చు అవుతోందని మహిళలు వాపోతున్నారు. ప్రతి మహిళ గర్భం దాల్చిన మూడు నెలలోనే ఆమె పేరిట జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాను సంబంధిత ఏఎన్ఎం, ఆశా వర్కర్ సహాయంతో తెరవాల్సి ఉంది. మూడు నెలల క్రితం ప్రారంభమైన డీబీటీ(డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) జిల్లాలో నత్తనడకన సాగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 30వేల మంది గర్భిణిలకు ఖాతాలు తెరిచినట్లు జాయింట్ కలెక్టర్ కన్నబాబు ప్రకటించగా.. ఆన్లైన్ నమోదు 70 మాత్రమే కావడం గమనార్హం. ఖాతా తెరిచిన వెంటనే ఆ వివరాలను ఎంసీహెచ్ కార్డులో నమోదు చేసి జిల్లాలోని ఎన్ఆర్హెచ్ఎం కార్యాలయానికి తెలపాల్సి ఉంది. ఆ మేరకు ఆన్లైన్లో గర్భిణి పేరిట వివరాలు నమోదు చేస్తారు. సదరు మహిళ ప్రసవించిన వెంటనే పారితోషికాన్ని ఎంసీహెచ్ కార్డులో ఉన్న ఖాతా ప్రకారం నేరుగా అకౌంట్లో జమచేస్తారు. ఇప్పటిదాకా డీబీటీ కోసం జిల్లా కేంద్రానికి 120 ఖాతాల వివరాలు మాత్రమే చేరగా.. అందులోనూ 50 ఖాతాల వివరాలు తప్పుగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇదే సమయంలో నవంబర్ ఒకటి నుంచి డీబీటీ పద్ధతిలోనే పారితోషికం చెల్లించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.నరసింహులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఖాతాలు తెరవనిదే ఎలా చెల్లింపులు చేయాలని అధికారులు చెప్పడంతో కొన్నాళ్లకు గతంలో మాదిరిగానే చెల్లింపులు చేయాలని ఆదేశించారు. నిధుల విషయమై ఎన్ఆర్హెచ్ఎం జిల్లా అధికారి డాక్టర్ జ్యోత్స్నను ‘న్యూస్‌లైన్’ ప్రశ్నించగా.. జేఎస్వై పథకానికి నిధుల కొరత లేదని, సంబంధిత ఆసుపత్రి అధికారులు ముందుగా ఇండెంట్ పెడితే డబ్బులిస్తామని తెలిపారు. పెద్దాసుపత్రిలో పడిగాపులు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కాన్పుల విభాగంలో ప్రతి రోజూ 30కి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రతి నెలా సగటున వెయ్యి కాన్పులు ఉంటున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని అధిక శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు చేయకపోవడంతో కర్నూలు పెద్దాసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. కాన్పయిన వారికి డిశ్చార్జి సమయంలో పారితోషికం ఇవ్వాల్సి ఉన్నా.. పదేపదే తిప్పుకుంటున్నారు. ఈ కోవలో సోమవారం ఒక్కసారిగా వందలాది మంది పెద్దాసుపత్రికి చేరుకున్నారు. అయితే వీరిలో 45 మందికి మాత్రమే పారితోషికం ముట్టజెప్పి తక్కిన వారిని మరోసారి రావాలని తిప్పి పంపేశారు. -
‘అమ్మ’లు ఆగ్రహించారు
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకోవడం క్షేమం, పైగా జననీ సురక్ష యోజన కింద డబ్బులు కూడా ఇస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. గ్రామీణ ప్రాంత మహిళలకు రూ.వెయ్యి, పట్టణ ప్రాంతం వారికి రూ.600లు నజరానా ఇస్తున్నామంటున్న ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైనట్టు శుక్రవారం జిల్లా ఆస్పత్రి వద్ద మహిళల ఆందోళనతో బట్టబయలైంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్నందుకు చెప్పిన ప్రకారం డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 200మందికి పైగా బాలింతలు చంటిపిల్లల సహా ఆస్పత్రిలోని పీపీ (పోస్ట్‌పార్ట్) యూనిట్‌కు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా ఆస్పత్రి సిబ్బంది ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దీంతో ఓపిక నశించిన బాలింతలు చిన్నపిల్లలను చంకన వేసుకొని ఆస్పత్రి ఎదుట నడిరోడ్డుపై గంటసేపు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అటువైపుగా వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రసూతి డబ్బుల కోసం మూడు నెలలుగా తిరుగుతున్నా రేపుమాపంటూ అధికారులు తిప్పుంటున్నారని పలువురు మహిళలు ఆరోపించారు. ఊళ్ల నుంచి నెలకు నాలుగుసార్లు ఆస్పత్రి రావడం వల్ల ప్రయాణ ఖర్చులు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బాలింతలకు వెంటవెంటనే డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. డబ్బులు ఇచ్చేదాకా రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. సమాచారం తెలిసిన పట్టణ ఎస్సై ప్రణయ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పీపీ యూనిట్ ఇన్చార్జి డాక్టర్ శ్రీనివాస్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వారంలో ఒకరోజు కేవలం వందమంది బాలింతలకు చెక్కులు అందజేస్తున్నారు. మిగిలిన వారు కనీసం మూడుసార్లయినా ఆస్పత్రి చుట్టూ తిరగాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారం ఆస్పత్రి అకౌంట్లో కేవలం రూ.60వేలు మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరమణప్ప బాలింతలకు వద్దకు వెళ్లి మాట్లాడారు. వచ్చే శుక్రవారం అందరికీ డబ్బులు అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో బాలింతలు ఆందోళన విరమించారు. అయితే బాలింతల వివరాలను ఉన్నతాధికారులకు పంపి నిధులు మంజూరు చేయించుకోవడంలో పీపీ యూనిట్ ఇన్చార్జి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం బ్యాంకు నుంచి చెక్కుబుక్కులు తెప్పించుకోవడంలోనూ విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. వారానికోసారి వస్తున్నా... కాన్పు అయి నెలరోజులు దాటింది. ఇంకా డబ్బులు ఇవ్వలేదు. వారానికోసారి వచ్చి పోతున్నా. ఎందుకు తిప్పుకుంటున్నరో అర్థం కావట్లే. నెల రోజు బాలింతను ఇట్లా తిప్పుకోవడం ఏంది? వీళ్లకు కనికరం లేదా? వచ్చిపోవుడుకే చాలా పైసలు అయితన్నయ్. - సాలమ్మ, తాండూరు -
ఆడపిల్లల చదువుపై చిన్నచూపు వద్దు
వాంకిడి, న్యూస్‌లైన్ : ఆడపిల్లలని చిన్నచూపు చూడకుండా మగవారితో సమానంగా ఉన్నత చదువులు చదివించాలని కాగజ్‌నగర్ డీఎస్పీ సురేశ్‌బాబు అన్నారు. మండలంలోని ఇంధాని గ్రామంలో శుక్రవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలని అసహ్యించుకుని ఆడవాళ్ల శాతాన్ని తగ్గిస్తున్నారని, లింగ భేదం లేకుండా సమాజంలో అందరూ సమానమే భావనతో మెదలాలని తెలిపారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. పోలీసులంటే భయపడకుండా నిర్భయంగా సహాయం కోరవచ్చని పేర్కొన్నారు. అనంతరం వృద్ధులకు దుప్పట్లు, నవయువ సూర్యకిరణాలు యూత్‌కు వాలీబాల్ అందజేశారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. వైద్యాధికారి విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో అధిక శాతం ప్రసవాలు ఇంట్లోనే జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించుకుంటే ఆరోగ్యానికి హాని కలుగకుండా ఉండడంతోపాటు జనని సురక్ష యోజన పథకం కింద రూ.వెయ్యి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తిరుపతి, సర్పంచ్ కొట్నాక విజయ్‌కుమార్, వైద్యులు గౌతమ్‌పవార్, ఆర్ఎంపీ అజయ్, రాజు, వెంకటి, దయాకర్, అశోక్, ఆప్తాలమిక్ వెంకటేశ్, విలేజ్ పోలీస్ అధికారి కనక జంగు, నవయువ సూర్యకిరణాలు యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.