ఆమెపై లైంగిక దాడిచేసి హతమార్చారు
►ఆమెపై లైంగిక దాడిచేసి హతమార్చారు
►జూట్ మిల్లు కార్మికులపైనే అనుమానం
► తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
►అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
► సంచలనం సృష్టించిన బాలిక
► సజీవదహనం కేసు
► పోలీసుల దర్యాప్తు ముమ్మరం
కోటబొమ్మాళి : యలమంచిలి పంచాయతీ మామిడివానిపేటలో బాలిక సజీవదహనమైన సంఘటన మండలంలోనే కాదు జిల్లాలోనే సంచలనం సృష్టించింది. యలమంచిలి గ్రామానికి చెందిన రోణంకి రమణమూర్తి ప్రధమ కుమార్తె చందనం ఇటీవలే తల్లి చనిపోవడంతో తన చెల్లి మౌనికతో కలిసి మామిడివానిపేటలో గల తాత అయిన ఇరగట్టపు సూర్యనారాయణ ఇంట్లో ఉంటోంది. కోటబొమ్మాళిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆమె బుధవారం సాయంత్రం గెత్తం తీసుకుని పొలానికి వెళ్లింది. ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదికారు. చివరకు పొలం పక్కన ఉన్న రాళ్లగుట్టల పొదల్లో సగం కాలిన చందనం మృతదేహం చూసి కన్నీరుమున్నీరయ్యారు.
జూట్ కార్మికులపైనే అనుమానాలు
మామిడివానిపేట గ్రామానికి సమీపంలో గల సాయివర్థన్ జూట్ మిల్లులో పనిచేస్తున్న బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కార్మికులే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈతకల్లు తాగేందుకు రోజూ సాయంత్రం సంఘటన జరిగిన ప్రాంతానికి ఈ కార్మికులు వస్తుంటారని, అందులో బాగంగానే ఒంటరిగా కనిపించిన బాలికపై కిరాతకంగా లైంగికదాడి చేసి అంతమొందించి దహనం చేసి ఉంటారని భావిస్తున్నారు. అంతే గాకుండా పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలిస్తున్న అంబులెన్స్‌ను మహిళలంతా అడ్డుకుని అఘాత్యానికి పాల్పడిన దోషులను పట్టుకోవాలని, ముఖ్యంగా జూట్ మిల్లు కార్మికులను విచారించాలని నినాదాలు చేశారు. ఇలాంటి సంఘటన జరగడం ఈ ప్రాంతంలో ఇదే మొదటిసారని గ్రామస్తులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.
దర్యాప్తు ముమ్మరం
బాలిక మృతదేహానికి టెక్కలి సీఐ భవానీ ప్రసాద్, స్థానిక ఎస్‌ఐ జి.నారాయణస్వామి, వీఆర్‌ఓ రంగస్వామి ఆధ్వర్యంలో గురువారం శవపంచనామా చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. విశాఖపట్నం నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలు వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించాయి. అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేయగా కాశీబుగ్గ డీఎస్పీ దేవప్రసాద్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.