సీఐకి ఫిర్యాదు చేస్తున్న మహిళా సంఘాల సభ్యులు
భోగాపురం: భర్త, అత్త,మామల వేధింపుల వల్లే మండల కేంద్రానికి చెందిన అడపా శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం సాయంత్రం శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో డీఎస్పీ ఏవీ రమణ, సీఐ రఘువీర్ విష్ణు ఆదివారం గ్రామానికి చేరుకుని విచారణ చేపడుతుండగా, మహిళా సంఘ సభ్యులు ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రావణి ఏడు మాసాల గర్భవతిగా ఉన్నప్పటినుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారన్నారు.
దీనిపై రెండు సార్లు తాము కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వివాహ సమయంలో శ్రావణికి ఇస్తానన్న 1.50 ఎకరాల భూమిని తన పేరుమీద రాయాలని భర్త వేధించేవాడని, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పుంగులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీని కలిసిన వారిలో ఎస్సీ,ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ కె. జియారాణి, విశాఖ మహిళా వేదిక జాయింట్ సెక్రటరీ చిన్ని, మృతురాలి తల్లి రామలక్ష్మి, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment