ఒకరికివ్వాల్సిన ఇంజక్షన్ మరొకరికి..!
మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువుల ఆరోపణ
సాక్షి, కాకినాడ: ఒకే పేరు ఉన్న ఇద్దరు మహిళలు వేర్వేరు సమస్యలతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. అయితే వారిలో ఒకరికివ్వాల్సి ఇంజెక్షన్ మరొకరికి ఇవ్వడం తో ఓ మహిళ మరణించిందంటూ మృతురాలి బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. బాధితుల కథనం మేరకు.. ఈనెల 14న వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి(55) జ్వరంతో, గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి(55) ఊపిరితిత్తుల వ్యాధితో ఈ నెల 19న ఆస్పత్రిలో చేరారు. కేస్ షీట్లలో ఇద్దరి పేర్లను ఎం.సత్యవతిగా రాసుకున్నారు. మాదాసు సత్యవతికి మంగళవారం రాత్రి ఇంజెక్షన్ ఇవ్వగా తెల్లారేసరికి ఆమె చనిపోయింది.
మాదిరెడ్డి సత్యవతికి మంగళవారం రాత్రి ఆక్సిజన్ అందడం లేదని మరో వార్డుకు తరలించారు. బుధవారం ఉదయం డ్యూటీ డాక్టర్ హర్షవర్ధన్ మాదాసు సత్యవతి చనిపోయినట్టు తెలుసుకుని డిశ్చార్జికి బంధువుల సంతకం కోరారు. అయితే అందులో ఊరి పేరు గోకవరం అని ఉండటంతో మంగళవారం రాత్రి మాదిరెడ్డి సత్యవతిని వార్డు మార్చేటప్పుడు కేస్ షీట్‌లు మారిపోయి ఉంటాయని, ఆమెకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ తన తల్లికి ఇవ్వడం వల్లే మరణించిందని మృతురాలి కుమార్తె అరుణ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహంతో బంధువులు అస్పత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ మాట్లాడుతూ రోగిని తరలించే క్రమంలో కేస్ షీట్ తారుమారయినా వైద్యంలో ఎలాంటి లోపం లేదన్నారు. మృతురాలికి అంతర్గత అవయవాలు పాడయ్యాయని ముందుగానే బంధువులకు చెప్పి పలు పరీక్షలు సైతం చేశామన్నారు.