సాక్షి, బాలాజీచెరువు (తూర్పు గోదావరి): విద్యాసంవత్సరం ప్రారంభంలో కళాశాలల్లో ర్యాగింగ్, మహిళలపై అత్యాచారాలు, వేధింపులపై సదస్సులు హడావుడిగా నడుస్తాయి. ఆ రెండు నెలలు గడిస్తే మళ్లీ వాటి వంక చూసేవారు కనపడరు. పీఆర్‌జీ డిగ్రీ కళాశాలలో ఏడాదిన్నర క్రితం ఇదే నెలలో బోటనీ ఒప్పంద అధ్యాపకుడు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా ఓ డిగ్రీ ఫైనలియర్ విద్యార్థిని ప్రేమించి మోసగించిన విషయం తెలిసిందే. ఆ ఏడాది ఇది పెద్ద దుమారాన్ని లేపగా తాజాగా గతేడాది పేరు ప్రఖ్యాతులు కలిగిన జేఎన్‌టీయూకేలో ప్రొఫెసర్ ఏకంగా 20 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడి కటకటాలపాలయ్యాడు.
దీంతో విద్యాలయాల్లో విద్యార్థినులు చాలా భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో చాలామంది పదవ తరగతితో తమ పిల్లలను విద్య మాన్పించి వివాహాలు చేసేవారు. అయితే మారిన కాలానికనుగుణంగా మార్పు వచ్చి ఇప్పుడు తమ పిల్లలను కనీసం డిగ్రీ వరకూ చదివిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఇలా విద్యార్థినులకు రక్షణ లేకపోతే తల్లిదండ్రులు భయపడతారు. కాకినాడ నగరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలామంది విద్యార్థినులు ఇంటర్మీడియెట్, డిగ్రీతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్ అభ్యసించడానికి వస్తున్నారు. ఇటువంటి సంఘటనలు కళాశాలల్లో జరుగుతున్న నేపథ్యంలో తమ పిల్లలను చదివించడానికి తల్లిదండ్రులు వెనుకడుగేస్తున్నారు.
సదస్సులు దేనికి ?
అంతర్జాతీయ మహిళా సదస్సులు నిర్వహించిన గత తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో లైంగిక వేధింపులకు గురై న్యాయమో రామచంద్రా..! అంటూ గగ్గోలు పెట్టినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమని కళాశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయలేని ప్రభుత్వం మహిళా సదస్సులు దేనికోసం నిర్వహించిందో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము రోడ్డుపైకి వచ్చి మీడియాతో పాటు పత్రికల్లోకి ఎక్కితేనే గానీ తమకు న్యాయం జరగడం లేదని అంటున్నారు.
నిరుపయోగంగా విమెన్ ఎంపవర్‌మెంట్ సెల్‌లు
జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీతో పాటు నగరంలో పీఆర్ డిగ్రీ కళాశాల, అన్నవరం సత్యవతీదేవి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విమెన్ ఎంపవర్‌మెంట్ డైరెక్టరేట్‌లు, విమెన్ సెల్‌లు సంవత్సరంలో నాలుగైదుసార్లు మహిళా చైతన్యసదస్సులు, మహిళా దినోత్సవం నిర్వహించడానికి తప్ప వారికి ఏమాత్రం సహకరించడం లేదు. ఒక్క జేఎన్‌టీయూకే కాకుండా నగరంలో ఉన్న చాలా కళాశాలల్లో ఈ రకమైన వేధింపులు ఉన్నాయని, తమ పరువు ఎక్కడ పోతుందోనని భయపడి బయటకు రావడం మానేస్తున్నారని తెలుస్తోంది. తండ్రి వయసు కలిగిన అధ్యాపకులు ఇలా విద్యార్థినులపై మనసు పడటం ఏమిటని మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
మహిళా రక్షణ సెల్ సమర్థవంతగా పనిచేయాలి
మార్పు ప్రారంభం కావలసిన కళాశాలల్లోనే రక్షణ లేకపోవడం బాధాకరం. కళాశాలలతో పాటు వర్సిటీల్లో మహిళల సమస్యలతో పాటు వారి రక్షణకు ఏర్పాటు చేసిన విమెన్ ఎంపవర్‌మెంట్ సెల్‌లు సమర్థవంతంగా పనిచేయాలి. దీనిలోని సభ్యులు వాటిని తమలాంటి ఆడపిల్లల కోసమే ఏర్పాటు చేశారన్న విషయం గ్రహించి ఏ మాత్రం కుల,వర్గ వివక్ష చూపకుండా మహిళలందరికీ సమన్యాయం చేసేలా కృషిచేయాలి. రోడ్డెక్కితేనే న్యాయం జరుగుతుందన్న భావన వారిలో తొలగించి అందరికీ న్యాయం చేయాలి. ముఖ్యంగా మహిళా సంఘాలు ఇటువంటి సంఘటనల జరిగినప్పుడు విద్యార్థినులకు మద్దతుగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చూడాలి.
–డాక్టర్ ఆర్.సత్యభామ, మహిళా సంఘం నాయకురాలు
Comments
Please login to add a commentAdd a comment