లైబ్రరీ సైన్సు.. ఆ ఒక్కటీ అడక్కు.. | Library Science Issue In JNTUK East Godavari | Sakshi
Sakshi News home page

లైబ్రరీ సైన్సు.. ఆ ఒక్కటీ అడక్కు..

Published Mon, Jul 22 2019 11:42 AM | Last Updated on Mon, Jul 22 2019 11:42 AM

Library Science Issue In JNTUK East Godavari - Sakshi

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు, సమాజాభివృద్ధి వాటి ద్వారానే సాధ్యమంటూ సమావేశాల్లో ప్రసంగాలు చేసే అధికారులు.. వాటిపై శ్రద్ధ చూపడం లేదు. ఆ కోర్సు అభ్యసించి వాటిపై పరిశోధన చేయాలనుకునే వారి ఆశలను కూడా అడియాసలు చేస్తున్నారు. ప్రతి ఏటా నవంబర్‌లో నిర్వహించే గ్రంథాలయ వార్షికోత్సవాల్లో తప్ప మిగిలిన కాలంలో అసలు గ్రంథాలయాల వ్యవస్థపైనే దృష్టి సారించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన జేఎన్‌టీయూకేలోని గ్రంథాలయ విభాగం ప్రస్తుతం పూర్తిగా మరుగున పడిపోయే పరిస్థితి ఏర్పడింది.

సాక్షి, బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): జేఎన్‌టీయూకే ఆవరణలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీకి 2012లో శంకుస్థాపన చేశారు. రెండు అంతస్తుల విభాగంలో సుమారు.5 కోట్లతో భవనాన్ని నిర్మించారు. లైబ్రరీని 2014లో ప్రారంభించారు. సువిశాలంగా, దాదాపు 25 అడుగుల ఎత్తులో నిర్మించిన గ్రంథాలయానికి లిఫ్ట్‌ సౌకర్యం కల్పించలేదు. నేటికీ జనరేటర్‌ తదితర కనీస వసతులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయకపోవడంతో.. కరెంట్‌ పోతే చీకట్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

పరిశోధన కనుమరుగు
ఎనిమిది జిల్లాల్లోని 264 ఇంజినీరింగ్‌ కళాశాలలకు వేదికగా ఉన్న జేఎన్‌టీయూకేలో గ్రంథాలయ విభాగంలో పరిశోధన ఇక నుంచి కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతోంది. ఇప్పటివరకూ పీహెచ్‌డీలు ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీయే స్వయంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రతిభ కలిగిన వారికి సీట్లు కల్పించేవారు. అయితే గతేడాది నుంచి పీహెచ్‌డీల ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రంలోని 14 వర్సిటీలకు కామన్‌గా ఏపీఆర్‌సెట్‌ పేరుతో ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎంచుకున్న వర్సిటీలో ప్రవేశాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు.

లైబ్రరీ సైన్సు విభాగం తప్ప.. 
జేఎన్‌టీయూకే ఎలక్ట్రికల్, సివిల్, మ్యాథ్స్‌ వంటి పది విభాగాల్లో ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గత మే, జూన్‌ నెలల్లో అభ్యర్థులకు సమాచారం అందింది. అయితే లైబ్రరీ సైన్స్‌ విభాగంలో ఉత్తీర్ణత చెంది జేఎన్‌టీయూకే ఆప్షన్స్‌ ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రం వర్సిటీలో లైబ్రరీలో పీహెచ్‌డీ లేదని అధికారులు చెప్పడంతో అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షకు దాదాపు 20 వేల మంది హాజరైతే 1,500 మంది మాత్రమే ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో దాదాపు 100 మంది లోపు లైబ్రరీ సైన్స్‌కు హాజరయ్యారు.

ఇప్పుడు జేఎన్‌టీయూకే పరిధిలో ఈ కోర్సును నిర్వహించకపోవడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. జేఎన్‌టీయూకే ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ లైబ్రరీ సైన్స్‌ విభాగంలో 14 మందికి అడ్మిషన్లు కల్పించగా ఇద్దరూ డాక్టరేట్లు పొందారు.మరో ముగ్గురు చివరి దశలో ఉన్నారు. ఈ విషయంపై రిజిస్ట్రార్‌ సుబ్బారావును వివరణ కోరగా.. పూర్తి స్ధాయి ఫ్యాకల్టీలతో పాటు పీజీ స్థాయిలో విభాగం తప్పనిసరిగా ఉంటేనే పీహెచ్‌డీల ప్రవేశాలు ఉంటాయన్నారు. పూర్తి స్థాయి అధ్యాపకుల నియామకం తరువాత కమిటీ నిర్ణయం ప్రకారం ఈ విషయాన్ని ఆలోచిస్తామని ఆయన అన్నారు.

వైఎస్సార్‌ ఆశయం నెరవేర్చాలి
ప్రతి ఒక్కరికీ సాంకేతిక విద్యా ఫలాలు అందించేందుకు కాకినాడలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ఆశయాలు నెరవేరాలి. జేఎన్‌టీయూకేలో పీహెచ్‌డీలకు ప్రవేశాలు కల్పించాలి. వర్సిటీలో అన్నిరకాల సదుపాయాలు ఉండి అన్ని విభాగాల్లో పీహెచ్‌డీలు కల్పిస్తున్నారు. కేవలం గ్రంథాలయ శాస్త్రంలో ప్రవేశాలు కల్పించకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై విద్యా శాఖ మంత్రి, ఉన్నత అధికారులను కలుస్తాం. 
– డాక్టర్‌ బీఆర్‌ దొరస్వామి నాయక్, అసోసియేట్‌ ప్రొఫెసర్, లైబ్రరీ సైన్స్, జేఎన్‌టీయూకే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement