కదిరి : అనంతపురం జిల్లా కదిరికి చెందిన పలువురు మహిళలు.. తమకు 2009లో ఇంటిపట్టాలు ఇచ్చారని, కానీ ఇంతవరకూ స్థలాలు చూపలేదని గురువారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో బైఠాయించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. తమకు ఇళ్ల స్థలాలు చూపాలంటే ఒక్కొక్కరూ రూ. 3000 ఇవ్వాలని అధికారపార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పట్టాలు ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా ఇంతవరకూ స్థలాలు ఎందుకు చూపడం లేదని వారు వాపోయారు. ఇదివరకు కూడా ఇంటిస్థలాలు చూపాలని చాలాసార్లు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇంటిస్థలాల సర్వేయర్‌ను పంపించి, స్థలాలు చూపించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ నాయకులు జిఎల్ నరసింహులు, హరి, జగన్ తదితరులు పాల్గొన్నారు.