తోడ పుట్టిన వారితో పాటు.. తనకు కూడా ఆస్తిలో వాటా ఇవ్వక పోతే.. ఆత్మహత్య చేసుకుంటా అంటూ ఓ మహిళ బెదిరిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన గొలుం రాఘవమ్మకు నలుగురు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి.
ముగ్గురు కూతుళ్లకు తనకున్న ఎకరంన్నర పొలాన్ని రాసిచ్చిన రాఘవమ్మ నాలుగో కుమార్తె పెంకె వరలక్ష్మికి మాత్రం ఇంటి స్థలం కేటాయించింది. దీనిపై వరలక్ష్మి మూడు రోజులుగా కుటుంబ సభ్యులతో గొడవ పడుతోంది. సోమవారం తన ఇద్దరు పిల్లలను, కిరోసిన్ డబ్బా తీసుకుని పొలంలోకి వెళ్లి, వాటా ఇవ్వకుంటే నిప్పంటించుకుని చనిపోతానంటూ బెదిరించింది. దీంతో కుటుంబసభ్యులతో గ్రామపెద్దలు వరలక్ష్మికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.