
ఆకాశంలో అద్భుతం..
సాయంత్రం 6.48 నిమిషాల సమయం..
నింగినిండా మబ్బులు.. అప్పుడప్పుడు మెరుపులు..
ఇంతలో ఆకాశంలో అద్భుతం. మార్తాండుడు మళ్లీ
ఉదయిస్తున్న సన్నివేశం. తిమిర సంహారం జరుగుతోందా అన్నట్లు ఆకాశంలో ఒక్కసారిగా వెలుతురు వచ్చింది. దాదాపు నిమిషం పాటు ఆ కాంతి కనిపించింది. కాసేపటికి మళ్లీ చీకటి అలముకుంది. ఈ దృశ్యాన్ని చూసిన విశాఖ వాసుల్లో ఏం జరుగుతుందో తెలియని ఆశ్చర్యం.. మరికాసేపటికే మళ్లీ అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. దీనిపై వాతా వరణ నిపుణులు స్పందిస్తూ.. వాస్తవానికి ఉత్తర, దక్షిణ ధృవాల ప్రాంతాల్లో ఇలాంటి కాంతిని వెదజల్లే దృశ్యాలు (అరోరా బొరియాల్సిస్) సంభవిస్తాయని చెప్పారు. మన ప్రాంతంలో అలాంటివి ఏర్పడే అవకాశం లేదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం
అధికారులు అంటున్నారు. గురువారం నాటి ఘటనపై తాము ఇదమిత్థంగా ఏమీ చెప్పలేమని తెలిపారు.
- సాక్షి, విశాఖపట్నం