జవాబుదారీతనంతో పని చేయండి
జిల్లా అభివృద్ధిపై పెదవి విరిచిన సీఎం
లక్ష్యసాధనలో లోటు స్పష్టంగా కనిపిస్తోంది
బడ్జెట్ ఇస్తూ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా పురోగతి లేదేం
కార్పొరేట్ స్థాయిలో జీతాలు ఇస్తున్నా...
ఫాస్ట్‌ట్రాక్‌లోకి వచ్చే వరకు జిల్లాలో సమీక్షలు
కర్నూలు(అగ్రికల్చర్) : అన్ని శాఖలకు అవసరమైన బడ్జెట్ ఇస్తూ అధికారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ లక్ష్యసాధనలో లోటు స్పష్టంగా కనిపిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా అభివృద్ధిపై పెదవి విరిచారు. శనివారం రాత్రి 11 నుంచి 12.30 గంటల వరకు ముఖ్యమంత్రి స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో జిల్లా అభివృద్ధిపై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో అట్టడుగున ఉందన్నారు.
ఆ తర్వాతి స్థానం కర్నూలుదేనన్నారు. జిల్లా అభివృద్ధికి చేయాల్సినదంతా చేస్తున్నా ప్రగతి కనిపించడం లేదని జిల్లా యంత్రాంగంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్ స్థాయి జీతాలు ఇస్తున్నామని, ప్రతిఒక్కరూ జవాబుదారీత నంతో పనిచేసి జిల్లాను ప్రగతిపథంలోకి తీసుకురావాలన్నారు. కొన్ని అంశాల్లో కాకి లెక్కలు చూపుతున్నట్లు కనబడుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇబ్బందికరంగా ఉందని.. అంకితభావంతో పని చేయాలన్నారు.
అధికారులంతా విధి నిర్వహణలో కీలకపాత్ర పోషించి ఉన్నత లక్ష్యాలు సాధించి ఫాస్ట్‌ట్రాక్‌లోకి వచ్చే వరకు జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహిస్తుంటానన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరు-చెట్టు కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యతనిచ్చి భూగర్భ జలాల పెంపునకు కృషి చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ మాట్లాడుతూ జిల్లాలో 32.72 లక్షల హెక్టార్లకు సరిపడా నీటి నిల్వలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు.
గ్రామాల వారీగా నీటి లభ్యతను బట్టి అనువైన ప్రదేశాల్లో డగౌట్‌పాండ్స్, ఫాంపాండ్స్, చెక్‌డ్యాంలు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రానున్న నాలుగేళ్లలో కోటి మొక్కలు నాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సీఎం స్పందిస్తూ ప్రతి పనికి ప్రణాళిక మేరకు లెక్క ఉండాలని, లేకపోతే ఏమి చేసినా ప్రయోజనం ఉండదన్నారు. సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రామాంజనేయులు.. ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, బి.సి.జనార్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.