సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగానికి పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని తక్షణమే అమలులోకి తెచ్చేందుకు మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టిపెట్టాలని విద్యుత్ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ఈ అంశంపై సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలను సమర్థవంతంగా అనుసంధానించి అనుకున్న లక్ష్యాన్ని త్వరితగతిన సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా పరిస్థితిని విద్యుత్ అధికారులు సీఎంకు వివరించారు.
వారంపాటు ట్రయల్ రన్ నిర్వహించండి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 6,663 విద్యుత్ ఫీడర్ల ద్వారా వ్యవసాయ, గ్రామీణ గృహావసరాలకు విద్యుత్ వినియోగం అవుతోందని, వీటిలో 3,854 ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. మొత్తం ఫీడర్లలో ఇవి 60 శాతంగా ఉన్నాయని, వీటన్నింటినీ వారం రోజులపాటు ట్రయల్ రన్‌చేసి సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే అధ్యయనం చేసి లోపాలను సవరించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. అనంతరం వారం రోజుల్లోగా పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా విషయమై ప్రకటన చేస్తామన్నారు. మిగిలిన 40 శాతం.. అంటే 2,809 ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లేవని సీఎం గుర్తించారు. అయితే, వాటి సామర్థ్యాన్ని పెంచి వాటిని కూడా పూర్తిస్థాయిలో వాడుకలోకి తెచ్చేవిధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకు అవసరమైన రూ.1,700 కోట్లను వెంటనే కేటాయిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
రైతులకు ఫీడర్ల వారీగా షెడ్యూల్
కాగా, ఏ ప్రాంతానికి ఎప్పుడు విద్యుత్ సరఫరా చేస్తున్నామో రైతులకు స్పష్టంగా తెలియజేయాలని, దీనిలో ఎలాంటి గందరగోళం ఉండకూడదని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఫీడర్ల వారీ టైం షెడ్యూల్‌ను తయారుచేసి ఆయా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా చేసే సమయాలను ఖచ్చితంగా వెల్లడించడమే కాకుండా సరిగా అమలు జరిగేలా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీకాంత్ నాగులాపల్లి, జెన్‌కో ఎండీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పీపీఏలపై చర్చ
ఇదిలా ఉంటే.. గత ఐదేళ్లుగా విద్యుత్ పంపిణీ సంస్థలతో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ముఖ్యమంత్రి వద్ద చర్చకు వచ్చినట్టు తెలిసింది. కేవలం ప్రైవేటు విద్యుత్ కొనుగోలు కోసమే అనవసరంగా విద్యుత్ డిమాండ్‌ను చూపించారని, దాన్ని బలవంతంగా ప్రజలపై రుద్దేందుకు ఏపీ జెన్‌కో ఉత్పత్తికి గండికొట్టారని అధికారులు సీఎం దృష్టికి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా వాడకం కింద కేవలం ఏటా 5 శాతం మాత్రమే పవన, సౌర విద్యుత్ తీసుకోవాల్సి ఉందని, కానీ.. రాష్ట్రంలో ఏకంగా 25 శాతం వరకూ తీసుకున్నారని, ఈ కారణంగా నిలిపివేసిన థర్మల్ ప్లాంట్లకు వృథాగా యూనిట్‌కు రూ.1.25 చెల్లించారని చెప్పినట్లు సమాచారం. ఈ రకంగా దాదాపు రూ.3 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని సీఎం దృష్టికి తేవడంతో, దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వైఎస్ జగన్ కోరినట్టు తెలిసింది.
విద్యుత్ నాణ్యతలో రాజీపడొద్దు : సీఎం
పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా అమలుచేసే బాధ్యత అధికారులపైనే ఉందని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. కొంత సమయం పట్టినా 9 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే దిశగానే చర్యలు ఉండాలన్నారు. వారం రోజుల్లో ఇది అందుబాటులోకి వచ్చేలా నిర్దిష్టమైన ప్రణాళికను తయారుచేయాలని ఆదేశించారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి ప్రత్యేకంగా ఫీడర్లను ఏర్పాటు చేయాలని, దీనిపైనా అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment