సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయ రంగంలో మరో విప్లవాత్మక మార్పునకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. సీఎం యాప్, ఫాంగేట్ పద్ధతిలో కొనుగోళ్లపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహిచారు. క్షేత్ర స్థాయిలో పంటలకు దక్కుతున్న ధరలు, మార్కెట్‌లో జోక్యం ద్వారా ధరల స్థిరీకరణకు ఉద్దేశించిన సీఎం యాప్ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్ మెంట్) పని తీరును ఆయన స్వయంగా పర్యవేక్షించారు. మొక్క జొన్న కనీస మద్దతు ధర కన్నా రైతు ఉన్న మండలంలో వంద రూపాయలు తక్కువ ధర ఉందంటూ సీఎం యాప్‌లో పొందుపరిచిన డేటా ఆధారంగా గుర్తించి కృష్ణా జిల్లా కంకిపాడు డీసీఎంఎస్ పరిధిలోని రైతు నుంచి మార్కెటింగ్ శాఖ తరఫున కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశారు. ప్రయోగాత్మకంగా చేసిన ఈ కొనుగోలుకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పరిశీలించారు. మే 30న రైతు భరోసా కేంద్రాల ప్రారంభంతో పాటు, సీఎం యాప్ కూడా ప్రారంభం అవుతోందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. (ఏపీకి ప్రత్యేక బలం ఉంది : సీఎం జగన్)
ప్రయోగాత్మకంగా సీఎం యాప్ పరిశీలన
సీఎం యాప్ పని తీరును సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారులు వివరించారు. ఇదే సమయంలో ప్రయోగాత్మకంగా ఎలా పని చేస్తుందన్న దానిపై ఒక రైతు నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు నమోదు చేసిన సమాచారం ఆధారంగా కృష్ణాజిల్లా మంతెన గ్రామంలో మొక్కజొన్న కనీస మద్దతు ధర రూ.1760 అయితే రూ.1600 మాత్రమే క్వింటాలుకు లభిస్తుందని అక్కడ వీఏఏ నమోదు చేశారు. వెంటనే ఆ రైతు వద్దనున్న 57.5 క్వింటాలు మొక్కజొన్నను కనీస మద్దతు ధర రూ.1760 చొప్పున కొనుగోలు చేశారు. ఈ డబ్బు ఆధార్ అనుసంధానం చేసిన అకౌంట్‌లో వేశారు. ఆన్‌లైన్ ద్వారా జరిగిన ఈ మొత్తం ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. కొన్ని మార్పులు, చేర్పులను సీఎం జగన్ అధికారులకు సూచించారు. సీఎం యాప్‌పై నిరంతర పరిశీలన, పర్యవేక్షణ ద్వారా బలోపేతం చేయాలని, ఎప్పటికప్పుడు వచ్చే సమస్యలను నివారించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఫాంగేట్ పద్ధతిలో కొనుగోళ్లు జరపాలి
మార్కెట్ ఇంటెలిజెన్స్‌తో పాటు, అది అందించే సమాచారం ఆధారంగా కనీస గిట్టుబాటు దొరకని ప్రాంతాల్లో రైతులను ఆదుకునే చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షించారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో ప్రారంభించనున్న రైతు భరోసా కేంద్రాలతో పాటు, మార్కెట్ ఇంటెలిజెన్స్, ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసుకున్న సీఎం యాప్ ద్వారా విప్లవ్మాతక మార్పులకు శ్రీకారం చుడతుందని సీఎం తెలిపారు. ఏ గ్రామంలోనైనా పంటలకు ఇబ్బంది ఉందనే సమాచారం తెలియగానే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కనీస గిట్టుబాటు ధర కన్నా తక్కువ ధర వస్తున్నప్పుడు వెంటనే జోక్యం చేసుకుని ఫాంగేట్ వద్దే కొనుగోళ్లు జరపాలని ఆదేశించారు. ఇందులో అనుసరించాల్సిన విధి విధానాలపై ఒక ఎస్‌ఓపీని సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. పంటలు, వాటి ధరలపై విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు సమాచారాన్ని నమోదు చేయడం, నమోదు చేసిన వెంటనే సంబంధిత జేసీ సహా, అధికారులు వెంటనే స్పందించి రైతును ఆదుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు నాణ్యమైన సేవలు అందించడం, సమస్య పరిష్కారంలో వేగం చూపడం రైతు భరోసా కేంద్రాలు చూస్తున్న జేసీ ప్రధాన కర్తవ్యం కావాలని సీఎం నిర్దేశించారు.
10 రోజల్లోగా చెల్లింపులు జరిగాలి
మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకున్న తర్వాత కూడా పంటలకు సంబంధించి ధర పెరిగిందా? లేదా? అన్న దానిపై పరిశీలన ఉండాలని, రైతుకు కనీస గిట్టుబాటు ధర రాకపోతే తగు చర్యలన్నీ తీసుకొని మార్కెట్‌లో మళ్లీ ధరల స్థిరీకరణ తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రభుత్వం నుంచి కనీసం 30 శాతం పంటలను కొనుగోలు చేయాలని, ఈ లక్ష్యం క్రమేణా గ్రామ స్థాయికి చేరాలని సీఎం స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన పంటలకు సంబంధించి కూడా ఎన్ని రోజుల్లోగా చెల్లింపులు చేస్తామనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలని, కనీసం 10 రోజల్లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయిలో పంటలను గ్రేడింగ్, సార్టింగ్, ప్యాకింగ్ చేసే సదుపాయాలతో పాటు కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లును ఏర్పాటు చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలన్నారు. తద్వారా జనతా బజార్లలో రైతుల నుంచి సేకరించే వస్తువులు నాణ్యంగా ఉంటాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం యాప్ ద్వారా వస్తున్న డేటాను ఎప్పటికప్పుడు పరిశీలించి సమస్యలను అధిగమించుకుంటూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి తెలిపారు.
ఈ నెల 30న వైయస్సార్ ఆర్బీకేలు ప్రారంభం
సీఎం యాప్‌పై మండలానికి ముగ్గురు చొప్పున వీఏఏలకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చిన తర్వాత వారి చేత మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30న ప్రారంభం కానున్న వైఎస్సార్ ఆర్బీకేల వద్ద పంటల కనీస మద్దతు ధరల పట్టిక ఉంచాలని, వీఏఏలు సీఎం యాప్‌ను డౌన్‌లోడ్ చేశారా లేదా చూసుకోవాలని తెలిపారు. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? లేదా చూడాలని, కియోస్క్‌లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? అన్న దానిపై పరిశీలన ఉండాలని అధికారలకు సూచించారు. నెల రోజుల తర్వాత కూడా సీఎం యాప్‌పై మరోసారి సమీక్ష చేసుకుని లోపాలు గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment