మోదీ, షాలకు సీఎం జగన్‌ కృతజ్ఞతలు | CM YS Jagan Mohan Reddy Review Meeting With Central Team Over Crop Loss In Tadepalli | Sakshi
Sakshi News home page

కేంద్ర బృందాన్ని పంపినందుకు ధన్యవాదాలు

Published Wed, Nov 11 2020 5:44 PM | Last Updated on Wed, Nov 11 2020 8:01 PM

CM YS Jagan Mohan Reddy Review Meeting With Central Team Over Crop Loss In Tadepalli - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యింది.  కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్‌ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు భారీగా నష్టం జరిగినందువల్ల, అక్కడ పర్యటించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం ఆ జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్‌రాయ్‌ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని బృందం పేర్కొంది. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని  కేంద్ర బృందం హామీ ఇచ్చింది. (చదవండి: ‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’)

కేంద్ర బృందంతో భేటీ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగిందని,  మొత్తం రూ. 8084 కోట్ల నష్టం జరిగిందని సీఎం బృందానికి వివరించారు. అందులో రూ.5 వేల కోట్ల మేర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిందని, వ్యవసాయం, అనుబంధ ప్రైమరీ రంగంలో రూ. 3 వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. భారీ నష్టం జరిగినందువల్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వీలైనంత వరకు ఎక్కువ సహాయం అందేలా సహకరించాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు.  రైతులను ఆదుకోవడంలో సహాయపడాలని, ‘ఎఫ్‌ఏక్యూ’ రిలాక్సేషన్‌ అందేలా చూడాలన్నారు. వర్షాలు, వరదలతో దెబ్బ తిన్న పంటలు కూడా కొనుగోలు చేసేలా, ఆ మేరకు ధాన్యం, వేరుశనగ కొనుగోలులో ‘కనీస నాణ్యతా ప్రమాణాలు’ సడలించాలని, లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని)

ఇన్‌పుట్‌ సబ్సిడీ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌లో పరిహారం (ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని, అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని చెప్పారు. ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా సహాయం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. అనంతరం గత నెలలో సంభవించిన భారీ వర్షాల వల్ల ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, ఆ తర్వాత రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాల్వలకు గండ్లు పడి కూడా భారీ నష్టం సంభవించిందని సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని వివరించారు. కాగా ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) ముఖ్య కార్యదర్శి ఉషారాణి, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ కమిషనర్‌ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది: బొత్స)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement