nilam Sahni
-
మోదీ, షాలకు సీఎం జగన్ కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నెలలో సంభవించిన భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండు రోజుల పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు, అనంతపురం జిల్లాలో పర్యటించింది. అనంతపురం జిల్లాలో వేరుశనగ పంటకు భారీగా నష్టం జరిగినందువల్ల, అక్కడ పర్యటించాలన్న సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్ర బృందం ఆ జిల్లాలో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది. రాష్ట్రంలో పర్యటన కాస్త ఆలస్యం అయినప్పటికీ భారీ వర్షాలు, వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహిస్తున్న సౌరవ్‌రాయ్ వెల్లడించారు. తమ పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని బృందం పేర్కొంది. రైతులకు జరిగిన నష్టంపై కేంద్రానికి పూర్తి నివేదిక ఇస్తామని, వీలైనంత సహకారం అందేలా చూస్తామని కేంద్ర బృందం హామీ ఇచ్చింది. (చదవండి: ‘43 లక్షల మంది తల్లులకు అన్నయ్య అయ్యారు’) కేంద్ర బృందంతో భేటీ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్ర బృందాన్ని పంపినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం జరిగిందని, మొత్తం రూ. 8084 కోట్ల నష్టం జరిగిందని సీఎం బృందానికి వివరించారు. అందులో రూ.5 వేల కోట్ల మేర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగిందని, వ్యవసాయం, అనుబంధ ప్రైమరీ రంగంలో రూ. 3 వేల కోట్ల రూపాయల మేర నష్టం జరిగిందన్నారు. భారీ నష్టం జరిగినందువల్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వీలైనంత వరకు ఎక్కువ సహాయం అందేలా సహకరించాలని కేంద్ర బృందాన్ని సీఎం కోరారు. రైతులను ఆదుకోవడంలో సహాయపడాలని, ‘ఎఫ్ఏక్యూ’ రిలాక్సేషన్ అందేలా చూడాలన్నారు. వర్షాలు, వరదలతో దెబ్బ తిన్న పంటలు కూడా కొనుగోలు చేసేలా, ఆ మేరకు ధాన్యం, వేరుశనగ కొనుగోలులో ‘కనీస నాణ్యతా ప్రమాణాలు’ సడలించాలని, లేదంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. (చదవండి: చంద్రబాబుకు తగిన శాస్తి చేస్తాం: కొడాలి నాని) ఇన్పుట్ సబ్సిడీ: గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబరు వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని, అక్టోబరులో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని చెప్పారు. ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి, వీలైనంత త్వరగా సహాయం చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. అనంతరం గత నెలలో సంభవించిన భారీ వర్షాల వల్ల ఎక్కువగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, ఆ తర్వాత రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాల్వలకు గండ్లు పడి కూడా భారీ నష్టం సంభవించిందని సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని వివరించారు. కాగా ఈ సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, రెవెన్యూ శాఖ (డిజాస్టర్ మేనేజ్మెంట్) ముఖ్య కార్యదర్శి ఉషారాణి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ కమిషనర్ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. (చదవండి: నంద్యాల ఘటనపై టీడీపీ రాజకీయం చేస్తోంది: బొత్స) -
నిమ్మగడ్డ రమేష్‌తో సీఎస్ నీలం సాహ్ని భేటీ
సాక్షి, విజయవాడ : స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కలిసి ప్రభుత్వ నివేదికను సమర్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం తెలపాలని రమేష్ కుమార్ కోరిన నేపథ్యంలో సీఎస్ సాహ్ని ఆయనతో భేటీ అయి ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కరోనా బారిన పడ్డారని, ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని నివేదికలో పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తామని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు తెలియజేశారు. ఈ భేటీలో పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. (చదవండి : టీడీపీ డిమాండ్ హాస్యాస్పదంగా ఉంది: అంబటి) ‘కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్నిచర్యలు తీసుకుంటోంది. దేశంలోనే అత్యత్తమంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రభుత్వ చర్యలతో కరోనాను నియంత్రిస్తున్నాం. కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. అధికారులు, ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. 11వేల మందికిపైగా పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, ఇతర ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు.అయినా సమర్థవంతంగా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు రాగానే సమాచారం ఇస్తాం. వాయిదా పడ్డ ఎన్నికల నిర్వహణపై తెలియజేస్తాం.‘ అని ఎస్ఈసీకి ఇచ్చిన నివేదికలో అధికారులు పేర్కొన్నారు. (చదవండి : ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి: సీపీఎం) -
కోవిడ్-19 స్థితిగతులపై ఏపీ గవర్నర్ సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్-19 స్థితిగతులపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ రాజ్‌భవన్ నుంచి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి ఇతర అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఇతర అధికారుల కృషిని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు. లాక్డౌన్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుండి 13 శాతం వరకు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మొదటి ఐదు జిల్లాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ 5 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మొబైల్ టెస్టింగ్ వ్యాన్ల ద్వారా కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. (చదవండి: ఏపీలో కొత్తగా 4,994 కరోనా కేసులు) లాక్డౌన్ ప్రకటించిన తరువాత పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి తరలిరావడమే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ గవర్నర్‌కు వివరించారు. పాజిటివ్ కేసుల పెరుగుదలకు అనుగుణంగా తగిన సంఖ్యలో ఆసుపత్రిలో పడక గదులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు వారాల తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసుల సంఖ్యను 5 శాతానికి తగ్గించడానికి, మరణాల సంఖ్యను 1 శాతం కంటే తక్కువగా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్‌లతో పాటు చికిత్స పద్ధతిని అనుసరించి కరోనా ఉధృతిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అని ఆయన తెలిపారు. (చదవండి: గోరంత జాగ్రత్త.. కొండంత రక్ష) 24 గంటల్లో ఫలితం లభించేలా కరోనా పరీక్ష లేబరేటరీల పనితీరును క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. ప్రజలు 104 కాల్ సెంటర్‌కు కాల్ చేసి పరీక్ష చేయించుకోవచ్చని, కాల్ సెంటర్ ద్వారా కోవిడ్-19 పాజిటివ్ రోగులు ఆసుపత్రులలో అడ్మిషన్ కూడా పొందవచ్చని జవహర్ రెడ్డి అన్నారు. 15 - 20 నిమిషాల్లో ఫలితాన్ని ఇవ్వగల 3.25 లక్షల రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని, పరీక్షలను కూడా రోజుకు 35000 - 40000 వరకు పెంచడానికి కృషి చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసిందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక కోవిడ్ -19 రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వం 2700 మంది వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్లు జవహర్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. (చదవండి: బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు.. నెలాఖరుకు భర్తీ) -
ఏపీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా రమేష్ కుమార్
సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.రమేష్‌కుమార్ నియమితులయ్యారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆయన పశ్చిమ బెంగాల్ కేడర్ ఐఏఎస్ అధికారిగా వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ తర్వాత పశ్చిమబెంగాల్ పరిపాలనా ట్రిబ్యునల్ సభ్యునిగా కూడా సేవలందించారు. ఉత్తమ అధికారిగా మన్ననలు అందుకున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లు లేదా 65 ఏళ్ల వయస్సు (ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) వరకు పదవిలో ఉంటారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రమేష్‌కుమార్ తండ్రి అబ్బయ్య కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేయడం విశేషం. (ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ) కమిషనర్‌గా శ్రీనివాసరావు రాష్ట్ర సమాచార కమిషనర్‌గా రేపాల శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మూడేళ్లుగానీ లేదా 65 ఏళ్ల వయస్సు వరకు గానీ(ఈ రెండింటిలో ఏది ముందయితే అదే వర్తిస్తుంది) ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సీఎస్ జీవో జారీ చేశారు. -
ఆరోగ్య సేతు ఉంటేనే ఏపీ సచివాలయంలోకి..
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. ఆరోగ్య సేతు యాప్ ఉన్నవారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. విధులకు వచ్చే ఉద్యోగులు కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు, మాస్కులు వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులతో పాటు సచివాలయ సందర్శనకు వచ్చే వారిని కూడా ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ ఉంటేనే అనుమతించాలని, లేదంటే అనుమతించరాదన్నారు. దీన్ని కఠినంగా అమలు చేయాల్సిందిగా సచివాలయ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌కు సూచించారు. సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బ్లాక్ ప్రవేశం ద్వారం వద్దే థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు చేతులను శానిటైజ్ చేసుకోవాలన్నారు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ) ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కార్యాలయానికి బయల్దేరే ముందు తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను యాప్‌లో స్టోర్ చేయాలి. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. కాగా కరోనా తాజా సమాచారంతో పాటుగా వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తున్న నియంత్రణ చర్యలు వంటి అంశాలను అందించే ఆరోగ్య సేతు యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వినియోగించేలా కేంద్రం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆరోగ్య సేతు అప్డేటెడ్ వెర్షన్లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తే కరోనా వ్యాప్తిని పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. (ఉద్యోగులకు మహారాష్ట్ర కీలక ఆదేశాలు) -
ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవికాలం పొడగింపు
-
ఆత్మనిర్భర్ ఆర్థిక ప్యాకేజీపై నీలం సాహ్ని సమీక్ష
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజీతో ఏఏ శాఖలకు ఎంత మేరకు నిధులు సమకూరుతాయే అంచనా వేసి తద్వారా వివిధ పథకాలన్నీ ప్రజలందరికీ లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం ప్యాకేజీ అమలుపై సీఎస్ క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రాథమిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇస్తూనే.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీని పటిష్టంగా అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కపేదవారికి లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. (‘ఉద్దీపన ప్యాకేజ్‌తో ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం’) ఈ విషయమై వచ్చే సమావేశంలో సవివరంగా చర్చిద్దామని ఆలోగా శాఖల వారీ పూర్తి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. అంతకుముందే ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ప్రకటించిన ప్యాకేజీతో రాష్ట్రంలోని వివిధ శాఖలకు కలిగే ప్రయోజనాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆలాగే వ్యవసాయం, పాడి పరిశ్రమాభివృధ్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి బీ ఉదయలక్ష్మి, ఇంధన, మున్సిపల్ పరిపాలన శాఖల కార్యదర్శులు ఎన్. శ్రీకాంత్, జే శ్యామలరావు, పరిశ్రమల శాఖ సంచాలకులు సుబ్రహ్మణ్యం వారి వారి శాఖలకు సంబంధించి ఎంతమేరకు ఆర్ధిక ప్యాకేజి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలియజేశారు. కాగా ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ, ఎస్ఎల్బిసి కన్వీనర్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. (ప్రధాని ప్రసంగం.. అర్థం ఏంటో!) -
'ఎంఫాన్' పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి అమరావతి: రెడ్ జోన్లలో ఉన్న ఆసుపత్రుల్లో కచ్చితమైన మెడికల్ ప్రొటోకాల్ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై ఆయన సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో కోవిడ్-19 పరీక్షలు కొనసాగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు) అంతేగాక కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ప్రతి పది లక్షల జనాభాకు 2,224 మందికి కరోనా వైరస్ (కోవిడ్-19) పరీక్షలు నిర్వహించగా తమిళనాడులో ప్రతి మిలియన్‌కు 1929 పరీక్షలు, రాజస్థాన్‌లో ప్రతి మిలియన్‌కు 1402 పరీక్షలు నిర్వహిస్తున్న అధికారుల సీఎం జగన్‌కు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10, 229 పరీక్షలు నిర్వహించగా ఆదివారం నాటికి మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67 పాజిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1092కి చేరినట్లు చెప్పారు. ఇందులో 524 మంది డిశ్చార్జి కాగా 36 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల శాతం 1.32 ఉండగా దేశం మొత్తంలో 3.84 ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ మరణాల రేటు 2 శాతం కాగా.. దేశంలో 3.27 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ల్యాబ్‌లు 11 ఉన్నాయని, వాటిలో పీరియాడికల్‌గా 3 ల్యాబ్‌ల్లో ఫ్యుమిగేషన్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 45 కేంద్రాల్లో 3245 ట్రూనాట్ మిషన్లు కూడా పని చేస్తున్నట్లు చెప్పారు. గతంలో 245 ఉండవని, మరో వంద పెంచి 11 ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌ల్లో 22 మిషిన్లు పనిచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కూడా 4 మిషన్లు ఉంచాలన్నది ప్రభుత్వ ప్రయత్నమని, రోజువారి పరీక్షల సామర్థ్యం 6 వేల నుంచి 10 వేల పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,292 మందికి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాక కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా టెస్టులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. (కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : పువ్వాడ) టెలి మెడిసిన్, వలస కూలీలు, యాత్రికుల అనుమతిపై ఆరా.. టెలి మెడిసిన్‌పై సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెలిమెడిసిన్ వ్వవస్థ బలోపేతం కావాలని సీఎం జగన్ పేర్కొన్నారు. అంతేగాక కీలకమైన కాల్ సెటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. దిశ, టెలిమెడిసిన్, అవినీతి నిరోధానికి సంబంధించిన ఏసీబీ, వ్యవసాయ తదితర కీలక నంబర్లను ప్రతి గ్రామ వార్డు సచివాలయాలకు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల అంశంపై అధికారులను ప్రశ్నించగా.. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినా యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులకు అనుమతి ఇస్తామని మరోమారు స్పష్టం చేశారు. వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇక కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి వచ్చే వాళ్లు ఎక్కడనుంచి వస్తున్నారు, ఆయా రాష్ట్రాల్లో వారు గ్రీన్జోన్లో ఉన్నారా? ఆరెంజ్ జోన్లో ఉన్నారా? లేక రెడ్ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వీటన్నింటిని నిర్ధారించుకున్న తర్వాతే వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామన్న అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక స్పందన వెబ్సైట్ ద్వారా మాత్రమే కాకుండా వివిధ మార్గాల ద్వారా విజ్ఞప్తి చేసుకున్న వారు కూడా ఉన్నారన్న అధికారులు తెలిపారు. ఇక వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదన్న అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అంతేగాక దీన్ని ఎలా బలోపేతం చేయాలి అన్న దానిపై దృష్టి పెట్టాలని, అలాగే వచ్చే వారికి చేయాల్సిన పరీక్షల విధానంపైకూడా మార్గదర్శకాలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం ‘ఎంఫాన్’ తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని ఆయన అధికారులను హెచ్చరించారు. తుపాను కదలికలను గమనించాలని, దీనిపై విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాను వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తగినంత కార్యచరణతో పాటు అధికారులను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేగాక తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని చెప్పారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు. (ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం) ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలని సీంఎ జగన్ పేర్కొన్నారు. వీటికి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటే ధరల్లో కూడా స్థిరీకరణ వస్తుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుని పంపాలన్నారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుందని, పెరిషబుల్ గూడ్స్‌ను గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా సేకరించలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది జరిగిందని, గతంలో ఎన్నడూలేని విధంగా కొనుగోలు చేశామని అధికారులు పేర్కొన్నారు. ఇక ధాన్యం కొనుగోలును పెంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. -
కోవిడ్-19 టెస్ట్ కిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తయారైనా కోవిడ్-19 ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ప్రారంభించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి రజత్ భార్గవ్ ఇతక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: ‘దేశంలో ఒక్క ఏపీలోనే వాటి తయారీ’ కాగా.. రాష్ట్రంలో తాజాగా మరో 15 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో బుధవారం ఉదయం నాటికి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 329కు చేరింది. కొత్తగా నమోదైన 15కేసుల్లో నెల్లూరులో 6, కృష్ణాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. -
సత్వరంగా పరిష్కరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదేశం మేరకు ఇచ్చిపుచ్చుకునే విధానంలో రాష్ట్ర విభజన వివాదాలను సత్వరంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీలం సాహ్ని, సోమేశ్‌కుమార్ నిర్ణయించారు. తెలంగాణ సచివాలయంలో బీఆర్కేఆర్ భవన్లో గురువారం ఏపీ, తెలంగాణ సీఎస్‌లు సమావేశమై విభజన సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పూర్తిగా సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో షెడ్యూల్–9, 10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తుల బట్వాడ, విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లంపు, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు తదితర అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చలను ఇకమీదట కూడా కొనసాగించాలని నిర్ణయించారు. త్వరలో మరోసారి సమావేశమై చర్చల పురోగతిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ విభజన వ్యవహారాల ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
రేపు సమావేశం కానున్న హై పవర్ కమిటీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫార్సులు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదికపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటైన హై పవర్ కమిటీ తొలిసారి సమావేశం కానుంది. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కమిటీ మెంబర్ కన్వీనర్ నీలం సాహ్ని నేతృత్వంలో హై పవర్ కమిటీ భేటీ అవుతోంది. ఈ కమిటీ జీఎన్ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనుంది. మొత్తం పదిమంది మంత్రులు, సీఎం ముఖ్య సలహాదారు, ఐదుగురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ హై పవర్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కాగా ఇప్పటికే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. చదవండి: మూడింటిలోనూ ఉద్ధండులే! బీసీజీ నివేదికలో ప్రస్తావించిన అంశాలు ఆ డబ్బుతో విశాఖలో రాజధాని నిర్మాణం.. జీఎన్ రావుపై చంద్రబాబు అక్కసు రాజధానిపై ఇప్పటికిప్పుడు ఉత్తర్వులివ్వలేం వికేంద్రీకరణకే మొగ్గు అమరావతిలోనే అసెంబ్లీ, రాజభవన్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి నిపుణుల కమిటీ అమరావతిని అప్పులు చేసి నిర్మిస్తే.. -
విద్యాశాఖ అంటేనే.. జ్వరమొస్తోంది!
దీర్ఘ సెలవులో వెళ్లిన పాఠశాల విద్య డెరైక్టర్ ఉషారాణి తప్పుకుంటానంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్ అధికారుల్లో గుబులు పుట్టిస్తున్న ఇరు రాష్ట్రాల వివాదాలు ఏ నిర్ణయం తీసుకుంటే ఏ మవుతుందోననే ఆందోళన కీలక నిర్ణయాలకు దూరంగా ఉంటున్న ఉన్నతాధికారులు వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఇదీ దుస్థితి బెంబేలెత్తుతున్న ఉన్నతాధికారులు కేంద్రానికి వెళ్లే యోచనలో ముఖ్యకార్యదర్శి నీలం సహానీ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖలో పనిచేయడానికి ఉన్నతాధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తు న్న అధికారులు ఏదో ఒక కారణం చూపి అక్కడి నుంచి బయటపడాలన్న భావనలోనే ఉంటున్నా రు. రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యా వ్యవహారాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండడంతో అధికారులు ఆయా నిర్ణయాల నుంచి సాధ్యమైనంతమేర దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఎందుకు ఇరకాటంలో పడాలని ఆయా శాఖల నుంచి బయటకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. కేంద్రానికి వెళ్లిపోయే యోచనలో సహానీలు... ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నీలం సహానీ.. ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యా శాఖ వ్యవహారాలు తరచూ వివాదాలుగా మారుతుండడంతో ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతున్నారు. ఇటీవల ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో నీలం సహానీ ఏపీ వాదనను గట్టిగా విని పించారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, ఎంసెట్ వేర్వేరుగా నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఒక దశలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సహానీపై అసహనం వ్యక్తంచేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం అలాగే కొనసాగుతున్న తరుణంలో విద్యాశాఖ బాధ్యతల నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచి దన్న అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు పేర్కొంటున్నారు. తెలంగాణకు కేటాయించిన ఈమె భర్త అజయ్ సహానీతో పాటు కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బయటపడే యోచనలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న రాంశంకర్‌నాయక్ తనను బాధ్యతల నుంచి తప్పించాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య గందరగోళంగా మారడం, ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు ఉమ్మడిగా ఉన్న పరిస్థితుల్లో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో త్వరగా బయటపడాలని ఆయన భావిస్తున్నా రు. ఐఏఎస్‌ల విభజనలో ఆయన ఏపీకే కేటాయింపయ్యారు. అధికారికంగా ఆ జాబితా అమల్లోకి వస్తే తనకు ఇక్కడి నుంచి మోక్షం కలుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. విద్యాశాఖ డెరైక్టర్ సెలవు... పాఠశాల విద్యాశాఖలోనూ అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఉషారాణి ఇప్పటికే సెలవుపై వెళ్లారు. ఆరోగ్యం బాగోలేని కారణం చూపి ఆమె ఎక్కువ రోజులు సెలవుపై వెళ్లారు. అయితే.. విద్యాశాఖలో ఉన్నతస్థాయి అధికారుల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలోనే ఉషారాణి సెలవు పెట్టి వెళ్లినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ బాధ్యతలను కూడా ఇంట ర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్కే అప్పగించారు. అంటీముట్టనట్లు ఉంటున్న అధర్‌సిన్హా... ప్రాధమిక, ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న అధర్‌సిన్హా ఇంటర్మీడియట్ కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్‌ల విభజనలో ఆయన తెలంగాణకు కేటాయింపు అయ్యారు. దీంతో గత కొంత కాలంగా ఆయన ఈ శాఖ తరఫున నిర్ణయాల్లో ఎలాంటి చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేయాల్సి ఉంటుందన్న అభిప్రాయంతోనో ఏమో కానీ ఆయన శాఖ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. వివాదాస్పదంగా ఉన ్న ఇంటర్మీడియట్ విషయంలో అయితే మరీ దూరంగా ఉంటున్నారని ఆ శాఖవర్గాలే పేర్కొంటున్నాయి.ఓ పక్క పదో తరగతి, ఇంటర్మీడియట్ తదితర పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు చురుగ్గా సాగాల్సిన తరుణంలో విద్యా శాఖా ఉన్నతాధికారుల వ్యవ హారం చర్చనీయాంశంగా మారుతోంది.