ఏపీ సీఎస్ నీలం సాహ్నికి పుష్పగుచ్ఛం అందిస్తున్న తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆదేశం మేరకు ఇచ్చిపుచ్చుకునే విధానంలో రాష్ట్ర విభజన వివాదాలను సత్వరంగా పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీలం సాహ్ని, సోమేశ్‌కుమార్ నిర్ణయించారు. తెలంగాణ సచివాలయంలో బీఆర్‌కేఆర్ భవన్‌లో గురువారం ఏపీ, తెలంగాణ సీఎస్‌లు సమావేశమై విభజన సమస్యలపై సుదీర్ఘ చర్చలు జరిపారు.
పూర్తిగా సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో షెడ్యూల్–9, 10లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల పంపకాలు, విద్యుత్ సంస్థల అప్పులు, ఆస్తుల బట్వాడ, విద్యుత్ బిల్లుల బకాయిల చెల్లంపు, ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలు తదితర అంశాలపై క్షుణ్నంగా చర్చించారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చలను ఇకమీదట కూడా కొనసాగించాలని నిర్ణయించారు.
త్వరలో మరోసారి సమావేశమై చర్చల పురోగతిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, ఏపీ విభజన వ్యవహారాల ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment