విద్యాశాఖ అంటేనే.. జ్వరమొస్తోంది!
దీర్ఘ సెలవులో వెళ్లిన పాఠశాల విద్య డెరైక్టర్ ఉషారాణి
తప్పుకుంటానంటున్న ఇంటర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్
అధికారుల్లో గుబులు పుట్టిస్తున్న ఇరు రాష్ట్రాల వివాదాలు
ఏ నిర్ణయం తీసుకుంటే ఏ మవుతుందోననే ఆందోళన
కీలక నిర్ణయాలకు దూరంగా ఉంటున్న ఉన్నతాధికారులు
వార్షిక పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో ఇదీ దుస్థితి
బెంబేలెత్తుతున్న ఉన్నతాధికారులు కేంద్రానికి వెళ్లే యోచనలో ముఖ్యకార్యదర్శి నీలం సహానీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖలో పనిచేయడానికి ఉన్నతాధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఆ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తు న్న అధికారులు ఏదో ఒక కారణం చూపి అక్కడి నుంచి బయటపడాలన్న భావనలోనే ఉంటున్నా రు. రాష్ట్ర విభజన చట్టం పదో షెడ్యూల్‌లో ఉన్న ఉన్నత విద్యా వ్యవహారాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలు తలెత్తుతుండడంతో అధికారులు ఆయా నిర్ణయాల నుంచి సాధ్యమైనంతమేర దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. తాము ఎందుకు ఇరకాటంలో పడాలని ఆయా శాఖల నుంచి బయటకు వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు.
కేంద్రానికి వెళ్లిపోయే యోచనలో సహానీలు...
ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లాలని భావిస్తున్నారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న నీలం సహానీ.. ఉన్నత విద్యాశాఖ బాధ్యతలు అదనంగా చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యా శాఖ వ్యవహారాలు తరచూ వివాదాలుగా మారుతుండడంతో ఏ నిర్ణయాన్నీ తీసుకోలేకపోతున్నారు. ఇటీవల ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో నీలం సహానీ ఏపీ వాదనను గట్టిగా విని పించారు. ఇంటర్‌మీడియట్ పరీక్షలు, ఎంసెట్ వేర్వేరుగా నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో ఒక దశలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సహానీపై అసహనం వ్యక్తంచేశారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదం అలాగే కొనసాగుతున్న తరుణంలో విద్యాశాఖ బాధ్యతల నుంచి ఎంత త్వరగా తప్పుకుంటే అంత మంచి దన్న అభిప్రాయంతో ఆమె ఉన్నట్లు పేర్కొంటున్నారు. తెలంగాణకు కేటాయించిన ఈమె భర్త అజయ్ సహానీతో పాటు కేంద్ర సర్వీసులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
బయటపడే యోచనలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఉన్న రాంశంకర్‌నాయక్ తనను బాధ్యతల నుంచి తప్పించాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని వేడుకొంటున్నారు. ఇంటర్ బోర్డు వ్యవహారాలు రెండు రాష్ట్రాల మధ్య గందరగోళంగా మారడం, ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు ఉమ్మడిగా ఉన్న పరిస్థితుల్లో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో త్వరగా బయటపడాలని ఆయన భావిస్తున్నా రు. ఐఏఎస్‌ల విభజనలో ఆయన ఏపీకే కేటాయింపయ్యారు. అధికారికంగా ఆ జాబితా అమల్లోకి వస్తే తనకు ఇక్కడి నుంచి మోక్షం కలుగుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
విద్యాశాఖ డెరైక్టర్ సెలవు...
పాఠశాల విద్యాశాఖలోనూ అధికారుల పరిస్థితి ఇలాగే ఉంది. పాఠశాల విద్యాశాఖ డైరక్టర్ ఉషారాణి ఇప్పటికే సెలవుపై వెళ్లారు. ఆరోగ్యం బాగోలేని కారణం చూపి ఆమె ఎక్కువ రోజులు సెలవుపై వెళ్లారు. అయితే.. విద్యాశాఖలో ఉన్నతస్థాయి అధికారుల మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలోనే ఉషారాణి సెలవు పెట్టి వెళ్లినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ బాధ్యతలను కూడా ఇంట ర్ బోర్డు కార్యదర్శి రాంశంకర్‌కే అప్పగించారు.
అంటీముట్టనట్లు ఉంటున్న అధర్‌సిన్హా...
ప్రాధమిక, ఇంటర్ విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న అధర్‌సిన్హా ఇంటర్‌మీడియట్ కమిషనర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్‌ల విభజనలో ఆయన తెలంగాణకు కేటాయింపు అయ్యారు. దీంతో గత కొంత కాలంగా ఆయన ఈ శాఖ తరఫున నిర్ణయాల్లో ఎలాంటి చొరవ చూపడం లేదన్న విమర్శలున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో పనిచేయాల్సి ఉంటుందన్న అభిప్రాయంతోనో ఏమో కానీ ఆయన శాఖ వ్యవహారాల్లో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. వివాదాస్పదంగా ఉన ్న ఇంటర్‌మీడియట్ విషయంలో అయితే మరీ దూరంగా ఉంటున్నారని ఆ శాఖవర్గాలే పేర్కొంటున్నాయి.ఓ పక్క పదో తరగతి, ఇంటర్‌మీడియట్ తదితర పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లు చురుగ్గా సాగాల్సిన తరుణంలో విద్యా శాఖా ఉన్నతాధికారుల వ్యవ హారం చర్చనీయాంశంగా మారుతోంది.