సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్-19 స్థితిగతులపై ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీ రాజ్‌భవన్ నుంచి ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్‌రెడ్డి ఇతర అధికారులతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు ఇతర అధికారుల కృషిని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు. లాక్‌డౌన్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12 నుండి 13 శాతం వరకు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మొదటి ఐదు జిల్లాల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ 5 జిల్లాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా మొబైల్ టెస్టింగ్ వ్యాన్‌ల ద్వారా కరోనా పరీక్షలను ఎక్కువ సంఖ్యలో నిర్వహించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. (చదవండి: ఏపీలో కొత్తగా 4,994 కరోనా కేసులు)
లాక్‌డౌన్ ప్రకటించిన తరువాత పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో రాష్ట్రానికి తరలిరావడమే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడానికి కారణమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ గవర్నర్‌కు వివరించారు. పాజిటివ్ కేసుల పెరుగుదలకు అనుగుణంగా తగిన సంఖ్యలో ఆసుపత్రిలో పడక గదులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు వారాల తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాజిటివ్ కేసుల సంఖ్యను 5 శాతానికి తగ్గించడానికి, మరణాల సంఖ్యను 1 శాతం కంటే తక్కువగా ఉండేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్, ఐసోలేషన్‌లతో పాటు చికిత్స పద్ధతిని అనుసరించి కరోనా ఉధృతిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అని ఆయన తెలిపారు. (చదవండి: గోరంత జాగ్రత్త.. కొండంత రక్ష)
24 గంటల్లో ఫలితం లభించేలా కరోనా పరీక్ష లేబరేటరీల పనితీరును క్రమబద్ధీకరిస్తున్నామన్నారు. ప్రజలు 104 కాల్ సెంటర్‌కు కాల్ చేసి పరీక్ష చేయించుకోవచ్చని, కాల్ సెంటర్ ద్వారా కోవిడ్-19 పాజిటివ్ రోగులు ఆసుపత్రులలో అడ్మిషన్ కూడా పొందవచ్చని జవహర్ రెడ్డి అన్నారు. 15 - 20 నిమిషాల్లో ఫలితాన్ని ఇవ్వగల 3.25 లక్షల రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోందని, పరీక్షలను కూడా రోజుకు 35000 - 40000 వరకు పెంచడానికి కృషి చేస్తున్నామని గవర్నర్‌కు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ప్రభుత్వం ఇప్పుడు తప్పనిసరి చేసిందని ఆయన వెల్లడించారు. ప్రత్యేక కోవిడ్ -19 రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వం 2700 మంది వైద్యులను, పారా మెడికల్ సిబ్బందిని నియమించినట్లు జవహర్ రెడ్డి గవర్నర్‌కు తెలిపారు. (చదవండి: బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులు.. నెలాఖరుకు భర్తీ)
Comments
Please login to add a commentAdd a comment