'ఎంఫాన్'‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌ | YS Jagan Mohan Reddy Review Meeting On Covid 19 Tests In Amaravati | Sakshi
Sakshi News home page

ఎంఫాన్‌ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

Published Mon, May 4 2020 3:10 PM | Last Updated on Mon, May 4 2020 7:29 PM

YS Jagan Mohan Reddy Review Meeting On Covid 19 Tests In Amaravati - Sakshi

సాక్షి అమరావతి: రెడ్‌ జోన్లలో ఉన్న ఆసుపత్రుల్లో కచ్చితమైన మెడికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోవిడ్‌-19 నివారణ చర్యలపై ఆయన సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌లు హజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ రాష్ట్రంలో  కోవిడ్‌-19 పరీక్షలు కొనసాగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా రాష్ట్రంలో ప్రతి పది లక్షల జనాభాకు 2,345 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (కరోనా కట్టడికి సమర్థవంతమైన చర్యలు)

అంతేగాక కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో ప్రతి పది లక్షల జనాభాకు 2,224 మందికి కరోనా వైరస్ ‌(కోవిడ్‌-19) పరీక్షలు నిర్వహించగా తమిళనాడులో ప్రతి మిలియన్‌కు 1929 పరీక్షలు, రాజస్థాన్‌లో ప్రతి మిలియన్‌కు 1402 పరీక్షలు నిర్వహిస్తున్న అధికారుల సీఎం జగన్‌కు వెల్లడించారు. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10, 229 పరీక్షలు నిర్వహించగా ఆదివారం నాటికి మొత్తం 1,25,229 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1092కి చేరినట్లు చెప్పారు. ఇందులో 524 మంది డిశ్చార్జి కాగా 36 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల శాతం 1.32 ఉండగా దేశం మొత్తంలో 3.84 ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 2 శాతం కాగా.. దేశంలో 3.27 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

రాష్ట్రంలో పనిచేస్తున్న ల్యాబ్‌లు 11 ఉన్నాయని, వాటిలో పీరియాడికల్‌గా 3 ల్యాబ్‌ల్లో ఫ్యుమిగేషన్‌ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. 45 కేంద్రాల్లో 3245  ట్రూనాట్‌ మిషన్లు కూడా పని చేస్తున్నట్లు చెప్పారు. గతంలో 245 ఉండవని, మరో వంద పెంచి 11 ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ల్లో 22 మిషిన్లు పనిచేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో కూడా 4 మిషన్లు ఉంచాలన్నది ప్రభుత్వ ప్రయత్నమని, రోజువారి పరీక్షల సామర్థ్యం 6 వేల నుంచి 10 వేల పెరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,292 మందికి కోవిడ్‌-19 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాక కుటుంబ సర్వేలో గుర్తించిన 32,792 మందికి రేపటిలోగా టెస్టులు పూర్తి చేస్తామని అధి​కారులు తెలిపారు. (కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : పువ్వాడ)

టెలి మెడిసిన్‌, వలస కూలీలు, యాత్రికుల అనుమతిపై ఆరా..
టెలి మెడిసిన్‌పై సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెలిమెడిసిన్‌ వ్వవస్థ బలోపేతం కావాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. అంతేగాక కీలకమైన కాల్‌ సెటర్ల నంబర్లను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. దిశ, టెలిమెడిసిన్‌, అవినీతి నిరోధానికి సంబంధించిన ఏసీబీ, వ్యవసాయ తదితర కీలక నంబర్లను ప్రతి గ్రామ వార్డు సచివాలయాలకు అందుబాటులో ఉంచాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. వలస కూలీలు, యాత్రికులు, విద్యార్థుల అంశంపై అధికారులను ప్రశ్నించగా.. వలస కూలీలు, ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయినా యాత్రికులు, విద్యార్థులు, గ్రూపులకు అనుమతి ఇస్తామని మరోమారు స్పష్టం చేశారు. వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకున్న వారిని పరిశీలించి తర్వాత ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇక కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రానికి వచ్చే వాళ్లు ఎక్కడనుంచి వస్తున్నారు, ఆయా రాష్ట్రాల్లో వారు గ్రీన్‌జోన్లో ఉన్నారా? ఆరెంజ్‌ జోన్లో ఉన్నారా? లేక రెడ్‌ జోన్లో ఉన్నారా? అన్న వివరాలు కూడా సేకరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. వీటన్నింటిని నిర్ధారించుకున్న తర్వాతే వలస కూలీలు, చిక్కుకుపోయిన యాత్రికులు, విద్యార్థులకు అనుమతులు మంజూరు చేస్తామన్న అధికారులు స్పష్టం చేశారు. అంతేగాక స్పందన వెబ్‌సైట్‌ ద్వారా మాత్రమే కాకుండా వివిధ మార్గాల ద్వారా  విజ్ఞప్తి చేసుకున్న వారు కూడా ఉన్నారన్న అధికారులు తెలిపారు. ఇక వ్యక్తిగతంగా వచ్చే వారికి అనుమతి లేదన్న అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో క్వారంటైన్‌ విధానం ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల వారీగా సదుపాయాలు ఉండాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. అంతేగాక దీన్ని ఎలా బలోపేతం చేయాలి అన్న దానిపై దృష్టి పెట్టాలని, అలాగే వచ్చే వారికి చేయాల్సిన పరీక్షల విధానంపైకూడా మార్గదర్శకాలు తయారు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం 
‘ఎంఫాన్’‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌ వైపు వస్తే సన్నద్ధంగా ఉండాలని ఆయన అధికారులను హెచ్చరించారు. తుపాను కదలికలను గమనించాలని, దీనిపై విద్యుత్తు, రెవిన్యూ, పౌరసరఫరాలు, వైద్యశాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తుఫాను వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, చేపల వేట నిషేధ సమయమే అయినా బోట్లలో ఏ ఒక్కరూ సముద్రంలోకి వెళ్లకుండా చూసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. తగినంత కార్యచరణతో పాటు అధికారులను కూడా సిద్ధం చేసుకోవాలన్నారు. అంతేగాక తుపానును దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలును కూడా వేగవంతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ధాన్యం సేకరణలో అగ్రెసివ్‌గా ఉండాలని, కల్లాల్లో ఉన్న ధాన్యం వీలైనంతవరకూ కొనుగోలు చేయాలని చెప్పారు. వర్షాల వల్ల దెబ్బతినడానికి అవకాశం ఉన్న పంటల సేకరణలో వేగం పెంచాలన్నారు. (ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం)

ప్రతి పంటలో మూడింట ఒక వంతు పంటను మార్కెట్లో జోక్యం కింద కొనుగోలు చేయడానికి అధికారులు సన్నద్ధం కావాలని సీంఎ జగన్‌ పేర్కొన్నారు. వీటికి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుంటే ధరల్లో కూడా స్థిరీకరణ వస్తుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రావాలంటే.. పండే పంటలో మూడింట ఒక వంతు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు.  వాటిని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి మార్కెట్‌ను ఏర్పాటు చేసుకుని పంపాలన్నారు. ఈ విధానాన్ని వ్యవస్థీకృతం చేసుకుంటేనే ధరల స్థిరీకరణ జరుగుతుందని, పెరిషబుల్‌ గూడ్స్‌ను గతంలో ప్రభుత్వం ఎప్పుడూ కూడా సేకరించలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అది జరిగిందని, గతంలో ఎన్నడూలేని విధంగా కొనుగోలు చేశామని అధికారులు పేర్కొన్నారు. ఇక ధాన్యం కొనుగోలును పెంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement