
అన్నింటా ఆమె
మేము సైతం అంటూ నారీలోకం నడుం బిగిస్తోంది. కొలువు ఏదైనా సరే తాము ఎవరికీ తీసిపోమంటూ అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. స్వయంకృషి.. పట్టుదలతో విజయ పథంలో పయనిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం అన్న సినీకవి మాటలను నిజం చేసి చూపిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో తమకంటూ ఓ ప్రత్యేకతను
సంతరించుకుని పురోగమిస్తున్నారు.
విద్యావనంలో..వికసించిన వాసంతి
వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయంలో వికసించిన విద్యాకుసుమం ఆచార్య టి. వాసంతి. కడప నగరానికి చెందిన ఈమె వైవీయూ మొట్టమొదటి మహిళా ప్రిన్సిపాల్‌గా పనిచేయడంతో పాటు మొట్టమొదటి మహిళా రిజిస్ట్రార్‌గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నగరంలోని సీఎస్‌ఐ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్య, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, ప్రభుత్వ పురుషుల కళాశాలలో డిగ్రీ పూర్తిచేసిన ఈమె అన్నింటా అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చారు.
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాయలంలో పీజీ గణితం పూర్తిచేసిన ఈమె 1990లోనే పీహెచ్‌డీ పట్టాను పొందారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సైతం బోధనా సేవలందించిన ఈమె వైవీయూలో గణితశాస్త్ర విభాగాధిపతిగాను, సీడీసీ డీన్‌తో పాటు పలు కమిటీలకు అధ్యక్షత వహించారు. దీంతో పాట 2010లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే మెరిటోరియస్ టీచర్ అవార్డు పొందారు.
సమాన అవకాశాలు కల్పించాలి..
సమాజంలో మహిళా సాధికారత అవసరం. మహిళలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. మహిళా కూలీలో సైతం ఉన్న వివక్ష వీడాలి. మహిళలు పట్టుదలతో కృషిచేసి అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోవాలి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
- ఆచార్య టి. వాసంతి,
రిజిస్ట్రార్, యోగివేమన విశ్వవిద్యాలయం
అమ్మలా ఆదరిస్తూ....
ఆదర్శం ఐఈఆర్టీ యశోద సేవలు
వేంపల్లె : వేంపల్లె భవిత సెంటర్ (ప్రత్యేక అవసరాల గల కేం ద్రం)లో బుద్ధిమాంద్యం గల పిల్లలను వారి తల్లిదండ్రులు వదిలేసి వెళతారు. అలాంటి వారికి ఈ సెంట ర్‌లో ఐఈఆర్టీ(ఇన్‌ప్యూటివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్)గా పనిచేస్తున్న యశోద సేవలందిస్తోంది.
భర్త సహకారంతోనే సేవలు
ఐఈఆర్టీగా పనిచేస్తున్న యశోదకు 5 ఏళ్ల వయస్సులోనే పోలియో వచ్చింది. వేంపల్లె భవిత సెంటర్‌కు వారు ఉన్న నివాస ప్రాంతానికి దాదాపు ఒకటిన్నర్ర కిలోమీటరు దూరం ఉంది. ప్రతిరోజు ఆమె భర్త రమేష్ మోటారు బైకుపై ఎక్కించుకొని వదిలిపెట్టడం జరుగుతోంది. భర్త రమేష్ సహకారంతోనే ప్రత్యేక అవసరాల గల పిల్లలకు సేవలు చేస్తున్నానని ఆమె తెలిపారు. వివిధ రకాల బొమ్మలతో పిల్లలకు అవగాహన కల్పించడం.. నెంబరింగ్, రైమ్స్, రంగులు వేయడం.. వివిధ రకాల బొమ్మలతో ఆటలు ఆడిపించడం.. మధ్యాహ్న భోజన సమయంలోఅక్కడే ఉండి పిల్లలకు తినిపించడం.. విద్యార్థులు శుభ్రంగా ఉండటానికి తాము పడే పాట్లు అన్నీ ఇన్నీ కావని యశోద అంటోంది. ఈమె సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.