అంతరిక్షంలోని అంగారక గ్రహం... హిమాలయాలలోని ఎవరెస్ట్ శిఖరం... పసిఫిక్ మహా సముద్రంలోని అట్టడగు పొరలు... కావేవీ మహిళాభ్యుదయానికి అవరోధం... అని చేతల్లో నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కొండకచో.. మేం మాత్రమే సాధించగలం... మేము కాక ఇంకెవరు సాధించగలరు?.. అంటూ ఛాలెంజింగ్‌గా ముందుకు కదిలివస్తున్న మహిళా సాహసికులు నేడు మునుముందుకు దూసుకువస్తున్నారు. మరో పక్క భ్రూణ హత్యలు... ప్రేమ పేరుతో యాసిడ్ దాడులు... ‘నిర్భయ’ంగా కొనసాగుతున్న లైంగిక దాడులు.. సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పాలకవర్గాలు మహిళా సాధికారత, మహిళా రిజర్వేషన్లు అంటూ ఊకదంపుడు మానేసి మహిళాభ్యున్నతికి స్పష్టమైన హామీ కావాలని మహిళా దినోత్సవం ప్రశ్నిస్తోంది. మహిళా వివక్ష రద్దు కావాలని, మహిళాభ్యున్నతికి ఆకాశమే హద్దు కావాలి. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆనందంతో మహిళా ఉద్యోగులు, ఉద్యమకారులు, మేధావులు సిద్ధమయ్యారు.