చింతా ‘పోర్టు’ రాజకీయం | worry 'port' politics | Sakshi
Sakshi News home page

చింతా ‘పోర్టు’ రాజకీయం

Published Wed, Mar 12 2014 3:57 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

worry 'port' politics

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  ‘‘దుగ్గరాజపట్నం చూడ రో. ఓడరేవు చూడరో’’ అంటూ కొన్ని నెలలుగా ప్రచారం చేయించిన తిరుపతి ఎంపీ డాక్టర్ చింతామోహన్ ఇప్పుడు పోర్టు కావాలంటే చేతికే ఓటేయాలనే నినాదంతో ఎన్నికల రాజకీయానికి తెరలేపారు. వెయ్యి రాకెట్లు అడ్డొచ్చినా పోర్టు నిర్మాణాన్ని ఆపలేవని చెప్పిన ఆయన ఈసారి తనను గెలిపిస్తే పోర్టు తెప్పించి తీరుతానని జనానికి ఎర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన బుధవారం  వాకాడు మండలం దుగరాజపట్నం ప్రాంతానికి కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను రప్పించే ఏర్పాట్లు చేశారు.
 
  దేశంలో నిర్మించనున్న రెండు అతిపెద్ద నౌకాశ్రయాల్లో ఒకదానిని నెల్లూరు జిల్లా దుగరాజపట్నంకు మంజూరు చేయించడానికిఎంపీ చింతామోహన్ ప్రయత్నించారు. నౌకాశ్రయం వస్తే నెల్లూరు నుంచి తిరుపతి దాకా భారీ అభివృద్ధి జరుగుతుందనే నినాదంతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. నౌకాశ్రయం వల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగి జనం కోటీశ్వరులవుతారని అరచేతిలో వైకుంఠం చూపించే రాజకీయం నెరిపారు.


నౌకాశ్రయం ప్రతిపాదిత ప్రాంతం పులికాట్ పక్షుల సంరక్షణ ప్రాంతంగా ఉండటంతో వన్యప్రాణి సంరక్షణ విభాగం, శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రానికి సమీపంలోనే ఉండటంతో షార్ అధికారులు అభ్యంతరం పెట్టారు. పులికాట్ సరస్సులోని 10 కిలోమీటర్ల ప్రాంతం పక్షుల రక్షిత ప్రాంతంగా ఉండటం వల్ల నౌకాశ్రయం నిర్మాణానికి చట్టం అంగీకరించదని అధికారులు తేల్చారు. రాకెట్ ప్రయోగాలకు భద్రతా కారణాల రీత్యా ఇక్కడ పోర్టు నిర్మాణం మంచిది కాదని షార్ అధికారులు కేంద్రప్రభుత్వానికి వారు లేఖ రాశారు. రాష్ర్టప్రభుత్వం సైతం దుగరాజపట్నంలో కాకుండా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
 
 ఓడరేవు నిర్మాణ ప్రాంతం మార్పు
 దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణానికి చట్టపరంగా అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఇక్కడ వేలాది ఎకరాల భూములు కొనుగోలు చేసిన వ్యాపారులు, రాజకీయ నేతలు ఓడరేవు నిర్మాణ ప్రాంతాన్ని మార్చడానికి స్కెచ్ వేశారు. ఆరు నూరైనా దుగరాజపట్నంలోనే పోర్టు నిర్మించేలా చేస్తానని చెబుతూ వచ్చిన చింతా మోహన్ ఓడరేవు నిర్మాణాన్ని దుగరాజపట్నంలో కాకుండా ఇక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉన్న తూపిలిపాలెంకు మార్చడానికి ప్రతిపాదించారు.
 
 ఈ మేరకు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితుడైన ఒక పత్రికాధిపతిని సైతం ఆయన రంగంలోకి దించినట్లు ఆరోపణలు వున్నాయి. పత్రికాధిపతికి బినామీ పేర్ల మీద వందలాది ఎకరాల భూములను కొనుగోలు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామం తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తూపిలిపాలెంలో పోర్టు నిర్మాణానికి అభ్యంతరం చెప్పకుండా వ్యవహరించిందనే ప్రచారం ఉంది.  కేంద్ర పర్యావరణ చట్టాన్నే సవరించి పులికాట్ సరస్సులో పక్షుల సంరక్షిత ప్రాంతాన్ని 10 నుంచి 2 కిలోమీటర్లకు తగ్గిస్తూ కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్ విడుదల చేసింది.
 
 అభివృద్ధి చాటున జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కేంద్రప్రభుత్వం ఈ గెజిట్‌ను విడుదల చేయడం పర్యావరణ, జంతుప్రేమికులకు విస్మయం కలిగించింది. ఇంతే కాకుండా తమకు గల అధికార బలంతో శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం ఉన్నతాధికారులను కూడా నోరెత్తకుండా చేయగలిగారు. ఈ పరిణామం తర్వాత దుగరాజపట్నం, తూపిలిపాలెం, వాకాడు, కోట, సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లో భూముల ధరలకు మరింత రెక్కలు వచ్చాయి. వివిధ ప్రాంతాలకు చెందిన రాజకీయ నేతలు, సినిమా రంగానికి చెందిన వారు, వ్యాపారవేత్తలు ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు.
 
 హడావుడి శంకుస్థాపనకు ఒత్తిడి
 కేంద్ర ప్రభుత్వంలో పలుకుబడి వున్న ఎంపీ చింతామోహన్ తూపిలిపాలెం వద్ద పోర్టు నిర్మాణానికి ఏదో ఒకరకంగా శంకుస్థాపన చేయించడానికి గత నెలలో హడావుడి చేశారు. పోర్టు నిర్మాణం బాధ్యతలు చూస్తున్న విశాఖపట్నం పోర్టు అధికారులు, భూసేకరణ చేయాల్సిన జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు, అనుమతులు మంజూరుచేయాల్సిన అటవీ అధికారులను తూపిలిపాలెంకు రప్పించారు. ఫిబ్రవరి 28 లేదా మార్చి 3వ తేదీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ వచ్చి పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అధికారులతో సైతం హడావుడి చేయించారు.
 
 పధాని చేతుల మీదుగా పోర్టు నిర్మాణానికి పునాది రాయి వేయిస్తే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందని కేంద్ర ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సమయం ముంచుకొస్తుండటంతో గత నెల 28వ తేదీ నాటికి ప్రధాని తూపిలిపాలెం రావడం కుదరదని ప్రధాని కార్యాలయం తేల్చిచెప్పింది. ఈ లోపే ఎన్నికల షెడ్యూల్ రావటంతో శంకుస్థాపనకు అవకాశం లేకుండా పోయింది. ఈ విషయం పక్కకు పెట్టి చింతామోహన్ అధికారులు భూసేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించలేక పోయామనే వాదన అందుకున్నారు.
 
 ఎన్నికల ఎత్తు
 తనను మళ్లీ ఎంపీగా గెలిపిస్తేనే తూపిలిపాలెం వద్ద పోర్టు నిర్మాణం సాధ్యమవుతుందనే నినాదంతో ఎంపీ డాక్టర్ చింతామోహన్ జనానికి ఎర వేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయన గత నాలుగైదు రోజులుగా గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో తిరుగుతూ అభివృద్ధి కోసం తనను గెలిపించాలని చెబుతున్నారు. ఇందులో భాగంగానే  కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ను రప్పించి ఆయన ద్వారా ఇదే విషయం చెప్పించే రాజకీయానికి తెర లేపబోతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement