శారదాపీఠంలో పలు పూజా కార్యక్రమాలు
చెరకు రైతుల తరఫున పోరాటానికి హామీ
అభిమానులు, పార్టీశ్రేణుల ఘనస్వాగం
సంప్రదాయబద్ధంగా సాగిన పర్యటన
విశాఖపట్నం: హైందవ సంప్రదాయానుసారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. సంప్రదాయ వస్త్రధారణతో లోకకల్యాణం కాంక్షిస్తూ విశాఖ శారదా పీఠంలో పూజలు.. తుమ్మపాల చెరకు రైతుల వ్యథపై స్పందన.. వారికి అండగా ఉంటామని భరోసా.. పార్టీ నేతలు, అభిమానుల నివాసాలకు వెళ్లి ఆత్మీయ పలకరింపులు.. ఆశీర్వచనాలు.. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఆద్యంతం కోలాహలంగా సాగింది. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం నగరానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో కలసి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, కరణం ధర్మశ్రీ, కర్రి సీతారాం, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, వంశీకృష్ణ, అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్‌లతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు.
శారదా పీఠంలో ప్రత్యేక పూజలు
విశాఖ శారదా పీఠం చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంగళవాయిద్యాలతో పీఠంలోకి తీసుకువెళ్లారు. సంప్రదాయ వస్త్రాలను ధరించిన అనంతరం వై.ఎస్.జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం స్వామీజీతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై పలు ధార్మిక అంశాలపై చర్చించారు. పీఠంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పీఠంలోని సుబ్రహ్మణ్యస్వామి, శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్న యాగశాలను సందర్శించారు. శారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్కబల్లలతో నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ శారదామాత ఆలయ శిఖరం వద్దకు చేరుకున్నారు. శిఖరానికి పవిత్ర పూలతో పూజలు చేశారు. పీఠంలో మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. కపిల గోవుకు పూజలు చేశారు.
చెరకు రైతులకు భరోసా
రాష్ట్రంలో సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను తమ సన్నిహితులకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను తిప్పికొడతామని వై.ఎస్.జగన్ భరోసా ఇచ్చారు. విమానాశ్రయం వద్ద తుమ్మపాల చెరకు రైతులు వై.ఎస్.జగన్‌ను కలుసుకున్నారు. తమ్ముపాల కార్మాగారంతోపాటు ఇతర చక్కెర కర్మాగారాలను కేంద్రమంత్రి సుజనా చౌదరికి కట్టబెట్టాలని సీఎం చంద్రబాబు కుట్రపన్నారని వారు వివరించారు. దీనిపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వ కుట్రపై తాను, పార్టీ.. రైతులకు అండగా ఉంటామని, పోరాడతామని హామీ ఇచ్చారు.
నూతన జంటలకు ఆశీర్వాదం - వంశీకృష్ణ నివాసంలో అల్పాహార విందు
నగర పర్యటన సందర్భంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలు, అభిమానుల నివాసాలకు వెళ్లి వారిని ఆనందడోలికల్లో ముంచెత్తారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌లతో కలసి వై.ఎస్.జగన్ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన మంత్రి రాజశేఖర్ కుమార్తె, అల్లుడు మౌనిక, శివకల్యాణ్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం శివాజీపాలెంలోని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ నివాసంలో అల్పాహార విందుకు వై.ఎస్.జగన్ హాజరయ్యారు. వంశీకృష్ణ తూర్పు నియోజకవర్గ పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెందుర్తిలోని జిల్లా పార్టీ కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన రామునాయుడు కుమార్తె, అల్లుడు మాధవి, నీరజ్ కుమార్ దంపతులను ఆశీర్వదించారు. పర్యటన ఆద్యంతం అభిమానుల కోలాహలం మధ్య సందడిగా సాగింది.
వై.ఎస్.జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం ఇన్‌చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫారూకీ, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షరీఫ్, నగర అధికార ప్రతినిధి అల్ఫా కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బుల్లిబాబు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనకల్యాణానికి వైఎస్ జగన్ పూజలు
Published Thu, Feb 18 2016 11:28 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement