Saradapitham
-
శ్రీశారదా పీఠంలో అరుణ పారాయణ
సాక్షి, అమరావతి/పెందుర్తి: విశాఖ శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన మంగళవారం పీఠంలో రథసప్తమి వేడుకలు జరిగాయి. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వేదపండితులు ఆదిత్య భగవానుడిని ప్రార్థిస్తూ త్రిచ విధానంలో సూర్యనమస్కారాలు చేశారు. అరుణ పారాయణ జరిగింది. పీఠంలోని 18 అడుగుల దాసాంజనేయస్వామికి ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతుల మీదుగా విశేష అభిషేకాలు జరిపారు. దేశ రక్షణ కోసం చేపట్టిన రాజశ్యామల యాగం కొనసాగింది. వనదుర్గ హోమం, మన్యసూక్త హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, దేవదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి వాణిమోహన్, ఎమ్మెల్యేలు అదీప్‌రాజ్, శిల్ప రవికిశోర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. నేడు పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొననున్న సీఎం జగన్ శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో సీఎం వైఎస్ జగన్ బుధవారం పాల్గొంటారు. ఉదయం 10.15కు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు బయలుదేరుతారు. 11 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 11.30కు శారదా పీఠంకు చేరుకుంటారు. అక్కడ జరిగే వార్షికోత్సవాల్లో పాల్గొని మధ్యాహ్నం 1.25కు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి తిరుగుపయనమవుతారు. పీఠం వార్షికోత్సవాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననుండటం వరుసగా ఇది మూడోసారి. -
పిడికెడు మెతుకులు...గుప్పెడు అక్షరాలు.
మానవ సేవ కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే. సాటి మానవునికి చేతనైన సేవ చేయడం దివ్యత్వానికి చేరువ కావడమే. గుంటూరులోని శారదా పీఠం చేస్తున్న సేవ చాలామంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వారిలో సంచారజాతి బాలలు ఉన్నారు. నిమ్నవర్గాల స్త్రీలు ఉన్నారు. విద్య, వృత్తివిద్య అందిస్తూ ఇక్కడ సాగుతున్న సేవ ప్రశంసనీయమైనది. గుంటూరు నగరంపాలెంలోని విశాలమైన జిల్లాపరిషత్ ప్రాంగణంలో ప్రశాంతంగా కనిపించే ‘శారదాపీఠం’లో సాగుతున్న మానవసేవ ప్రశంసనీయమైనది. సంచారజాతుల పిల్లలను చేరదీసి, వారికి విద్యాబుద్ధులు చెప్పడం ఒక పని. పేదబాలికలకు స్కూల్ నడపడం మరో పని. పేద వర్గాల మహిళలకు, యువతులకు స్వయంసమృద్ధి కోసం వృత్తి విద్యలు నేర్పడం మరో పని. ఇన్ని పనులు శారదామఠం కార్యదర్శి భవానీ ప్రాణ మాతాజీ ఆధ్వార్యంలో దాదాపు 15 ఇరవై మంది మాతాజీలు క్రమశిక్షణతో, చిత్తశుద్ధితో, అంకితభావంతో, ఆధ్యాత్మికసేవగా ఎంచి చేస్తున్నారు. శ్రీశారదామఠం అంటే? సంపూర్ణ సాధికార ఆధ్యాత్మిక సంస్థ ఒకటి స్త్రీలకు స్థాపించాలి అన్న స్వామి వివేకానంద స్వప్నానికి రూపమే శ్రీ శారదామఠం. కలకత్తాలోని దక్షిణేశ్వరం ముఖ్యకేంద్రంగా దేశ విదేశాల్లో 40 ఉపసంస్థలతో జాతి, కులమతాలకు అతీతంగా ఈ మఠం సేవలందిస్తోంది. శ్రీరామకృష్ణ పరమహంస ధర్మపత్ని శారదామాత జయంతి సందర్భంగా 1954లో దక్షిణేశ్వరంలో స్థాపించబడిన ఈ సంస్థ బాలిక, యువతి, స్త్రీ అభ్యున్నతికి విశేష సేవలందిస్తుంన్నది. రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం గుంటూరులోనే శ్రీశారదామఠం ఉంది. 2001లో నెలకొల్పిన ఈ మఠం గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా పని చేస్తోంది. శ్రీరామకృష్ణ శారదా విద్యాలయం ఈ మఠం ఆధ్వర్యంలో నడుస్తున్న స్కూల్ ఇది. విశాలమైన ప్రాంగణంలో 350 మంది పేద, మధ్యతరగతి విద్యార్థినులకు విలువలతో కూడిన విద్య అందిస్తున్నారు. వీరిలో 150 మంది విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, భోజన వసతితో సహా ఉచిత విద్యను అందిస్తున్నారు. మిగిలిన వారివద్ద నామమాత్రపు ఫీజులే వసూలు చేస్తున్నారు. పాఠశాలను పూర్తిస్థాయి ఉచిత విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చే స్తున్నారు. వివేకా విహార్ ఇది వీధి బాలల కోసం, సంచార తెగల బాలల కోసం ప్రత్యేకంగా నిర్వహించే స్కూల్. గతంలో మఠ ప్రాంగణం చుట్టుపక్కల సంచార కుటుంబాలు చెట్ల కింద నివసించేవారు. తోలుబొమ్మలాట కళాకారులైన వీరు అనంతర కాలంలో ఆ కళకు ఆదరణ తగ్గడంతో ఆర్థికంగా, సామాజికంగా వెనుకపడ్డారు. యాచకవృత్తి, చెత్త సేకరించి విక్రయించుకోవడం తదితర పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వారి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడానికి మఠంలోని మాతాజీలు ఎంత ప్రయత్నించినా వారి తల్లిదండ్రులు సహకరించలేదు. చివరకు పెద్దలకు నచ్చచెప్పి వారి పిల్లలకు మఠంలో వివేకా విహార్ అనియత విద్యాకేంద్రం ప్రారంభించారు. వివిధ వయస్సుల్లో ఉన్న 30 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడంతోపాటు వారికి చదువుతోపాటు వ్యక్తిత్వ వికాస æశిక్షణ ఇచ్చారు. మఠంలోని పిల్లలు 5వ తరగతి పూర్తి చేసిన అనంతరం ఉన్నత చదువులకోసం విజయవాడ, గుంటూరులోని పలు కార్పోరేట్ పాఠశాలలను సంప్రదించి అక్కడ ఉచితంగా విద్య అభ్యసించేలా చేర్పించారు. ఇది కాకుండా ‘శిశు వికాస్’ పేరుతో పాఠశాల అనంతరం పేద విద్యార్దినీ విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్, యోగాసనాలు, సంగీతం, నృత్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. నివేదిత వృత్తి విద్యా కేంద్రం మహిళలలో ఆర్థికస్వాలంబన తీసుకువచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే ధ్యేయంగా వృత్తివిద్యాకేంద్రం పనిచేస్తోంది. ఈ కేంద్రం ద్వారా రోజుకు 200 మంది మహిళలు, యువతులకు ఎంబ్రాయిడరి, రంగుల అద్దకం, బ్యాగుల తయారి, కంప్యూటర్లలో బ్యాచ్‌ల వారీగా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పేదమహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించడంతోపాటు శిక్షణ పూర్తయిన వారికి పలు సంస్థలను సంప్రదించి ఉద్యోగాల కల్పనలోనూ కీలకపాత్ర పోషిస్తున్నది శారదామఠం. ఇక ప్రతిరోజూ మఠంలోని మందిరంలో పూజలు, భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఆదివారాల్లో ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనాలు మఠకార్యక్రమాల్లో ఒక భాగం. – కోలుకొండ శ్రీకర్, సాక్షి, గుంటూరు ఈస్ట్ ఫోటోలు: మిరియాల వీరాంజనేయులు ►తోలుబొమ్మలాట కళాకారుల కుటుంబానికి చెందిన మేము ఆ కళకు ఆదరణ లేకపోవడంతో సోఫాలు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నాము. మఠ మాతాజీ 6 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి మా పిల్లలకు చదువు చెప్పించమని చెప్పడంతో మా ఇద్దరు పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్చాము. నెలకు ఒకసారి పాఠశాలకు వచ్చి పిల్లల్ని చూసుకుని వెళతాము. ఈ పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన మా అబ్బాయిని విజయవాడలోని హీల్ సంస్థలో పై చదువులు చదివిస్తున్నాం. మా పిల్లల భవిష్యత్తుకు మంచి మార్గం చూపిన మాతాజీలకు జీవితాంతం రుణపడి ఉంటాం. – వనపర్తి బాలాజి, మీనాక్షి దంపతులు, నరసరావుపేట మండలం, ఎక్కల వారిపాలెం ►2008 సంవత్సరంలో మఠంలో కుట్టు, ఎంబ్రాయిడరి, బ్యాగులు తయారి శిక్షణ పొందాను. కొన్ని సంవత్సరాలుగా నేను ఇంటివద్ద మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తూ షాపు నిర్వహిస్తున్నాను. గతంలో కూలి పనులకు వెళ్ళే నేను, నా భర్త ఈ ఆదాయం కారణంగా పిల్లలు ఇద్దర్ని మంచి కళాశాలలో ఉన్నత చదువులు చదివిస్తున్నాం. – టి.పరమగీత, గుంటూరు రూరల్ మండలం, దాసరిపాలెం ►ప్రపంచంలో ఎవరూ పరాయివారు కారు. అందరు నీవారే అన్న దివ్యజనని శ్రీ శారదాదే బోధనల స్ఫూర్తితో మఠాన్ని నిర్వహిస్తున్నాము. ఈ భావం అందరిలో వ్యాప్తి కావాలన్నదేమా ఆకాంక్ష. ఇందుకోసం అంకితభావంతో పని చేస్తున్నాము. – భవాని ప్రాణ మాతాజీ, మఠ కార్యదర్శి -
మహాకుంభాభిషేకంలో వైఎస్ జగన్
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలకు హాజరు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: లోకకల్యాణార్థం విశాఖ శ్రీశారదా పీఠం నిర్వహించిన మహాకుంభాభిషేకంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానదేంద్ర సరస్వతితో కలసి పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ నెల14న ప్రారంభమైన శ్రీశారదా పీఠం వార్షికోత్స ముగింపు వేడుకలు గురువారం నిర్వహించారు. గత ఏడాది కూడా శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరైన జగన్ ఈ ఏడాది పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం విశాఖ శివారు చినముషిడివాడలోని శారదాపీఠం చేరుకున్న జగన్‌కు వేదపండితులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలతో ఆయన్ను పీఠం లోపలికి తోడ్కొని వెళ్లారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన అనంతరం జగన్ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతితో ఆయన పలు అంశాలపై ప్రత్యేకంగా దాదాపు గంటసేపు చర్చించారు. పీఠంలో ప్రత్యేక పూజలు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలసి పీఠంలోని సుబ్రహ్మణ్యస్వామి, శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి, మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. పవిత్ర పూజాసామాగ్రిని తాకి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. పీఠంలోని శారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
జనకల్యాణానికి వైఎస్ జగన్ పూజలు
శారదాపీఠంలో పలు పూజా కార్యక్రమాలు చెరకు రైతుల తరఫున పోరాటానికి హామీ అభిమానులు, పార్టీశ్రేణుల ఘనస్వాగం సంప్రదాయబద్ధంగా సాగిన పర్యటన విశాఖపట్నం: హైందవ సంప్రదాయానుసారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. సంప్రదాయ వస్త్రధారణతో లోకకల్యాణం కాంక్షిస్తూ విశాఖ శారదా పీఠంలో పూజలు.. తుమ్మపాల చెరకు రైతుల వ్యథపై స్పందన.. వారికి అండగా ఉంటామని భరోసా.. పార్టీ నేతలు, అభిమానుల నివాసాలకు వెళ్లి ఆత్మీయ పలకరింపులు.. ఆశీర్వచనాలు.. ఇలా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఆద్యంతం కోలాహలంగా సాగింది. విశాఖ శారదా పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం నగరానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో కలసి వచ్చిన ఆయనకు విమానాశ్రయంలో పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయ్‌కుమార్, మళ్ల విజయ్ ప్రసాద్, కరణం ధర్మశ్రీ, కర్రి సీతారాం, సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, వంశీకృష్ణ, అదీప్‌రాజ్, ప్రగడ నాగేశ్వరరావు, పెట్ల ఉమాశంకర్ గణేష్‌లతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు సాదర స్వాగతం పలికారు. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు విశాఖ శారదా పీఠం చేరుకున్న జగన్మోహన్రెడ్డికి వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంగళవాయిద్యాలతో పీఠంలోకి తీసుకువెళ్లారు. సంప్రదాయ వస్త్రాలను ధరించిన అనంతరం వై.ఎస్.జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం స్వామీజీతో దాదాపు గంటపాటు ఏకాంతంగా సమావేశమై పలు ధార్మిక అంశాలపై చర్చించారు. పీఠంలో నిర్వహిస్తున్న మహాకుంభాభిషేకం, ఇతర పూజా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. పీఠంలోని సుబ్రహ్మణ్యస్వామి, శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం నిర్వహిస్తున్న యాగశాలను సందర్శించారు. శారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెక్కబల్లలతో నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ శారదామాత ఆలయ శిఖరం వద్దకు చేరుకున్నారు. శిఖరానికి పవిత్ర పూలతో పూజలు చేశారు. పీఠంలో మహాపూర్ణాహుతిలో పాల్గొన్నారు. కపిల గోవుకు పూజలు చేశారు. చెరకు రైతులకు భరోసా రాష్ట్రంలో సహకార రంగంలో చక్కెర కర్మాగారాలను తమ సన్నిహితులకు కట్టబెట్టాలన్న చంద్రబాబు కుట్రను తిప్పికొడతామని వై.ఎస్.జగన్ భరోసా ఇచ్చారు. విమానాశ్రయం వద్ద తుమ్మపాల చెరకు రైతులు వై.ఎస్.జగన్‌ను కలుసుకున్నారు. తమ్ముపాల కార్మాగారంతోపాటు ఇతర చక్కెర కర్మాగారాలను కేంద్రమంత్రి సుజనా చౌదరికి కట్టబెట్టాలని సీఎం చంద్రబాబు కుట్రపన్నారని వారు వివరించారు. దీనిపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వ కుట్రపై తాను, పార్టీ.. రైతులకు అండగా ఉంటామని, పోరాడతామని హామీ ఇచ్చారు. నూతన జంటలకు ఆశీర్వాదం - వంశీకృష్ణ నివాసంలో అల్పాహార విందు నగర పర్యటన సందర్భంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలు, అభిమానుల నివాసాలకు వెళ్లి వారిని ఆనందడోలికల్లో ముంచెత్తారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్లతో కలసి వై.ఎస్.జగన్ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన మంత్రి రాజశేఖర్ కుమార్తె, అల్లుడు మౌనిక, శివకల్యాణ్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం శివాజీపాలెంలోని తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ నివాసంలో అల్పాహార విందుకు వై.ఎస్.జగన్ హాజరయ్యారు. వంశీకృష్ణ తూర్పు నియోజకవర్గ పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పెందుర్తిలోని జిల్లా పార్టీ కార్యదర్శి గొర్లె రామునాయుడు నివాసానికి వెళ్లారు. ఇటీవల వివాహమైన రామునాయుడు కుమార్తె, అల్లుడు మాధవి, నీరజ్ కుమార్ దంపతులను ఆశీర్వదించారు. పర్యటన ఆద్యంతం అభిమానుల కోలాహలం మధ్య సందడిగా సాగింది. వై.ఎస్.జగన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, ఉత్తరాంధ్ర మహిళా విభాగం ఇన్చార్జ్ వరుదు కల్యాణి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫారూకీ, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షరీఫ్, నగర అధికార ప్రతినిధి అల్ఫా కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి బుల్లిబాబు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.