మహాకుంభాభిషేకంలో వైఎస్ జగన్
విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలకు హాజరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: లోకకల్యాణార్థం విశాఖ శ్రీశారదా పీఠం నిర్వహించిన మహాకుంభాభిషేకంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ వస్త్రధారణతో జగన్ పీఠాధిపతి శ్రీ స్వరూపానదేంద్ర సరస్వతితో కలసి పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ నెల14న ప్రారంభమైన శ్రీశారదా పీఠం వార్షికోత్స ముగింపు వేడుకలు గురువారం నిర్వహించారు.
గత ఏడాది కూడా శారదా పీఠం వార్షికోత్సవాలకు హాజరైన జగన్ ఈ ఏడాది పీఠం వార్షికోత్సవ ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం విశాఖ శివారు చినముషిడివాడలోని శారదాపీఠం చేరుకున్న జగన్‌కు వేదపండితులు సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంగళవాయిద్యాలతో ఆయన్ను పీఠం లోపలికి తోడ్కొని వెళ్లారు. సంప్రదాయ వస్త్రాలు ధరించిన అనంతరం జగన్ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలుసుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతితో ఆయన పలు అంశాలపై ప్రత్యేకంగా దాదాపు గంటసేపు చర్చించారు.
పీఠంలో ప్రత్యేక పూజలు
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలసి పీఠంలోని సుబ్రహ్మణ్యస్వామి, శారదామాత, ఆదిశంకరాచార్యులు, దాసాంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి, మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. పవిత్ర పూజాసామాగ్రిని తాకి వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. పీఠంలోని శారదా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.