కడప ట్రెజరీలో క్షుద్ర పూజలు
కడప సెవెన్‌రోడ్స్ : కడప కలెక్టరేట్ ఆవరణంలోని జిల్లా ట్రెజరీ కార్యాలయంలో క్షుద్ర పూజలు నిర్వహించారన్న విషయం కలకలం సృష్టిటించింది. అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న నాగరాజు మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన కార్యాలయానికి వచ్చారు. తన కుర్చీ వద్ద నిమ్మకాయలు, కుంకుమ, ఎండు మిరపకాయతో పూజలు నిర్వహించి ఉండటాన్ని గమనించి విషయాన్ని డిప్యూటీ డెరైక్టర్ రంగప్ప దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారితో ఈ సంఘటనపై విచారణ చేయిస్తానని, స్టాఫ్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని ఆయన చెప్పారు.
అసిస్టెంట్ డెరైక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. తానంటే గిట్టని సిబ్బంది ఎవరో క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. పది రోజుల కిందట కూడ నల్ల జిలకర మంత్రించి తన కుర్చీ వద్ద చల్లారని తెలిపారు. బద్వేలు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఓ ఉద్యోగి రూ.26 లక్షలు స్వాహా చేయడంపై తాను విచారణ నిర్వహించానని, విధులకు సక్రమంగా హాజరు కాని సిబ్బందిని మందలించాల్సి వచ్చేదన్నారు. వారంతా ఏకమై తనను భయపెట్టి బదిలీపై వెళ్లేలా చేసేందుకే ఇలా క్షుద్ర పూజలు నిర్వహించారని వివరించారు.
కాగా, కార్యాలయ తాళాలు అసిస్టెంట్ డెరైక్టర్ వద్దే ఉంటాయని, ఆయనకు తెలియకుండా మరొకరు కార్యాలయంలోకి వచ్చి క్షుద్ర పూజలు ఎలా నిర్వహిస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆయన తన కుర్చీ వద్ద కాళీమాత ఫొటో ఉంచుకుని నిత్యం పూజలు నిర్వహిస్తుంటారని, ఉద్యోగులను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో ఆయనే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఉద్యోగులు పరస్పర ఫిర్యాదులు, విమర్శలు, ప్రతి విమర్శలు పాతపడిపోవడంతో క్షుద్ర పూజలతో బజారుకెక్కారు.