● ఎయిర్‌పోర్టు సీఐ చక్రధరరావు
గోపాలపట్నం: విమాన్‌నగర్‌లో క్షుద్ర పూజలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఎయిర్‌పోర్టు సీఐ చక్రధరరావు స్పష్టం చేశారు. స్థానికంగా నివసిస్తున్న బోర రాజేష్ 10 రోజులుగా పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నాడన్న ఆరోపణతో గురువారం రాత్రి స్థానికులు అతనిపై దాడులు చేశారు. అతని ఇంటి అద్దాలు పగలగొట్టారు.
దీన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు రాజేష్ ఇంటిని తనిఖీ చేశారు. ఎక్కడా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. ఎవరో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఇక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సీఐ తెలిపారు.
అయితే స్థానికులు మాట్లాడుతూ రాజేష్ 10 రోజులుగా అర్ధరాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ పూజలు చేస్తున్నాడని, అడిగితే తాను అమ్మవారికి పూజలు చేసుకుంటున్నానని చెబుతున్నాడని భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాజేష్ మాట్లాడుతూ తన అన్న బోర అప్పరావురెడ్డి ఓ రోడ్డు వివాదంలో తనపై కక్ష పెట్టుకుని ఈ విధంగా దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment