గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది.
తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు, హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు, అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది.
గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయట పడటంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారు. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృ దేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబునాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment