devineni umamaheswar rao
-
కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు!
గుంటుపల్లి (ఇబ్రహీంపట్నం): ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి కృష్ణానది ఒడ్డున అర్ధరాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. మూడు రోజులుగా గ్రామంలోని కృష్ణానది ఒడ్డున ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన స్థలంలో పూజలు జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు రహస్యంగా పూజల్లో పాల్గొనడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పూజలకు ఆయన తన కారులో కాకుండా వేరే కారులో వెళ్లడం పలు అనుమానాలకు దారితీసింది. తాంత్రిక పూజలు తెలిసిన వ్యక్తులు, పూజారులు, హిజ్రాలతో పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఏ కార్యక్రమం చేసినా ప్రచారం కోరుకునే ఉమా పార్టీ నాయకులు, అధికారులతో పాటు ఎవరికీ తెలియకుండా అర్ధరాత్రి రహస్య పూజలు చేయడం అనుమానాలకు బలం చేకూర్చింది. పూజల అనంతరం గొల్లపూడి సమీపంలో కృష్ణానది మధ్యన లంక ప్రదేశంలో ఉన్న ఆలయంలో కూడా పూజలు చేసినట్లు తెలిసింది. గతంలో కూడా ఇటువంటి తాంత్రిక పూజలు వివిధ ప్రాంతాల్లో ఉమా చేయించారని చెబుతున్నారు. పూజల వ్యవహారం బయట పడటంతో చివరి రోజు పార్టీ నాయకులను భోజనాలకు ఆహ్వానించారు. టీడీపీ నాయకుడి కుమారుడి వివాహం సందర్భంగా శాంతి పూజలని, పితృ దేవతలకు పిండ ప్రదానమని, చంద్రబాబునాయుడు ఆరోగ్యం కోసమని పొంతన లేని సమాధానాలు చెబుతుండటం గమనార్హం. -
‘ఇంటికొచ్చి కాలర్ పట్టుకొని నిలదీస్తా’
సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హెచ్చరించారు. మైలవరంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మండిపడ్డారు. మీ లాగా ఇసుక వ్యాపారం చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని ఆయన పేర్కొన్నారు. ప్రజలు బుద్ది చెప్పినా కూడా తీరు మారని దేవినేని ఉమా వెకిలి మాటాలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే సరైన బుద్ది చెబుతామని, ఉనికిని కాపాడుకోవడం కోసం ఎదుటి వారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకునేది లేదని మండిపడ్డారు. మరోసారి తనపై నిరాధార ఆరోపణలు చేస్తే స్వయంగా మీ ఇంటికి వచ్చి కాలర్ పట్టుకుని నిలదీస్తానని ఆయన హెచ్చరించారు. -
కేసీఆర్ నాడు ఒప్పుకుని నేడు తిరగబడుతున్నారు
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విరుచుకుపడ్డారు. కేసీఆర్ గతంలో ఒప్పుకున్న అంశాలపై నేడు తిరగబడటం సరికాదని అన్నారు. విద్యార్థుల ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం నుంచి హైదరాబాద్‌పై గవర్నర్ అధికారాల వరకూ కేసీఆర్ మెళిక పెడుతున్నారని దేవినేని ఉమ విమర్శించారు. -
హల్చల్ మనోళ్లదే..
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా శాసనసభలో జిల్లా నేతలే హల్చల్ చేశారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగింది. తెలంగాణ బిల్లు సభ ముందుకు వస్తుందా.. రాదా.. అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మొదటి సారి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశం అయినప్పుడు స్పీకర్ అనూహ్యంగా బిల్లు ను ప్రవేశపెట్టారు. దీంతో సభలో కలకలం మొదలయ్యింది. తిరిగి సభ వాయిదా పడిన తర్వాత సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చింపుతుండగా కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్‌తోపాటు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ప్రతిఘటనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా పాయింట్లో తెలంగాణ బిల్లు ప్రతిని చింపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు వారిని నిలువరించేందుకు వారివైపు దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర తోపులాట జరిగింది. కమలాకర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అయిన తెలంగాణ బిల్లు తమకు పవిత్రమైందని, దాన్ని చింపడం తెలంగాణను అవమానించడమేనని గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ నిర్ణయంపై ఎవరికి ఏ అభ్యంతరాలున్నా వ్యక్తం చేసుకోవచ్చునని, కానీ తమను అగౌరవపరిచేలా వ్యవహరించడం వల్లనే అభ్యంతరం చెప్పామని పేర్కొన్నారు. దాదాపు అరగంటకు పైగా మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. సభ లోపల కూడా జిల్లా నేతలు క్రియాశీలంగా వ్యవహరించారు. బిల్లు సభకు వచ్చేలా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఉదయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన స్పీకర్‌తో సంప్రదింపులు జరిపారు. బిల్లును సభ ముందుకు తేవడంలో వారి వ్యూహం ఫలించింది. సభను అడ్డుకోవడానికి సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్లో బైఠాయించగా, డెప్యూటీ స్పీకర్ సభను నడిపించారు. సభావ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమయ్యేలా చొరవ చూపారు. తెలంగాణ బిల్లుపై ఆయన సభలో మాట్లాడారు. మొత్తానికి సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులు సభలో కీలకంగా వ్యవహరించారు.