హల్‌చల్ మనోళ్లదే.. | gangula kamalakar serious onTDP MLAs | Sakshi
Sakshi News home page

హల్‌చల్ మనోళ్లదే..

Published Tue, Dec 17 2013 5:33 AM | Last Updated on Fri, Aug 10 2018 7:19 PM

gangula kamalakar serious onTDP MLAs

సాక్షి, కరీంనగర్ : తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా శాసనసభలో జిల్లా నేతలే హల్‌చల్ చేశారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమయినప్పటి నుంచి ఉత్కంఠ కొనసాగింది. తెలంగాణ బిల్లు సభ ముందుకు వస్తుందా.. రాదా.. అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. మొదటి సారి వాయిదా అనంతరం సభ తిరిగి సమావేశం అయినప్పుడు స్పీకర్ అనూహ్యంగా బిల్లు ను ప్రవేశపెట్టారు. దీంతో సభలో కలకలం మొదలయ్యింది. తిరిగి సభ వాయిదా పడిన తర్వాత సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు బిల్లు ప్రతులను చింపుతుండగా కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్‌తోపాటు జిల్లాకు చెందిన ఇతర ఎమ్మెల్యేలు ప్రతిఘటనకు దిగారు.

 టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా పాయింట్‌లో తెలంగాణ బిల్లు ప్రతిని చింపడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమలాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు వారిని నిలువరించేందుకు వారివైపు దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర తోపులాట జరిగింది. కమలాకర్‌తోపాటు కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అయిన తెలంగాణ బిల్లు తమకు పవిత్రమైందని, దాన్ని చింపడం తెలంగాణను అవమానించడమేనని గంగుల కమలాకర్ అన్నారు.

తెలంగాణ నిర్ణయంపై ఎవరికి ఏ అభ్యంతరాలున్నా వ్యక్తం చేసుకోవచ్చునని, కానీ తమను అగౌరవపరిచేలా వ్యవహరించడం వల్లనే అభ్యంతరం చెప్పామని పేర్కొన్నారు. దాదాపు అరగంటకు పైగా మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత కొనసాగింది. సభ లోపల కూడా జిల్లా నేతలు క్రియాశీలంగా వ్యవహరించారు. బిల్లు సభకు వచ్చేలా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఉదయం నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కలిసి ఆయన స్పీకర్‌తో సంప్రదింపులు జరిపారు. బిల్లును సభ ముందుకు తేవడంలో వారి వ్యూహం ఫలించింది. సభను అడ్డుకోవడానికి సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ చాంబర్‌లో బైఠాయించగా, డెప్యూటీ స్పీకర్ సభను నడిపించారు. సభావ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌బాబు తెలంగాణ బిల్లుపై చర్చ ప్రారంభమయ్యేలా చొరవ చూపారు. తెలంగాణ బిల్లుపై ఆయన సభలో మాట్లాడారు. మొత్తానికి సోమవారం జిల్లా ప్రజాప్రతినిధులు సభలో కీలకంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement