పోలీసులపై డీఎఫ్‌ఓ ఆగ్రహం
నెల్లూరు(నవాబుపేట): మల్లెంకొండ ఆటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఘటనపై జిల్లా అటవీశాఖ అధికారి శివాల రాంబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఎర్రచందనం స్మగ్లర్లకు పోలీసుల్లో కొందరి సహకారం ఉందని ఆరోపించారు. అటవీశాఖ కార్యాలయం ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అటవీశాఖ బేస్‌క్యాంప్ సిబ్బందిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. చిలకలమర్రి సమీపంలోని మల్లెంకొండ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున పోలీసులు తమ శాఖ బేస్‌క్యాంప్ సిబ్బంది నలుగురిని అదుపులోకి తీసుకున్నారన్నారు. వారిలో ఇద్దరిని వదిలేయగా,మరో ఇద్దరిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న పీకేపాడుకు చెందిన ఎర్ర ఓబయ్య, సోమశిలకు చెందిన పరుచూరి మాలకొండయ్య రెండు నెలల క్రితమే విధుల్లోకి చేరారన్నారు. కేవలం రూ.6 నుంచి రూ.7 వేలు జీతంతో పనిచేస్తున్న బేస్‌క్యాంప్ సిబ్బందితో ఇలా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఈ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ముందుకు రారన్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని 36 గంటల పాటు చిత్రహింసలకు గురిచేశారన్నారు. వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. ఈ విషయాన్ని ఎస్పీ సెంథిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరుతామని, న్యాయం జరగని పక్షంలో విధుల బహిష్కారానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
పరస్పర సహకారంతోనే స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట
పరస్పర సహకారంతోనే స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు వీలవుతుందని డీఎఫ్‌ఓ రాంబాబు పేర్కొన్నారు. బేస్‌క్యాంప్ సిబ్బందిపై దాడి చేసి ఏదో సాధించామని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. చిత్తూరుతో పాటు నెల్లూరులోనూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పోలీసులు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయన్నారు. ఆయన వెంట ఆత్మకూరు, కావలి, ఉదయగిరి రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాల్యాద్రి, తదితరులు ఉన్నారు.