కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ..
సాక్షి ప్రతినిధి, విజయనగరం : చెమట చిందితేనే కడుపు నిండే నిరుపేద కుటుంబాలవి!..నిత్యం రెక్కలాడితేనే పిడికెడు మెతుకులు నోటికెళ్లే కూలీలు వాళ్లు. కష్టపడి పనిచేసి ఇంటిల్లిపాదీ కాసిన్ని గంజి మెతుకులు తిని సంతోషంగా బతికే వారికి ఎంతో కష్టమొచ్చింది. తమ కుటుంబ సభ్యుల ఆకలి దప్పులు తీర్చేందుకు వలస వెళ్లి అక్కడ అసువులు బాసిన ఇంటి పెద్దలు, ఇతర సభ్యుల కుటుంబాల కష్టాన్ని చూసిన రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించి పో యారు. రెండో రోజూ ఆయన పర్యటన బొబ్బిలిలో ఆరంభమై జియ్యమ్మవలస మండలంలోని నీలమాంబపురంలో రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. చోటామోటా నాయకులతోపాటు పెద్ద నాయకులు ఏజెన్సీలో పర్యటించేందుకే భయపడే పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత ఏకంగా మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ఏరియా లో పర్యటించారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం ఆయన కొండలూ వాగులూ చుట్టుముట్టారు.
నిరుపేద ప్రజల కోసం తానెంతకైనా తెగించి ముందుంటానన్న జగన్‌మోహన్‌రెడ్డి అదే విధంగా పర్యటన కొనసాగించి పేదలను పలకరించారు. చెన్నై భవన ప్రమాదంలో ఒకరు ఇద్దరు కాదు. జిల్లాకు చెందిన 24 మంది చనిపోవడంతో వారందరి ఇళ్లకూ వెళ్లారు. వారి గడపలో కూర్చున్నారు.వారిని పేరుపేరున తెలుసుకుని పలకరించారు. కష్టాల్లో తోడుంటానన్నారు. పూర్తి న్యాయం జరిగే వర కూ చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో చనిపోయిన వారిని నిత్యం తలచుకుని తలచుకుని విలపిస్తున్నవారు కాస్త కుదుటపడ్డారు. మా కష్టాలు పంచుకున్నావయ్యా! మా కన్నీళ్లకు తోడయ్యావు నాయనా!.. మా బాధల్ని చూసి పలకరించడానికి వచ్చావు. అయ్య లాంటి మనసున్న నీవు మా బోటి ఇళ్లకు అల్లంత దూరం నుంచి వచ్చి మా కన్నీళ్లు తుడుస్తున్నావు!! నీవు చల్లంగుండాలయ్యా!!! అంటూ కష్టాల్లో ఉన్న వా రంతా జగనన్నను దీవించారు. ఇంటికొచ్చి పరామర్శ చేసిన జగన్‌మోహనరెడ్డిని చూసి చలించిపోయారు.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, కురుపాం నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించారు. మంగళవారం తొమ్మిది కుటుంబాలను పరామర్శించిన ఆయన బుధవారం 15 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. మక్కువ మండలంలోని పెద గైశిలలో మూడు కుటుంబాలను, తూరుమామిడిలో మూడు కుటుంబాలను, కొమరాడ మండలంలోని దళాయిపేటలో మూడు కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా మాదలంగిలో ఒక కుటుంబా న్ని పరామర్శించారు.గ్రామానికి రహదారి సదుపా యం లేదని గ్రామస్తులు వారించినా రాత్రి 11 గంటల సమయంలో జియ్యమ్మవలసలోని నీలమాంబపురంలో ఐదు కుటుంబాలను పరామర్శించారు. ఈ సం దర్భంగా అక్కడి బాధిత కుటుంబాలు ఎంతో సంతృప్తి చెందాయి.దగ్గరి బంధువుల కన్నా ముందుగానే ఎంతో దూరంలో ఉన్న జగనన్న తమకు ఆప్తుడిగా వచ్చి పలకరించడం వారిని ఎంతో ఆనందపరచింది.
పతి ఒక్కరూ కష్టాల్లో ఉన్న విషయం తెల్సుకున్న జగనన్న తమ వద్దకు వచ్చి చూపిన ఆత్మీయతను చూసి ఆనందపరవశులయ్యారు. తమ గ్రామాల్లో ఉన్న బంధువులతో సమానంగా తమ కష్టంగా భావించి వచ్చి పరామర్శించిన జగన్‌ను చూసి అన్ని వర్గాల వారూ హేట్సాఫ్ అన్నారు. ఇటువంటి కష్టాల సమయంలో వచ్చి కన్నీళ్లను తుడిచే వాడే సిసలైన నాయకుడ్రా అని ప్రజలు బహిరంగంగా అరుస్తూ శెభాష్ జగనన్నా అనడం వినిపించింది. ఉదయం నుంచీ పరామర్శలు చేస్తూనే ఉన్న జగన్‌ను చూసిన గ్రామీణ ప్రాంత ప్రజలు మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి మీ కందరికీ బాసటగా ఉంటా! మీ బాధలు, కష్టాలు పంచుకుంటా! ఇటువంటి కష్టాలు వచ్చినపుడు కుంగిపోవద్దు! పిల్లలు, వృద్ధులను చూడాల్సింది మనమే కదా అంటూ వారిని అనునయించారు. బాధితులు ప్రతి ఒక్కరి కుటుంబానికి వచ్చిన కష్టం చూసి చలించిపోయారు జగన్.
అసలే చిన్న కుటుంబాలు. ఆర్థికంగా అంత బాగాలేకనే కదా ఇలా వలసలు వెళ్లి బతుకులీడుస్తున్నారు. ఇంతలోనే మీకెందుకు ఇలా కష్టం వచ్చింది. ఇటువంటప్పుడే గుండె దిటవు చేసుకోవాలని ఆయా కుటుంబాలకు ధైర్యం నూరిపోశారు. ఉదయం నుంచీ రాత్రి వరకు అలసట లేకుండా జగన్ పర్యటించారు. చీకటి పడిపోయినప్పటికీ అన్ని ఇళ్లకూ వెళ్లి అందరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం కూడా వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. మీ పిల్లలను చక్కగా చదివించాలని, పెద్దలను శ్రద్ధగా సాకాలనీ, భగవంతుడు అందరికీ మేలు చేకూరుస్తాడని వారిలో ఆత్మవిశ్వా సాన్ని ప్రోది చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ ప్రయాణంలో దారి పొడవునా జనం గుంపులు, గుంపులుగా చేరి జననేతను చూసి, మాట్లాడేందుకు ఎగబడ్డారు.
దీనిలో భాగంగా ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి.ఈ నేపథ్యంలో ఆయన వినతుల పరిష్కారానికి ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి, సాలూరు, కురుపాం ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, పీడిక రాజన్నదొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు శత్రుచర్ల చంద్రశేఖరరాజు, సవరపు జయమణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు గులిపల్లి సుదర్శనరావు, అవనాపు విజయ్, విక్రమ్, పరీక్షిత్‌రాజు, ప్రసన్నకుమార్, కడుబండి శ్రీనివాసరావు, కోలగట్ల వీరభద్రస్వామి, బేబీనాయన, ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ద్వారపురెడ్డి సత్యనారాయణ, మావుడి ప్రసాదనాయుడు, రెడ్డి పద్మావతి, గొర్లె వెంకటరమణ, దమయంతి, తదితరులు పాల్గొన్నారు.