తుంగభద్ర నీటిపై కుంటిసాకులు
రెండు రోజుల పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం బిజీబిజీగా గడిపారు. తొలుత సింహాద్రిపురం మండల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు.
సాగు, తాగు నీటి సమస్యతో అల్లాడుతున్నామని ప్రజలు తెలియజేయగా వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. సాగు, తాగు నీటి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడతామన్నారు. తుంగభద్ర నీటి విషయమై అధికారులు కుంటిసాకులు చెబుతుండడం మామూలైపోయిందన్నారు. ఇతర సమస్యలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. వైఎస్ మరణానంతరం వైవీయూ గురించి పట్టించుకున్న వారే లేరని వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ అమరనాథ్ రెడ్డి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు.
సాయంత్రం ‘విజేత’ మానసిక వికలాంగులతో వైఎస్ జగన్ మమేకమయ్యారు. పిల్లలందరూ గుడ్ ఈవినింగ్ సర్ అనగా, గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్ అంటూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారిని ఆప్యాయంగా పలుకరించారు. దగ్గరకు తీసుకుని పేర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో కరచాలనం చేశారు. మీకందరికీ మంచి చేసేందుకు కృషి చేస్తానన్నారు. - వివరాలు 2లోఠ
సాక్షి, పులివెందుల : తుంగభద్ర నీటి విషయంలో అధికారులు కుంటిసాకులు చెప్పడం మామూలైపోయిందని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోపించారు. తుంగభద్రలో నీరు ఉన్నప్పుడు సక్రమంగా ఇవ్వరు.. లేనప్పుడు లేదనే సాకుతో ఎగనామం పెడుతున్నారన్నారు. ప్రతి ఏడాది తుంగభద్ర నుంచి నీటిని అందించాల్సి ఉండగా.. మూడు, నాలుగేళ్లుగా సక్రమంగా అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలోని పీబీసీతోపాటు మైలవరం డ్యాంకు తుంగభద్ర నీరు రావాల్సి ఉందన్నారు. ప్రతి ఏటా కరవు వస్తుండటంతో భూములన్నీ బీళ్లుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో సింహాద్రిపురం మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలతో వైఎస్ జగన్ చర్చించారు. ఒక్కొక్క గ్రామానికి సంబంధించిన కార్యకర్తలను, ప్రజలను ఒక్కోసారి లోపలికి పిలిపించి ప్రత్యేకంగా సమావేశమై సమస్యలను తెలుసుకోవడమేకాక పరిష్కారానికి చొరవ చూపారు. ప్రధానంగా గ్రామాల్లో ఉన్న పరిస్థితులు, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు.. ఇతర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సింహాద్రిపురం మండల నాయకులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, బి.ఎన్.బ్రహ్మానందరెడ్డి, అరవిందనాథరెడ్డి, సోమశేఖరరెడ్డి, ఎంపీపీ కొమ్మా సుహాసిని, మండల ఉపాధ్యక్షురాలు శ్రీలత తదితర నాయకులు, కార్యకర్తలు సమీక్షలో పాల్గొన్నారు.
వైఎస్ జగన్‌ను కలిసిన ఇతర జిల్లాల నాయకులు :
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌రెడ్డిని పలువురు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు కలిసి చర్చించారు. పులివెందులలోని స్వగృహంలో ముందుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు జిల్లా రాజకీయాలపై చాలాసేపు చర్చించారు. తర్వాత వైఎస్‌ఆర్ సీపీ నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, అనంతపురం జిల్లా ధర్మవరం వైఎస్‌ఆర్ సీపీ నాయకులు తిమ్మంపల్లె పెద్దారెడ్డి తదితరులు కూడా వైఎస్ జగన్‌తో ప్రత్యేకంగా చర్చించారు. మైదుకూరు వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బండి హనుమంతు కూడా భేటీ అయ్యారు.
వైవీయూకు నిధులు కేటాయించేలా చూడండి
కడపలోని యోగివేమన యూనివర్శిటీకి సంబంధించి నిధులు కేటాయించకుండా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, దివంగత సీఎం వైఎస్‌ఆర్ మరణానంతరం యూనివర్శిటీ అభివృద్ధి పనులకు నోచుకోలేక మొండి గోడలతో దర్శనమిస్తోందని.. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌ను వైఎస్‌ఆర్ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ బి.అమరనాథరెడ్డి కలిశారు.
భవనాలు, హాస్టల్ వసతి, పూర్తికాక అటు అధికారులు.. ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. కాగా వైఎస్ జగన్ రెండు రోజుల జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 8న ఇడుపులపాయకు వచ్చిన వైఎస్ జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు.
మధ్యాహ్నం పులివెందులకు చేరుకొని వేంపల్లె మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. 9వ తేదీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. సింహాద్రిపురం మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, కార్యకర్తలతో చర్చించారు. సాయంత్రం పులివెందులలో విజేత మానసిక వికలాంగుల పాఠశాలలో వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని వైఎస్ జగన్‌రెడ్డి ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వస్తున్న జనాలందరితోనూ జగన్ మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బుధవారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.