
‘యడం’ అస్తమయం
వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చీరాల నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యడం చినరోశయ్య(69) శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు.
చీరాల, న్యూస్‌లైన్: వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చీరాల నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యడం చినరోశయ్య(69) శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు గడప గడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయల్దేరబోతున్న ఆయనకు గుండెపోటు రావడంతో ఇంటి ఆవరణలోనే తుళ్లిపడ్డారు. కుటుంబ సభ్యులు, కార్యకర్తలు ఆయన్ను వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు వదిలారు.
శుక్రవారం రాత్రే గుండె నొప్పిగా ఉండటంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించగా కేవలం గ్యాస్ట్రిక్ సమస్య మాత్రమేనని, గుండె సమస్య లేదని చెప్పడంతో ఇంటికి వెళ్లారు. చిన రోశయ్య తండ్రి యడం చెన్నయ్య 17 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేశారు. తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అత్యంత ఆప్తుడిగా ఉన్న చినరోశయ్య దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ పటిష్టతకు చురుగ్గా పనిచేశారు. ఇటీవల వైఎస్‌ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య శంఖారావం కార్యక్రమానికి చీరాల నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి భారీగా జనాన్ని తరలించారు.
శోకసంద్రంలో యడం కుటుంబం..
శుక్రవారం రాత్రి కూడా పార్టీ కార్యాలయంలో సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించి పేద, దళిత మహిళలకు చీరలు పంపిణీ చేసిన చినరోశయ్య ఉదయాన్నే ఉన్నట్టుండి కన్ను మూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కుమారుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కార్యదర్శి యడం బాలాజీ ‘అమెరికాను వదిలి నీ కోసం ఇండియాకు వస్తే నన్ను వదిలేసి వెళ్లిపోయావంటూ’ విలపించడం చూసిన వారంతా కంటతడి పెట్టారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పరామర్శ: గుండెపోటుతో అకాల మరణం చెందిన యడం చినరోశయ్య కుటుం బాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. చినరోశయ్య తనయుడు యడం బాలాజీతో 15 నిమిషాలు మాట్లాడారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.
తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా..
చినరోశయ్య మృతి సమాచారం తెలుసుకున్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫోన్ చేసి చినరోశయ్య కుమారుడు యడం బాలాజీని పరామర్శించి సంఘటన ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు.
బాలినేని నివాళులు...
వైఎస్‌ఆర్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి హుటాహుటిన చీరాల వచ్చి చినరోశయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న చినరోశయ్య తనయుడు యడం బాలాజీని ఓదార్చారు.
పలువురి నివాళులు...
యడం చినరోశయ్య భౌతికకాయానికి చీరాల ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున నివాళులర్పించారు. అలానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ, అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు యల్లసిరి గోపాలరెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ పలు విభాగాల కన్వీనర్లు భవనం శ్రీనివాసరెడ్డి, కర్నేటి వెంకటప్రసాద్, కఠారి శంకర్, సమన్వయకర్తలు పాలేటి రామారావు, సజ్జా హేమలత, అవ్వారు ముసలయ్య, వి.అమృతపాణి, పట్టణ కన్వీనర్ యాతం ఆనందరావు, స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.
చినరోశయ్య రాజకీయ నేపథ్యం ఇదీ..
తండ్రి నుంచి రాజకీయ వారసత్వం పుణికి పుచ్చుకున్న రోశయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 1981 మున్సిపల్ కౌన్సిలర్ ప్రతిపక్ష నాయకుడిగా, ఆర్‌టీఏ జిల్లా సభ్యునిగా పని చేశారు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. స్థానిక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడిగా పని చేసిన ఆయన ప్రస్తుతం చీరాల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.