
వివాదాలతో ఇరు రాష్ట్రాలకు నష్టం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. చట్టాలు, రాజ్యాంగ స్ఫూర్తిని పక్కన పెడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాలపై ఉందని యనమల సూచించారు.
'విభజన బిల్లు తయారీలో కేసీఆర్ పాత్ర కీలకం. అలాంటిది ఆయనే చట్టాన్ని వ్యతిరేకించడం సరికాదు. బిల్లును రూపొందించినపుడు టీడీపీ నాయకులను సంప్రదించలేదు. బిల్లు లోక్‌సభకు వచ్చినప్పుడు కేసీఆర్ మాట్లాడారా? వివాదాలను సృష్టించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. వివాదాల వల్ల అందరికీ నష్టం జరుగుతుంది. ఎక్కడున్నా తెలుగువారే అని గుర్తించాలి' అని యనమల అన్నారు.