ఖాళీ బిందెలు కదం తొక్కాయ్ | yarcp leaders fires on government | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలు కదం తొక్కాయ్

Published Tue, May 3 2016 4:23 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

ఖాళీ బిందెలు కదం తొక్కాయ్ - Sakshi

ఖాళీ బిందెలు కదం తొక్కాయ్

రాష్ర్టంలో తాండవిస్తున్న దుర్భిక్షం
గొంతెండుతున్న పల్లెలు, పట్టణాలు
నివారణ చర్యల్లో సర్కారు విఫలం
పాలనను గాలికొదిలి.. అవినీతి సంపాదనపై దృష్టి
ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేతలు
మండలాలు, పట్టణాల్లో ఖాళీ బిందెలతో నిరసనలు
తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు

 
 సాక్షి, విశాఖపట్నం: ‘కరువుతో రెండేళ్లుగా రాష్ట్రం అల్లాడుతోంది. గుక్కెడు నీళ్లు లేక ప్రజలు.. పశుపక్ష్యాదులు  విలవిల్లాడుతుంటే.. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఆ అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. పాలనను గాలికొదిలేశారు’.. అని వైఎస్సార్‌సీపీ నేతలు నిప్పులు చెరిగారు. కరువును ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ధర్నాలు చేయాలన్న ఆపార్టీ అధినాయకత్వం ఇచ్చిన పిలుపునకు జిల్లాలో అనూహ్య స్పందన లభించింది. ఊరూ వాడా ఒక్కటై మండల కేంద్రాల్లో కదం తొక్కారు.


 జీవీఎంసీ వద్ద మహాధర్నా
 విశాఖ నగరంలోని జీవీఎంసీ మెయిన్ గేటు ఎదుట నగర పరిధిలోని ఆరు నియోజకవర్గాల కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ మాట్లాడుతూ కరువు గురించి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి విషమించిందన్నారు. చంద్రబాబు సర్కార్‌కు ప్రజల బాగోగులు, వారి ఇబ్బందులు పట్టవన్నారు. ఎమ్మెల్యేలను, రౌడీషీటర్లను పార్టీలోకి చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారే తప్ప ప్రజల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ కార్యక్ర మాలతో పవిత్ర విశ్వ విద్యాలయాలను పార్టీ కార్యాలయాలుగా మార్చేస్తున్నారని ఆరోపించారు.

తండ్రీకొడుకులిద్దరు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. బ్రాండిక్స్ కార్మికుల ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నారని.. కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తైనాలవిజయ్‌కుమార్ మాట్లాడుతూ బాబు ఎప్పుడు వచ్చినా కరువు వస్తుందని.. మంచినీళ్లు కూడా దొరకవన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో చూపిస్తున్న శ్రద్ధ విభజన హామీల అమలులో చూపిస్తే బాగుంటుందని హితవు పలికారు. జిల్లాలో ఎక్కడ చూసినా తాగేందుకు గుక్కడు నీళు ్లకూడా లేవని మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రెండ్రోజులకొకసారి కూడా మంచి నీళ్లు రాని పరిస్థితులు నెలకొన్నా అధికారులు, మంత్రులకు పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం ఆరోపించారు.

ఒకసారి ఓట్లేసిన పాపానికి ఐదేళ్లు ఈ మాయదారి ప్రభుత్వాన్ని భరించాల్సి వస్తుందని, ్రపజలు తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ హెచ్చరించారు. పార్టీ సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డిలు మాట్లాడుతూ కరువుతో రాష్ర్టం అల్లాడుతుంటే చంద్రబాబు సోకులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అన్ని రంగాల్లోనూ బాబు సర్కార్ విఫలమైందన్నారు. కరువు విలయ తాండవం చేస్తుంటే విశాఖలో క్రికెట్ మ్యాచ్‌లు పెడుతున్నారని, కేజీహెచ్‌ను పట్టించుకోని బాబు కార్పొరేట్ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నారని పార్టీ రాష్ర్ట అధికార ప్రతినిధి కొయ్యా ప్రసాద్‌రెడ్డి విమర్శించారు.

అడ్డుకున్న పోలీసులు : ధర్నా అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు నాయకులకు మధ్య స్వల్ప తోపులాటలు జరిగాయి. చివరకు ముఖ్యనేతలను లోనికి వెళ్లేందుకు అనుమతించడంతో అమర్‌నాథ్‌తో సహా నేతలంతా వెళ్లి కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో తాగునీటి ఎద్దడే లేదని వ్యాఖ్యానించడంతో పార్టీ నేతలు ఆయనతో వాగ్వావాదానికి దిగారు. తమ వెంట వస్తే తాగునీటి ఎద్దడి ఎక్కడ ఉందో, ప్రజలు ఏ విధంగా ఇబ్బందిపడుతున్నారో చూపిస్తామని సవాల్ విసిరారు.

ఈ ఆందోళన కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీ, రాష్ర్ట ప్రచార కమిటీ కార్యదర్శి రవిరెడ్డి, రాష్ర్ట యువజన విభాగం అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, మహిళా విభాగం నగరాధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, అనుబంధ విభాగాల రాష్ర్ట, జిల్లా నాయకులు ఫరూఖి, షరీఫ్, ఉరుకూటి అప్పారావు, బోని శివరామకృష్ణ, సత్తి రామకృష్ణారెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా, నగర నాయకులు రొంగలి జగన్నాధం, కృష్ణంరాజు, కలిదిండి భద్రీనాథ్, బర్కత్ అలీ, బయ్యవరపు రాధ, వాసు, అల్లంపల్లి రాజబాబు, బొక్కమంతుల కాంతారావు, బోని షణ్ముఖరావు, కనకాల ఈశ్వరరావు, మసిపోగు రాజు, మాటూరి చిన్నారావు, అళ్ల గణేష్, బోని దేవి తదితరులు పాల్గొన్నారు.

కరువు నివారణలో ప్రభుత్వ వైఫల్యంఃబూడి: కరువు నివారణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. మాడుగుల తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో ఎమ్మెల్యే బూడి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువును ఎదుర్కోవడంలో విఫలమైన బాబు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనడంలో పోటీపడుతున్నారన్నారు. జన్మ భూమి కమిటీలు తమకు నచ్చిన వాళ్లకు పింఛన్లు, ఇళ్లు ఇతర సంక్షేమ పథకాలను ఇచ్చుకుంటున్నాయని, ఈ కమిటీల వల్ల అర్హులైన పేదలు అన్యాయమైపోతున్నార న్నారు.


 కలుషిత నీటితో రోగాలు: గిడ్డి ఈశ్వరి : ఏజెన్సీలో మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, తాగేందుకు రక్షిత నీరు లేక చెలమల్లో కలుషిత నీటిని తాగుతూ గిరిజనులు రోగాల బారినపడుతున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. పాడేరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వైఎస్ ఎంపీపీ మాదెల బొజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు. జి.కె వీధిలో జరిగిన ధర్నాలో కూడా ఎమ్మెల్యే ఈశ్వరి, ఎంపీపీ సాగినబాలరాజు, చింతపల్లి జెడ్పీటీసీ పద్మకుమారి పాల్గొన్నారు.

 ప్రజలను గాలికొదిలేసిన బాబు: గొల్ల, డివిఎస్‌ఎన్ రాజు : రాష్ట్రంలో పాలనను పూర్తిగా గాలికొదిలేశారని, బాబు హామీల ఉచ్చులో పడి ప్రజలు అన్ని విధాలుగా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ డీవీఎస్‌ఎన్ రాజు ఆందోళన వ్యక్తం చేశారు. పాయకరావుపేటలో బాబూరావు, కోటవురట్లలో డివిఎస్‌ఎన్ రాజులు మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో జరిగిన ధర్నాల్లో పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణ నక్కపల్లిలో జరిగిన ధర్నాలో పాల్గొని ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.

 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారుః ధర్మశ్రీ : రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. రావికమతం తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. కరువుతో అల్లాడుతున్న ప్రజల గోడు పట్టించుకోకుండా ఏ ఎమ్మెల్యేకు ఎరవేద్దాం.. ఎన్ని కోట్లు ఇచ్చి కొందామన్న తపన తప్ప మరొకటి లేదన్నారు. పెందుర్తి బీఆర్‌టీఎస్ రహదారి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సమన్వయకర్త అదీప్ రాజు. రాష్ర్ట సంయుక్త కార్యదర్శి డి.భగవాన్‌జయరామ్, జిల్లా కార్యదర్శి గొర్లె రామునాయుడు తదితరులు వెంటరాగ ఖాళీ బిందెలతో వందలాది మంది మహిళలు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. నర్సీపట్నం పాల్‌ఘాట్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్‌గణేష్‌తో సహా వందలాది మంది మహిళలు, పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేశారు.

తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. అనకాపల్లి ఆర్డీవో ఆఫీస్ వద్ద పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె సూరిబాబు ఆర్డీవో కార్యాలయం ధర్నా చేసి ఆర్డీవో పద్మావతికి వినతిపత్రం సమర్పించారు. భీమిలి పట్టణాధ్యక్షుడు అక్కరమాని వెంకట్రావు ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేశారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రాష్ర్ట మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పలివెల అమృతవల్లి యలమంచలిలో, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు లాలం రాము అచ్యాతుపురంలో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్నారు. జిల్లా అధికార ప్రతినిధి శెట్టి అప్పాలు వందలాది మహిళలతో కలిసి అరకులో ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో  ఆయా మండలాల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement