ఎల్లలు దాటుతున్న ఎర్రబంగారం
సూళ్లూరుపేట: ఎంతో విలువైన ఎర్రచందనం దేశసరిహద్దులు దాటుతోంది. నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లోని అటవీప్రాంతాల నుంచి తమిళనాడు మీదుగా విదేశాలకు భారీఎత్తున ఎర్రచందనం రవాణా అవుతోంది. ఈ అక్రమ రవాణాను ఆసరాగా అటు స్మగ్లర్లు, ఇటు అధికారులు కోట్లకు పడగలెత్తుతున్నారు.
ఈ వ్యవహారం దొరికితే దొంగలు లేదంటే దొరలు అన్నట్టుగా తయారైంది. జిల్లాలోని వెంకటగిరి, రాపూరు, సూళ్లూరుపేట, తడ, నాయుడుపేట ప్రాంతాల్లోనే కాకుండా చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో ఏదో ఒకచోట ఎర్రచందనం తరలించే వాహనాలు తరచూ పట్టుబడుతూనే ఉన్నాయి. ఈ అక్రమ రవాణాకు మినిలారీలు, పార్శిల్ లారీలు, ఖరీదైన కార్లకు సీట్లు తొలగించి ఉపయోగిస్తున్నారు. ఖరీదైన అధునాతన వాహనాలకు ఏదో ఒక రాజకీయ నాయకుడి(ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ) స్టిక్కర్లు వేసుకుని దర్జాగా రవాణా చేస్తున్నారు.
ఎర్రచందనానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలోని వెలిగొండ అటవీప్రాంతంలో సుమారు 2 లక్షల హెక్టార్లలో, అదే విధంగా తిరుమల-తిరుపతి కొండల్లోని శేషాచలం అడవుల్లో విస్తారంగా ఎర్రచందనం విస్తరించి ఉందని అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అక్రమ రవాణాలో పట్టుబడిన వారంతా ఎర్రచందనాన్ని నరికే కూలీలే ఎక్కువ. అసలు సిసలైన బడా వ్యక్తులు మాత్రం పట్టుబడరు. సంవత్సరానికి సుమారుగా రూ.260 కోట్లు నుంచి రూ.500 కోట్లు విలువచేసే ఎర్రచందనాన్ని ఎల్లలు దాటిస్తున్నారని అధికారుల లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల కడప, రాజంపేట, తిరుపతి పట్టణాల్లో ఎర్రచందనాన్ని నరికే కూలీలను భారీ ఎత్తున అరెస్ట్ చేసినప్పటికీ రవాణా ఆగలేదంటే పలు అనుమానాలకు తావిస్తోంది. తిరుపతి, కడప ప్రాంతాల్లో నిఘా ఎక్కువ కావడంతో కూలీలు కర్నాటక మీదుగా రూటు మారి రావడమే కాకుండా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాలను కేంద్రంగా చేసుకుని స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. నియోజకవర్గంలోని తడలో 2005లో పోలీసుల సాయంతో తమిళనాడు గుమ్మిడిపూండికి చెందిన ఓ స్మగ్లర్ జాతీయ రహదారికి పక్కనే మూతపడిన ఓ కంపెనీని లీజుకు తీసుకుని ఏకంగా సామిల్లు పెట్టాడు.
ఈ సామిల్లులోనే ఎర్రచందనాన్ని కటింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేసేవారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి సుమారు మూడు కోట్లు విలువైన ఎర్రచందనాన్ని ఈ సామిల్లులో పట్టుకున్నారు. ఇటీవల సూళ్లూరుపేట మండలంలో సుగ్గుపల్లి చెరువు కేంద్రంగా చెరుకుతోటల్లో, కాలువల్లో, చెరువుల్లో భారీ ఎత్తున నిల్వ చేసిన ఎర్రచందనం దుంగలను పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా నాయుడుపేట మండలంలో రెండు విడతలుగా సుమారు వంద దుంగలను పట్టుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా శనివారం దొరవారిసత్రం మండలం నెలబల్లి అటవీప్రాంతంలో నిల్వ చేసిన రూ.5 లక్షల ఎర్రచందనం దుంగలను పట్టుకుని లోడ్ చేస్తున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సరిహద్దు మండలాలకు చెందిన కొంతమంది పోలీసులకు ఎర్రచందనం అక్రమ రవాణాలో భారీ ఎత్తున మామూళ్లు అందుతుండటంతో వాళ్లే రూట్ చూసి పంపిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసుల్లో కొంతమంది స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో పాటు ఎర్రచందనం అక్రమ రవాణాలో కూడా పోలీసుల పాత్ర ఎక్కువగా ఉండడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనేది బహిరంగ రహస్యమే.