
ఎల్లో బస్
నాది దాదాపు 50 ఏళ్ల చరిత్ర. ఇప్పుడు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న వారెందరో మొదట్లో నా ఒడిలో డ్రైవింగ్ నేర్చుకున్నవారే. వారందరి జీవితాలకు రాజమార్గాన్ని చూపిన నన్ను ఇప్పుడు ఎవరికీ పట్టనట్లు మూలనపడేశారు. నా వల్ల ఎంతో ప్రయోజనం పొంది కూడా ఇప్పుడు నా బాగోగులు చూసుకునే నాథులే లేరు.
ఇంతకీ నేనెవరెంటే.. ‘ఎల్లో బస్’ని. కంచరపాలెం ప్రభుత్వ పాత ఐటీఐలో ఉంటాను. పుట్టింది, అడుగు పెట్టింది 1965. నా విధి భారీ వాహనాలు నడపడానికి శిక్షణ ఇవ్వడం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘డ్రైవింగ్’ నేర్పడం. ఇప్పటికే వేలాది మందిని డ్రైవర్లుగా తయారు చేశాను. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉపాధి కల్పించాను. వేలాదిమందిని రవాణా కార్మికులుగా తీర్చిదిద్ధిన ఘనత నాది. డ్రైవింగ్‌లో మెలకువలు నేర్పాను. అందరి జీవితాల్లో వెలుగు నింపాను.
ఉపాధితో దారి చూపాను. విచిత్రం ఏమిటంటే గురువుగా నన్ను గౌరవించలేదు. శిక్షణ పూర్తి తర్వాత నావైపు కన్నెత్తి చూడలేదు. ఇటీవల సామర్థ్య పరీక్షకు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాను. వయస్సు మీరిందని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు. నన్ను నేరుగా తీసుకువచ్చి ఐటీఐలో పడేశారు. రోజూ పలుకరించి నా ఆలన...పాలన చూసుకునే డ్రైవర్ రావడం మానేశాడు. ఐటీఐ అధికారులు నన్ను తుక్కు విలువకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారా! అనే సందేహం కలుగుతోంది.
అదే జరిగితే ఇక నేను కనిపించను. విజయవాడ బస్టాండులో ఓ పాత ఆర్టీసీ బస్సును ప్రదర్శనగా ఉంచారని. ఆర్టీసీకి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రజల సందర్శన కోసం బస్టాండులో అలా ఉంచారని విన్నాను. ఇక్కడ పాత ఐటీఐలో బోలెడంత ఖాళీ స్థలం ఉంది. నన్ను కూడా అలా ప్రదర్శనగా ఉంచితే ఎంత బాగుంటుందో కదూ..
- న్యూస్‌లైన్, మర్రిపాలెం