కల్పవృక్ష వాహనంపై గోవిందుడి వైభవం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం ఉదయం గోవిందరాజస్వామి కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, కేరళ వాయిద్య విన్యాసాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
వాహన సేవ అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనాన్ని వేడుకగా నిర్వహించారు. సుగంధ పరిమళాలు, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. సాయంత్రం ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి సర్వభూపాల వాహన సేవ సాగింది. కార్యక్రమంలో పెదజీయంగార్, చిన్నజీయంగార్, టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో చంద్రశేఖర్‌పిళ్లై, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ కళావేదికలపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఇందులో భాగంగా గోవిందరాజస్వామి ఆలయంలో ఉదయం ఎస్‌కె.స్వర్ణకుమారి బృందం విష్ణుసహస్రనామ పారాయణం సాగింది. అనంతరం కే.రవీంద్రరెడ్డి పురాణ ప్రవచనం, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గోవిందరాజస్వామి పుష్కరిణిలో రాత్రి ఎం.వాణి హరికథ పారాయణం చేశారు. మహతి కళాక్షేత్రంలో చెన్నైకు చెందిన జే.జనని బృందం ప్రదర్శించిన భక్తి సంగీతం అలరించింది. రామచంద్ర పుష్కరిణి వద్ద అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల హరికథా కాలక్షేపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
నేడు గరుడ సేవ
గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి గరుడ సేవ జరగనుంది. ఉదయం పల్లకీ సేవ నిర్వహించనున్నారు.